Borewell: బోర్ల పథకం బోర్లా

రైతుల వ్యవసాయ భూముల్లో ఉచితంగా బోర్లు తవ్వి మోటార్‌ ఏర్పాటు చేసే ‘వైఎస్‌ఆర్‌ జలకళ పథకం’ అమలు ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా తయారైంది.

Updated : 26 Apr 2022 05:42 IST

రైతుల భూముల్లో ఉచిత బోర్ల తవ్వకాలు అంతంతే
తవ్విన చోట విద్యుత్తు సదుపాయం అరకొర

ఈనాడు, అమరావతి: రైతుల వ్యవసాయ భూముల్లో ఉచితంగా బోర్లు తవ్వి మోటార్‌ ఏర్పాటు చేసే ‘వైఎస్‌ఆర్‌ జలకళ పథకం’ అమలు ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా తయారైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా 2 లక్షల బోర్లు తవ్వించి మోటార్లు ఏర్పాటు చేస్తామని 2020 సెప్టెంబరులో పథకం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.3,940 కోట్లు ఖర్చు చేస్తుందని  వెల్లడించారు. ఈ పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,10,786 మంది రైతులు దరఖాస్తులు చేశారు. వీటిలో నుంచి 1,74,931 మంది అర్హులుగా అధికారులు గుర్తించారు.

20 నెలల్లో తవ్వింది 12,567 బోర్లే!
పథకాన్ని ప్రారంభించాక గత 20 నెలల వ్యవధిలో 12,567 బోర్లే తవ్వారు. లక్ష్యం ప్రకారమైతే ఈపాటికే 50 వేలకుపైగా బోర్లు తవ్వాలి. తొలి ఏడాది పనులు జోరుగా సాగినా క్రమంగా తగ్గుముఖం పట్టాయి. బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో గుత్తేదారులు కొన్నాళ్లు పనులు నిలిపివేశారు. గతంలో నిత్యం 40 నుంచి 50 బోర్లు తవ్విన సందర్భాలున్నాయి. ఇప్పుడు 10-15 తవ్వడం గగనమవుతోంది.
బోరు వేసేందుకు అడుగుకు రూ.112 నుంచి రూ.145 వరకు చెల్లించేందుకు గ్రామీణాభివృద్ధిశాఖ గుత్తేదారులతో మొదట ఒప్పందం చేసుకుంది. అప్పట్లో రూ.87 ఉన్న డీజిల్‌ లీటర్‌ ధర.. ప్రస్తుతం రూ.100కి చేరుకుంది. దీంతో అడుగుకి రూ.160 చొప్పున చెల్లించాలని గుత్తేదారులు డిమాండ్‌ చేస్తున్నారు.

329 బోర్లకే విద్యుత్తు సదుపాయం
బోర్లు తవ్విన వాటిలో ఐదెకరాల్లోపు సన్న, చిన్నకారు రైతులకు ఉచితంగా విద్యుత్తు సదుపాయం కల్పించాలన్నది ఉద్దేశం. రాష్ట్రంలో ఇప్పటివరకు తవ్విన మొత్తం బోర్లలో 7,425 మంది రైతులు విద్యుత్తు సదుపాయం పొందేందుకు అర్హులని గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు గుర్తించి ఆ జాబితాలను విద్యుత్తు పంపిణీ సంస్థలకు పంపారు. వీటిలో గత ఆరేడు నెలల వ్యవధిలో 329 బోర్లకే విద్యుత్తు సదుపాయం కల్పించారు. కృష్ణా, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల్లో ఇలాంటి బోర్లు పదిలోపే ఉన్నాయి. విద్యుత్తు స్తంభాలు, కండక్టర్‌, ట్రాన్స్‌ఫార్మర్లను విద్యుత్తు పంపిణీ సంస్థలు సమకూర్చి పనులు పూర్తి చేస్తే.. తరువాత నిధులు సమకూర్చాలని ఆర్థికశాఖ నిర్ణయించింది. దీంతో పలు పంపిణీ సంస్థల పరిధిలో ఈ పనుల నిర్వహణకు గుత్తేదారులు ఆసక్తి చూపడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని