గూగుల్‌కు మార్గదర్శి

ప్రపంచ అగ్రగామి సెర్చ్‌ ఇంజిన్‌ అయిన గూగుల్‌, దాని మాతృసంస్థ ఆల్ఫాబెట్‌కు సీఈఓ అయిన సుందర్‌ పిచాయ్‌ చెన్నైలో జన్మించారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెటలర్జికల్‌ ఇంజినీరింగ్‌ చేసిన పిచాయ్‌ 2004లో గూగుల్‌లో ప్రోడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఉపాధ్యక్షుడిగా

Published : 26 Jan 2022 03:30 IST

సుందర్‌ పిచాయ్‌ - పద్మభూషణ్‌

ప్రపంచ అగ్రగామి సెర్చ్‌ ఇంజిన్‌ అయిన గూగుల్‌, దాని మాతృసంస్థ ఆల్ఫాబెట్‌కు సీఈఓ అయిన సుందర్‌ పిచాయ్‌ చెన్నైలో జన్మించారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెటలర్జికల్‌ ఇంజినీరింగ్‌ చేసిన పిచాయ్‌ 2004లో గూగుల్‌లో ప్రోడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఉపాధ్యక్షుడిగా చేరారు. 2015 ఆగస్టులో గూగుల్‌ బాధ్యతలు చేపట్టారు. అత్యంత విజయవంతమైన గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌తో పాటు ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఆండ్రాయిడ్‌, యాప్స్‌ ఆవిష్కరణ బృందాలకు నేతృత్వం వహించారు.


కార్పొరేట్‌ పరుగుల వీరుడు
ఎన్‌.చంద్రశేఖరన్‌  - పద్మభూషణ్‌

దేశంలో అతిపెద్ద కార్పొరేట్‌ సామ్రాజ్యాల్లో ఒకటైన టాటా సన్స్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి పార్శీయేతర వ్యక్తి చంద్రశేఖరన్‌. సైరస్‌ మిస్త్రీ స్థానంలో వచ్చిన ఆయన.. గ్రూప్‌ను శరవేగంగా పరుగులు పెట్టిస్తున్నారు. 1987లో సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామర్‌గా టీసీఎస్‌లో చంద్రశేఖరన్‌ చేరారు. 2007 సెప్టెంబరులో టీసీఎస్‌ బోర్డులోకి వచ్చారు. సీఓఓగా పదోన్నతి సాధించి కంపెనీ వ్యూహాత్మక కొనుగోళ్లను పక్కాగా పూర్తిచేశారు. 2009లో 46 ఏళ్ల వయసులోనే టీసీఎస్‌ సీఈఓ, ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. టాటా గ్రూప్‌ అతిపిన్న సీఈఓల్లో ఒకరుగా ఈయన చరిత్ర సృష్టించారు.  


టీకాల కుబేరుడు
సైరస్‌ ఎస్‌ పూనావాలా - పద్మభూషణ్‌

ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీ సంస్థల్లో ఒకటైన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాను స్థాపించిన సైరస్‌ పూనావాలా, సంస్థ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. 150 కోట్ల డోసుల టీకాలను ఈ సంస్థ తయారు చేసి, అంతర్జాతీయంగా సరఫరా చేస్తోంది. తట్టు, పోలియో, ఫ్లూ, బీసీజీ సహా పలు వ్యాధులకు టీకాలను ఈ సంస్థ తయారు చేస్తోంది. ప్రపంచంలోని పిల్లల్లో 65 శాతం మందికి కనీసం ఒక్కడోసు టీకా అయినా సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో తయారైంది చేసిఉంటారని అంచనా. కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ‘కొవిషీల్డ్‌’ ఉత్పత్తితో సైరస్‌ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఫార్చ్యూన్‌ భారత కుబేరుల జాబితాలో రూ.1.45 లక్షల కోట్ల సంపదతో ఆయన 5వ స్థానంలో ఉన్నారు. 2005లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం లభించగా.. తాజాగా పద్మభూషణ్‌ అవార్డును ఇచ్చి ప్రభుత్వం సత్కరించింది. సైరస్‌ తనయుడు అదర్‌ పూనావాలా ప్రస్తుతం సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓగా వ్యవహరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని