YS Jagan: జగనన్నా.. ఇంకెన్నేళ్లు ముంచుతారు?

రూ.వెయ్యి కోట్లో.. రెండు వేల కోట్లో అయితే నేనే సర్దుకునేవాడిని.. 45.72 కాంటూరు స్థాయిలో పునరావాసం చూపాలంటే రూ.20 వేల కోట్లకు పైగా అవసరం. అంత డబ్బు కావాలంటే కేంద్రం సహాయం తప్పనిసరి.

Updated : 07 Aug 2023 08:38 IST

పోలవరం నిర్వాసితులను పీడిస్తున్న ముంపు కష్టాలు
హామీకి అనుగుణంగా.. ఇప్పటికీ పూర్తికాని పునరావాసం
వంకాయలు, బంగాళదుంపలు ఇచ్చి.. ఎన్నేళ్లు గడిపేస్తారు?
ఏడాది తర్వాత మళ్లీ వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటన
ఈనాడు - అమరావతి


రూ.వెయ్యి కోట్లో.. రెండు వేల కోట్లో అయితే నేనే సర్దుకునేవాడిని.. 45.72 కాంటూరు స్థాయిలో పునరావాసం చూపాలంటే రూ.20 వేల కోట్లకు పైగా అవసరం. అంత డబ్బు కావాలంటే కేంద్రం సహాయం తప్పనిసరి. త్వరలోనే ప్రధాన మంత్రిని కలుస్తా. ఎప్పటికైనా వీరికి పునరావాసం కల్పించాల్సిందే.. అదేదో ఇప్పుడే చేస్తే వారికి వరద ఇబ్బందులు తొలగుతాయని మీ మాటగా చెబుతా. వారికి చెల్లించే పరిహారం మీరే బటన్‌ నొక్కి, వారి ఖాతాల్లో జమ చేయమని ప్రాధేయపడతా. కేంద్రాన్ని తప్పకుండా ఒప్పిస్తా.. 41.15 కాంటూరు స్థాయి గ్రామాలకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించి, పునరావాసం చూపిస్తాం. సెప్టెంబరు నెలాఖరు నాటికి ఈ కాంటూరులోని 107 గ్రామాలను ఖాళీ చేయించి, వారికి పునరావాస గ్రామాల్లోని ఇళ్లకు తరలిస్తాం.

2022 జులై 27న వరద ప్రాంత పర్యటనలో భాగంగా ఏలూరు జిల్లా వేలేరుపాడు, అల్లూరి జిల్లా చింతూరు వచ్చినపుడు సీఎం జగన్‌ హామీలివి.


వరదలొచ్చిన ప్రతిసారీ పోలవరం ప్రాజెక్టు పరిధిలోని గ్రామాలు మునుగుతున్నాయంటే అది ప్రభుత్వ వైఫల్యమే. బాధితుల మాటల్లో చెప్పాలంటే.. సర్కారే ముంచేస్తోంది. ఫలానా తేదీ నాటికి మిమ్మల్ని తరలిస్తామంటూ నీటిపై రాతల్లా హామీలు గుప్పించడం తప్పితే.. వారి గోడును పట్టించుకోవడం లేదు. గతేడాది జులైలో వరదలొచ్చినప్పుడు పరామర్శించి వెళ్లిన ముఖ్యమంత్రి జగన్‌.. ఏడాది తర్వాత మళ్లీ అదే ప్రాంతానికి వెళ్తున్నారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం 2022 సెప్టెంబరు నాటికి 41.15 కాంటూరు పరిధిలోని గ్రామాలను ఖాళీ చేయించి ఉంటే.. వరద నష్టం ఇంతగా ఉండేది కాదు. వారు ఇళ్లు విడిచి కొండలు, గుట్టలపై నివాసం ఉండాల్సిన పరిస్థితులు ఉండేవి కావు. పునరావాసం కల్పించిన గ్రామాల్లో స్థిరపడి, ఏదోఒక పని చేసుకునేవారు.

కోల్పోయేదెంత? ప్రభుత్వం ఇచ్చేదెంత?

గోదావరికి వరదలు వచ్చిన ప్రతిసారీ ముంపు గ్రామాల ప్రజలు పడే అవస్థలు వర్ణనాతీతం. కొన్ని రోజుల పాటు ఇళ్లు విడిచి కొండలు, గుట్టలెక్కి చిమ్మచీకట్లో తల దాచుకోవాల్సి వస్తోంది. ఆ సమయంలో సరైన ఆహారం లేక అల్లాడుతున్నారు. ప్రభుత్వం సాయం చేస్తున్నామని చెబుతున్నా.. అది అరకొరగానే ఉంటోంది. ముంపునకు గురైన ఇళ్ల నుంచి వరద నీరు లాగిన తరువాత పేరుకుపోయిన బురద తీయించాలి. విద్యుత్తు వైరింగ్‌ మొత్తం మార్చాలి. సామగ్రి తీసుకుని బయటకు వెళ్లడానికి, వరదలు తగ్గాక తిరిగి వాటిని తెచ్చుకోవడానికి ఖర్చులూ తప్పవు. అన్నీ కలిపితే ఒక్కో కుటుంబానికి రూ.35 వేల పైనే భారం పడుతోంది. ఏడాదికి మూడుసార్లు ముంపునకు గురైతే రూ.లక్ష వరకు ఖర్చవుతోంది. పునరావాసం కల్పిస్తే.. వెళ్లిపోతాం కాదా అని కనీసం ఇళ్లకు మరమ్మతులు కూడా చేయించుకోవడం లేదు. శిథిల గృహాల్లోనే జీవనం సాగిస్తున్నారు.

‘‘వంకాయలు, బంగాళదుంపలు మాకొద్దు.. శాశ్వత పునరావాసం చూపాలి’ అని నిర్వాసితులు కోరుతున్నారు. ఇటీవల అల్లూరి జిల్లా కూనవరంలో ధర్నా చేసిన నిర్వాసితులు ఇవే నినాదాలు చేశారు. వరదలు వచ్చినపుడు కూరగాయలు, పప్పు, నూనె ఇచ్చి సహాయం చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. వరదల్లో మేం కోల్పోయే నష్టం ముందు ఈ కూరగాయల విలువెంత? అందుకే ఈ పప్పుబెల్లాలు మాకొద్దు. శాశ్వతమైన పునరావాసం చూపండంటూ డిమాండ్‌ చేస్తున్నారు. నష్టాలు, కష్టాలు బారినుంచి బయటపడాలంటే పునరావాసం అమలు చేసి, మాకు కేటాయించిన ఇళ్లల్లోకి పంపటమే ఏకైక మార్గమని వివరిస్తున్నారు.

టార్పాలిన్లు కప్పిన గుడిసెలే ఆవాసాలు

పోలవరం నిర్వాసిత గ్రామాల్లో ఎక్కడికి వెళ్లినా టార్పాలిన్లతో కప్పిన పూరిళ్లు కనిపిస్తుంటాయి. ఎందుకంటే ఎప్పడైనా ఇక్కడ నుంచి వెళ్లాల్సిందే.. పునరావాస కాలనీలకు వెళ్లాక అక్కడే సౌకర్యాలు ఏర్పాటు చేసుకుందామన్న భావన నిర్వాసితుల్లో వ్యక్తమవుతోంది. దానికితోడు గోదావరికి ఏటా వచ్చే వరదలు ఇళ్లను కబళిస్తుంటాయి. ఏటా వాటిని కట్టుకోవాలంటే పేద, మధ్యతరగతి రైతుల వల్ల అయ్యే పనికాదు. ప్రభుత్వం కూడా ఈ నెల, వచ్చే నెల అంటూ పునరావాస ప్యాకేజీని ఊరిస్తోంది. అటువంటప్పుడు ఇక్కడ పెట్టే ఖర్చు, అక్కడే పెట్టుకుంటే డబ్బు వృథా కాదన్న అభిప్రాయంలో నిర్వాసితులున్నారు. అందుకే టార్పాలిన్లు కప్పిన చిన్న గుడిసెల్లో జీవనం సాగిస్తున్నామని.. ఈ ప్రభుత్వం పునరావాసం అమలు చేసేదెప్పుడు? తామకు బాధల నుంచి విముక్తి పొందేదెప్పుడు? అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఎప్పటికైనా ఊరు వదలాల్సిందే
- గోవిందం సురేష్‌, నిర్వాసితుడు

తుమ్మితే ఊడే ముక్కులాంటిది మా జీవనం. ఈ గ్రామంలో ఎన్నాళ్లు ఉంటామో మాకే తెలియదు. ఎప్పటికైనా ఈ ఊరు వదిలి వెళ్లక తప్పదు. ఆ పరిస్థితుల్లో ఇంకా ఇళ్లను ఏం బాగు చేసుకుంటాం. అందుకే గోడ కట్టే చోట.. తడిక అడ్డం పెట్టుకుని జీవిస్తున్నాం. ప్రతి సంవత్సరం వరదలు రావటం.. మా జీవితాలను ఛిన్నాభిన్నం చేయటం పరిపాటిగా మారింది. అందుకే వరదల్లో ప్రభుత్వం ఇచ్చే సాయం మాకొద్దు. శాశ్వతమైన పునరావాసం అమలు చేయమని కోరుకుంటున్నాం.


వరదల నుంచి రక్షించి, పుణ్యం కట్టుకోండి
- చీమల రాజేశ్వరి, నిర్వాసితురాలు

ఏటా వచ్చే గోదావరి వరదలకు మేం పడే ఇబ్బందులు పగవారికి కూడా వద్దు. ఇంట్లో సామగ్రి సర్దుకుని, చంటి పిల్లలు, వృద్ధులను తీసుకుని బతుకుజీవుడా అంటూ మెరక ప్రాంతానికి వెళ్లాల్సి వస్తోంది. జూన్‌ నుంచి సెప్టెంబరు వరకూ సుఖంగా నిద్రించే అవకాశమే లేదు. ఏ సమయంలో వరద విరుచుకుపడుతుందోనన్న భయంతోనే ఈ నాలుగు నెలలు గడపాల్సి వస్తోంది. ఈ బాధల నుంచి విముక్తి ప్రసాదించండి సారూ.. మా కోసం నిర్మించిన ఇళ్లకు మమ్మల్ని తరలిస్తే అక్కడ జీవనం చూసుకుంటాం.


ప్రధాని మోదీతో తనకు రాజకీయాలకు అతీతమైన అనుబంధం ఉందని జగన్‌ గతేడాది విశాఖపట్నంలో జరిగిన సభలో పేర్కొన్నారు. అందుకు నిదర్శనం అన్నట్లుగా.. ఎప్పుడో 2014-15 నాటి రెవెన్యూ లోటు నిధులు రూ.10 వేల కోట్లకు పైగా సాధించుకున్నారు. రాష్ట్రం అడగాలే కానీ కేంద్రం కాదన్న పరిస్థితులేవీ ఈ మధ్య కాలంలో పెద్దగా లేవు. ప్రధాని దగ్గర అంత పలుకుబడి కలిగిన ముఖ్యమంత్రికి.. పోలవరం నిర్వాసితులకు కేంద్రం సాయం మంజూరు చేయించుకోవడం పెద్ద పనా? ఇప్పటికీ నిర్వాసితుల కష్టాలు అలాగే కొనసాగుతున్నాయంటే.. సీఎం చెప్పేవన్నీ వరద ముచ్చట్లేనా? పర్యటనలు, పరామర్శలకు వచ్చినప్పుడు ఇచ్చేవి ఉత్తుత్తి హామీలేనా..?


‘రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియాలి. ఒక మాట చెప్పి, దాన్ని నిలబెట్టుకోలేకపోతే.. ఆ వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అర్హుడు కాదనే పరిస్థితులు రావాలి’ అని ఈ ఏడాది ఫిబ్రవరి 28న గుంటూరు జిల్లా తెనాలిలో రైతు భరోసా విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ స్వయంగా చెప్పారు. మరి 2022 సెప్టెంబరు నాటికే 107 గ్రామాల్ని ఖాళీ చేయించి పునరావాస కాలనీలకు తరలిస్తామని చెప్పిన జగన్‌.. ఏడాది కావొస్తున్నా, తన హామీని నిలబెట్టుకోలేదు. 88 గ్రామాలు ఇప్పటికీ ముంపులోనే ఉన్నాయి. మరో 19 గ్రామాల్లోని నిర్వాసితులు ప్రభుత్వం నుంచి పరిహార ప్యాకేజీ అందకపోయినా.. ముంపు సమస్యలు భరించలేక స్వచ్ఛందంగా తరలివెళ్లారు. దీనికి సోమవారం నాటి పర్యటనలో అయినా సీఎం సమాధానమిస్తారో? లేదో?


హామీల అమలంటే ఇదేనా?

వ్యక్తిగత ప్యాకేజీ రూ.10 లక్షలు ఇచ్చేదెప్పుడు?

జగన్‌ హామీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వం త్యాగం చేస్తున్న నిర్వాసితుల కళ్లల్లో ఆనందం చూడాలి. దేవుడి దయ, మీ చల్లని దీవెనలతో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న రూ.6.36 లక్షల వ్యక్తిగత ప్యాకేజీని రూ.10 లక్షలకు పెంచుతా. 19.03.2019 నాడు కొయ్యలగూడెం ఎన్నికల బహిరంగ సభలో...

అమలుతీరు: 30.06.2021వ తేదీన జీవో నంబరు 224 విడుదల చేశారు. ఇది వచ్చి రెండేళ్లు పైగా అయింది. కానీ ఇంతవరకూ ఒక్క నిర్వాసితుడికి కూడా రూ.10 లక్షలు జమ కాలేదు.

మానవతా దృక్పథం ఏమైంది?

హామీ: 2007 నుంచి 2010 మధ్య జరిగిన భూసేకరణలో ఎకరాకు రూ.1.15 లక్షల నుంచి రూ.1.40 లక్షల వరకు నష్టపరిహారం చెల్లించారు. ఆ పరిహారం అత్యంత తక్కువ ధర. అందుకే మానవతా ధృక్పథంతో ఆ భూములిచ్చిన రైతులందరికీ ఎకరాకు రూ.5 లక్షల చొప్పున చెల్లిస్తాం.

31.03.2019న కుక్కునూరులో..

అమలు తీరు: జగన్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టి నాలుగేళ్లు గడిచింది. ఇప్పటివరకు ఒక్క రైతుకూ పరిహారం ఇవ్వలేదు. రైతులకు సంబంధించిన ఆధార్‌కార్డు, బ్యాంకు పాసుపుస్తకాలను అధికారులు ఇటీవల సేకరించారు. నాలుగు నెలలు అవుతున్నా ఫలితం లేదు. పరిహారం కోసం రైతులు నిరీక్షిస్తూనే ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని