‘ఏయ్‌ ఎస్‌ఐ.. ఎందుకయ్యా నీకు ఉద్యోగం ఇచ్చింది?

తనకు అన్యాయం జరిగిందని గోడు వెళ్లబోసుకునేందుకు వేదిక వద్దకు వచ్చిన ఓ రైతును పోలీసులు నిలువరించలేదని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 17 May 2022 07:12 IST

రైతు భరోసా సభలో మాజీ మంత్రి ముత్తంశెట్టి ఆగ్రహం
ప్రశ్నించిన రైతును నిలువరించలేదని మండిపాటు

విశాఖపట్నం (ఆనందపురం, పద్మనాభం), న్యూస్‌టుడే: తనకు అన్యాయం జరిగిందని గోడు వెళ్లబోసుకునేందుకు వేదిక వద్దకు వచ్చిన ఓ రైతును పోలీసులు నిలువరించలేదని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏయ్‌ ఎస్‌ఐ... ఎందుకయ్యా నీకు ఉద్యోగం ఇచ్చింది’ అంటూ మండిపడ్డారు. రైతు భరోసా 4వ విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని విశాఖ జిల్లా పద్మనాభం మండలం కోరాడలో వ్యవసాయశాఖ అధికారులు సోమవారం నిర్వహించారు. ఆ వేదికపై స్థానిక నాయకులు మాట్లాడుతుండగా... అదే పంచాయతీ పరిధిలోని గెద్దపేటకు చెందిన సూర్యనారాయణ అనే రైతు... తన 98 సెంట్ల జిరాయితీ భూమిని జగనన్న కాలనీకి అన్యాయంగా తీసుకున్నారనే విషయం చెప్పేందుకు వేదిక వద్దకు రాగా.. పోలీసుల సాయంతో ఆయనను ముత్తంశెట్టి సభ నుంచి బయటకు పంపించి వేశారు. ఆ రైతును ఎందుకు నిలువరించలేదంటూ స్థానిక ఎస్‌ఐపై మండిపడ్డారు. ఈ సందర్భంలో ఓ మీడియా ప్రతినిధిపై ‘నీ సంగతి చూస్తానంటూ’ బెదిరింపులకు దిగారు. ‘అన్నీ ఇస్తుంటే ఇలాగే ఉంటుంది. మీ వద్దకు  వస్తున్నామని చులకనగా చూడొద్దు. వాస్తవాలను తెలుసుకోవాలి’ అని ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని