పెంచుకో.. దంచుకో!

రాష్ట్ర రిజిస్ట్రేషన్‌, స్టాంపుల శాఖ మరోసారి రకరకాల ఫీజులు పెంచి, ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపింది. ఆస్తులు కొనుగోలు చేసే పేద, మధ్య తరగతి వారిపై పన్నుల రూపేణా భారీగా వడ్డిస్తోంది.

Updated : 07 Jun 2023 05:55 IST

రిజిస్ట్రేషన్‌ శాఖ వరుస బాదుడు
తాజాగా నిర్మాణాల మార్కెట్‌ విలువ పెంపు
వాణిజ్య సముదాయాలకు ప్రత్యేక వడ్డింపు
ఈనాడు - అమరావతి

రాష్ట్ర రిజిస్ట్రేషన్‌, స్టాంపుల శాఖ మరోసారి రకరకాల ఫీజులు పెంచి, ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపింది. ఆస్తులు కొనుగోలు చేసే పేద, మధ్య తరగతి వారిపై పన్నుల రూపేణా భారీగా వడ్డిస్తోంది.

రిజిస్ట్రేషన్‌, స్టాంపుల శాఖ ఉమ్మడిగా ఉన్న నిర్మాణాల విలువల జాబితా (స్ట్రక్చరల్‌) నుంచి ‘వాణిజ్య సముదాయాలు’ పేరుతో కొత్త కేటగిరీని సృష్టించింది. గ్రామీణ, పట్టణాలనే తేడా లేకుండా పెంచిన కొత్త విలువలు జూన్‌ ఒకటి నుంచే అమల్లోకి వచ్చాయి. వెయ్యి చదరపు అడుగుల ప్లాట్‌ కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్‌ ఛార్జీల రూపేణా గతంలో కంటే రూ.15 వేల వరకు ఎక్కువగా చెల్లించాల్సి వస్తోంది. మార్కెట్‌ విలువ అదనంగా రూ.2 లక్షలు (రూ.1,200 నుంచి రూ.14,00కు పెంచడం వల్ల) చేయడం వల్ల ఈ భారం పెరిగింది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రిజిస్ట్రేషన్‌ శాఖ ఇప్పటివరకు ఆరు సార్లు భారాన్ని మోపింది. గతేడాది ఫిబ్రవరి ఒకటిన గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లా కేంద్రాల్లో మార్కెట్‌ విలువలను పెంచారు.

అదే ఏడాది ఏప్రిల్‌లో 11 కొత్త జిల్లా కేంద్రాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో మార్కెట్‌ విలువలను జాతీయ రహదారులు, దుకాణాలు, సమీపంలో పరిశ్రమలు, ఇతర అంశాల ప్రతిపాదికగా 13% నుంచి 75% వరకు పెంచారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి యూజర్‌ ఛార్జీలు పెరిగాయి. మళ్లీ జూన్‌ ఒకటి నుంచి ఎంపికచేసిన గ్రామాల్లో భూముల విలువలను సవరించి, హెచ్చించారు. అయితే నిర్మాణాల (స్ట్రక్చర్‌) మార్కెట్‌ విలువలను రాష్ట్రవ్యాప్తంగా పెంచేశారు. గతేడాది కూడా జూన్‌ 1నే ఈ ఫీజులు పెరిగాయి. సినిమా హాళ్లు, మిల్లులు, కర్మాగారాలు, కోళ్లఫారాల భవన నిర్మాణాలపైనా భారం వడ్డించారు. తాటాకు, కొబ్బరాకులు, రెల్లుగడ్డితో కప్పే గుడిసెలపైనా చదరపు అడుగుకు అదనంగా రూ.10 చొప్పున బాదేశారు. గ్రామీణ, పట్టణాలనే తేడా లేకుండా.. అప్పటి విలువలపై సగటున 5% చొప్పున పెంచారు. ఆ ఉత్తర్వులను తాజాగా సవరిస్తూ మళ్లీ ప్రజలపై భారాన్ని మోపారు.

రూ.1,200 నుంచి రూ.1,400: గ్రౌండ్‌ ఫ్లోర్‌ (1, 2 అంతస్తులు)కు పట్టణాలు/కార్పొరేషన్‌ పరిధిలోనైతే చదరపు అడుగుకు ప్రస్తుతం రూ.1,200 వసూలు చేస్తున్నారు. దీనిని రూ.1,400 చేశారు. నగర/పట్టణ పంచాయతీ పరిధిలో రూ.1,060 నుంచి రూ.1,200కు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.770 నుంచి రూ.850కు ప్రభుత్వం పెంచింది.

పట్టణాలు/కార్పొరేషన్‌ పరిధిలో అయితే.. సెల్లారు (పార్కింగ్‌)లో చదరపు అడుగుకు రూ.860 నుంచి రూ.900, నగర/పట్టణ పంచాయతీల్లో రూ.780 నుంచి రూ.800, గ్రామీణ ప్రాంతాల్లో రూ.560 నుంచి రూ.600గా సవరించింది.


‘వాణిజ్య’ పేరుతో కొత్త భారం!

ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ల శాఖ పన్నులు అంతటా ఒకేరీతిలో పెరుగుతూ వచ్చేవి. ఈసారి ప్రభుత్వం వాణిజ్య ప్రాంతాల వారీగా ప్రత్యేక భారాన్ని మోపింది. నగర/కార్పొరేషన్‌ పరిధిలో గ్రౌండ్‌ ఫ్లోరు (ప్రతి చదరపు అడుగు)కు రూ.1,700, నగర/పట్టణ పంచాయతీల్లో రూ.1,450, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,000 చేశారు. ఇదే క్రమంలో మొదటి అంతస్తుకు రూ.1,600, రూ.1,400, రూ.950, రెండు అంతస్తుల పైన ఉంటే రూ.1,500, రూ.1,300, రూ.900గా ఖరారు చేశారు. సెల్లారు (పార్కింగ్‌)కు రూ.1,000, రూ.900, రూ.700 చొప్పున వసూలుచేస్తారు.


* ఆర్‌సీసీ నిర్మాణాలు పది అడుగుల ఎత్తుకుపైగా ఉండే మల్టీప్లెక్స్‌, షాపింగ్‌ మాల్స్‌ నిర్మాణాల (వాణిజ్య సముదాయాలు)కు రూ.1,500, రూ.1,250, రూ.900 (చదరపు అడుగుకు) చొప్పున వసూలు చేస్తున్నారు.


పట్టణ/నగర ప్రాంతాల్లో జింక్‌ (నాన్‌-ఆర్‌సీసీ స్ట్రక్చర్స్‌) షీట్స్‌, మంగుళూర్‌ టైల్స్‌, కడప స్లాబ్‌, ఇతర వాటికి చదరపు అడుగుకు రూ.650 ఉంటే రూ.700
చేశారు. మేజర్‌/గ్రామ పంచాయతీ పరిధిలో గతంలో ఉన్న రేట్‌ కంటే ప్రతి చదరపు అడుగుకు రూ.20 చొప్పున పెంచారు.


చవిటి మిద్దెలకు చదరపు అడుగుకు ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ విలువ కంటే చదరపు అడుగుకు అదనంగా రూ.10 పెంచారు. సాధారణ సినిమా హాళ్లు, మిల్లులు, కోళ్లఫారాలు, తదితరాల మార్కెట్‌ విలువల్లో పెంపులేదు.


అసంపూర్తి నిర్మాణాలకు సంబంధించి పునాది స్థాయిలో ఉంటే 25%, స్లాబ్‌ స్థాయిలో 65%, పూర్తయ్యే దశలో 85% చొప్పున వసూలు చేస్తారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని