K Viswanath: కళా తపస్వి కన్నుమూత

సిరిసిరి మువ్వల సందడి ఆగిపోయింది. శంకరాభరణ రాగం మూగబోయింది. సప్తపదులు కదలలేమంటున్నాయి. సిరివెన్నెల మబ్బుల చాటుకు వెళ్లిపోయింది.

Published : 03 Feb 2023 05:26 IST

వృద్ధాప్య సమస్యలతో తుదిశ్వాస విడిచిన దిగ్దర్శకుడు కె.విశ్వనాథ్‌

ఈనాడు-హైదరాబాద్‌, న్యూస్‌టుడే- ఫిల్మ్‌నగర్‌: సిరిసిరి మువ్వల సందడి ఆగిపోయింది. శంకరాభరణ రాగం మూగబోయింది. సప్తపదులు కదలలేమంటున్నాయి. సిరివెన్నెల మబ్బుల చాటుకు వెళ్లిపోయింది. కళాతపస్విగా పేరొందిన విఖ్యాత దర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్‌ (92) ఇక లేరు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించగా... అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బాపట్ల జిల్లా రేపల్లెలో కాశీనాథుని సుబ్రహ్మణ్యం, సరస్వతి దంపతులకు 1930 ఫిబ్రవరి 19న విశ్వనాథ్‌ జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్‌, ఆంధ్రా క్రిస్టియన్‌ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశారు. ఆయన తండ్రి చెన్నైలోని విజయవాహినీ స్టూడియోలో పనిచేసేవారు. దీంతో విశ్వనాథ్‌ డిగ్రీ పూర్తవగానే అదే స్టూడియోలో సౌండ్‌ రికార్డిస్ట్‌గా సినీజీవితాన్ని ప్రారంభించారు. పాతాళభైరవి సినిమాకు అసిస్టెంట్‌ రికార్డిస్ట్‌గా పనిచేశారు. తర్వాత ఆదుర్తి సుబ్బారావు దగ్గర అసోసియేట్‌గా చేరారు. కొన్ని చిత్రాలకు కథారచనలో పాలుపంచుకున్నారు. అలా రాణిస్తున్న సమయంలో దుక్కిపాటి మధుసూదనరావు 1965లో ఆత్మగౌరవం సినిమాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. ఆ తొలి చిత్రానికే నంది అవార్డు సాధించిన విశ్వనాథ్‌... తన సినీప్రయాణంలో సాగర సంగమం, స్వాతిముత్యం, సిరిసిరిమువ్వ, శ్రుతిలయలు, సిరివెన్నెల, ఆపద్బాంధవుడు లాంటి అనేక ఆణిముత్యాలను అందించి.. తెలుగు సినిమా స్థాయిని విశ్వవ్యాప్తం చేశారు. విశ్వనాథ్‌కు 1992లో పద్మశ్రీ, 2017లో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డులు వచ్చాయి. అదే ఏడాది రఘుపతి వెంకయ్య అవార్డు దక్కింది. నంది, ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు ఆయన ఖాతాలో చేరాయి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆయనను గౌరవ డాక్టరేట్‌తో గౌరవించింది. మేటి దర్శకుడిగా పేరొందిన ఆయన.. నటుడిగా కొన్ని కుటుంబ కథాచిత్రాల్లో ఇంటిపెద్ద పాత్రల్లోనూ మెప్పించారు. 1980 ఫిబ్రవరి 2న శంకరాభరణం సినిమా విడుదలైంది. ఇప్పుడు అదే తేదీన ఆయన మరణించడం యాదృచ్ఛికం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని