Polavaram: పోలవరానికి పాత ధరలే

పోలవరం ప్రాజెక్టులో ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తంలో రూ.1,383 కోట్ల మేర బిల్లులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ తిరస్కరించింది. గతంలో విభాగాల వారీగా పరిమితులు... 

Updated : 16 Feb 2022 05:20 IST

2013-14 ప్రకారమే ఖర్చులను చెల్లిస్తున్నాం
కొత్త ఒప్పందం ఆధారంగా ఇవ్వలేం
రూ.551 కోట్ల బిల్లులు వెనక్కి..
మొత్తం రూ.1,383 కోట్లను తిరస్కరించిన పోలవరం అథారిటీ
ఈనాడు - అమరావతి

పోలవరం ప్రాజెక్టులో ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తంలో రూ.1,383 కోట్ల మేర బిల్లులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ తిరస్కరించింది. గతంలో విభాగాల వారీగా పరిమితులు పెట్టి, అంతకన్నా మించి ఖర్చు చేసిన రూ.831.93 కోట్ల పనులకు సంబంధించిన బిల్లులను చెల్లించబోమని తేల్చిచెప్పింది. ఇప్పుడు వాటికి అదనంగా ఇతర కారణాలను చూపుతూ మరో రూ.551.37 కోట్ల బిల్లులను తిరస్కరించింది. స్పిల్‌వే, విద్యుత్కేంద్రం, ప్రధాన రాతి, మట్టి కట్టడాల నిర్మాణానికి అదనపు ధరల పేరుతో పెట్టిన బిల్లులను ఇవ్వబోమంది. ‘‘మేం 2013-14 ధరలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని బిల్లులు చెల్లిస్తున్నాం. అందువల్ల కొత్త ఒప్పందం ప్రకారం సమర్పిస్తున్న వాటిని చెల్లించబోం’ అంటూ అథారిటీ వాటిని వెనక్కి పంపింది.

* కొత్త ఒప్పందం ప్రకారం ఖర్చు చేసిన మొత్తంలో వివిధ పనుల కింద జలవనరుల శాఖ పంపిన బిల్లులను ఇటీవల పోలవరం అథారిటీ తిరస్కరించింది. ఈమేరకు రూ.324.84 కోట్ల బిల్లులను వెనక్కి పంపింది. వాటిలో ఒప్పందాన్ని దాటి ఉన్నాయని
రూ.137.47 కోట్లు, అదనపు ధరల రూపంలో ఉన్నాయని రూ.94.66 కోట్లు, తాజా ఒప్పందానికి అనుగుణంగా ఉన్నాయని డీ వాటరింగ్‌ (నీటిని ఎత్తిపోసినందుకు) పేరిట సమర్పించిన రూ.95.71 కోట్ల బిల్లులపై అభ్యంతరాలు వ్యక్తంచేసింది.

* పోలవరం విద్యుత్కేంద్రం నిర్మాణానికి డిసెంబరు వరకు చేసిన ఖర్చులకు సంబంధించిన రూ.133.97 కోట్ల బిల్లులను తిరస్కరించింది. విద్యుత్కేంద్రం కోసం నిధులు ఇవ్వబోమని ఇప్పటికే కేంద్రం స్పష్టంచేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యుత్కేంద్రం నిధులు అడగబోవడం లేదు. అయితే అక్కడ జరిగే మట్టి తవ్వకం పనులకు నిధులు ఇవ్వాలని, అది   విద్యుత్కేంద్రం కాంపొనెంట్‌ కిందికి రాదని    వాదిస్తోంది. ఇందుకు పోలవరం అథారిటీ ససేమిరా అంటోంది.
* కుడి కాలువలో తాత్కాలిక నిర్మాణాల కోసం చేసిన రూ.71.37 కోట్ల ఖర్చును ఇచ్చేందుకూ ఒప్పుకోవడం లేదు. అవి పట్టిసీమ నీటిని వినియోగించుకునేందుకు తాత్కాలికంగా నిర్మించిన కట్టడాలకు సంబంధించిన బిల్లులని తేల్చింది.

విభాగాల వారీగా ఖర్చులూ మీరలేం...

పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర ఆర్థిక శాఖలు 2013-14 ధరల ప్రకారం ఏ ఖర్చులు అయితే ఉన్నాయో అంత మొత్తమే ఇకపై చెల్లిస్తామని గతంలో పేర్కొన్నాయి. 2020 సెప్టెంబరు నాటికి మిగిలి ఉన్న రూ.7,053 కోట్ల మేర మాత్రమే పోలవరానికి నిధులు ఇవ్వగలమన్నాయి. అప్పటి నుంచి పోలవరానికి సవరించిన అంచనాల మేరకు 2017-18 ధరల ప్రకారం కేంద్రం పెట్టుబడి అనుమతులు ఇవ్వలేదు. పోలవరం అథారిటీ కొర్రీలపై కొర్రీలు వేస్తూనే ఉంది. దీంతో అందులో వివిధ కాంపొనెంట్ల కింద పాత ధరల కింద ఎంత ఆమోదం పొందిందో అంతకుమించి నిధులు ఇచ్చేది లేదని అథారిటీ చెబుతోంది. ఆయా పరిమితుల మేరకు ఇప్పటికే రూ.831 కోట్లను తిరస్కరించింది.


అథారిటీకి రాష్ట్ర జలవనరుల శాఖ లేఖ

కొత్త ఒప్పందం ప్రకారం చేస్తున్న పనులకు ప్రధాన డ్యాం పరిధిలో నిధులు ఇవ్వబోమని చెప్పడం సరికాదని పోలవరం అధికారులు వాదిస్తున్నారు. ఈ మేరకు పోలవరం అథారిటీ సీఈవోకు లేఖ రాశారు. పోలవరంలో చేపట్టే ఏ అదనపు పనులైనా అవి కేంద్ర జలసంఘం నిపుణులు, డ్యాం డిజైన్‌ రివ్యూ కమిటీ సూచనల మేరకే మార్చాల్సి వస్తోందని అందులో వారు పేర్కొన్నారు. ఆకృతుల కమిటీ సిఫార్సుల మేరకు అదనంగా చేసే పనులకు నిధులు ఇవ్వబోమంటే ఎలా అని ప్రశ్నించారు. కేంద్ర నిపుణుల సిఫార్సుల మేరకు చేసిన అదనపు పనులు, ఆకృతుల మార్పునకు, అదనపు పరిమాణాల్లో చేసిన పనులకు నిధులను ఇవ్వాల్సిందేనని కోరారు. ఈ కోణంలో చూసినప్పుడు తిరస్కరించిన కొన్ని బిల్లులను పరిశీలిస్తామన్న హామీ లభించినట్లు తెలిసింది. వాటిని పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారికంగా ప్రాసెస్‌ చేయాల్సి ఉంది.


పోలవరం ప్రాజెక్టు పనుల్లో మరో ఘట్టం పూర్తయింది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం అంగుళూరు వద్ద ఏర్పాటు చేస్తున్న జలవిద్యుత్తు కేంద్రానికి సంబంధించిన 12 ప్రెజర్‌ టన్నెళ్ల తవ్వకం పనులు పూర్తయ్యాయి. ఒక్కోటి సుమారు 168 మీటర్ల పొడవు, 9 మీటర్ల వెడల్పు ఉన్నాయి.

- న్యూస్‌టుడే, దేవీపట్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని