CBSE: సీబీఎస్‌ఈ పాయే.. ఐబీ వచ్చే!

రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమంలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో   24.3% మంది ‘క్యాట్‌, రెడ్‌, సన్‌, న్యూ, ఫ్యాన్‌, బస్‌’ తదితర ఆంగ్ల పదాలను చదవలేకపోతున్నట్లు అసర్‌ సర్వే బహిర్గతం చేసింది.

Updated : 15 Aug 2023 11:12 IST

ప్రాథమిక స్థాయిలోనే అంతర్జాతీయ సిలబస్‌
వచ్చే ఏడాది నుంచే అమలుకు చర్యలు
17న రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం
విద్యార్థుల ప్రమాణాలు విస్మరించి, రెండేళ్లకే పాఠ్య ప్రణాళిక మార్పు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమంలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో   24.3% మంది ‘క్యాట్‌, రెడ్‌, సన్‌, న్యూ, ఫ్యాన్‌, బస్‌’ తదితర ఆంగ్ల పదాలను చదవలేకపోతున్నట్లు అసర్‌ సర్వే బహిర్గతం చేసింది. పరిస్థితి ఇలా ఉంటే సీబీఎస్‌ఈ, ఐబీ సిలబస్‌ అంటూ సీఎం జగన్‌ గొప్పలకు పోతున్నారు. సోమవారం విద్యాశాఖపై సమీక్షిస్తూ, రాష్ట్రంలో ఇంటర్నేషనల్‌ బాకలారియెట్‌ సిలబస్‌ అమలు దిశగా అడుగులు వేయాలని అధికారులను ఆదేశించారు. ఐబీ సిలబస్‌ను ఎల్‌కేజీ, యూకేజీ నుంచే అమలు చేయాల్సి ఉంటుంది. ఇదే జరిగితే, ఆచరణలో అనేక చిక్కులు ఎదురవుతాయని విద్యావర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అశాస్త్రీయ విధానాలతో పాఠశాల విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతోంది. విద్యార్థుల అభ్యసనం, వారి మానసిక పరిణతి, ఉపాధ్యాయుల బోధన సామర్థ్యాలను పట్టించుకోకుండా సర్కారు నిర్ణయాలు తీసుకుంటోంది. వైకాపా ప్రభుత్వం వచ్చాక తొలుత రాష్ట్ర సిలబస్‌లోని పుస్తకాలను మార్చారు. 2022-23 నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌ను తెచ్చారు. దీన్ని ఈ ఏడాది తొమ్మిదో తరగతి వరకు పొడిగించారు. గతేడాది వెయ్యి పాఠశాలలకు సీబీఎస్‌ఈ గుర్తింపు లభించింది. రెండేళ్లైనా పూర్తికాలేదు అంతలోనే, ఇంటర్నేషనల్‌ బాకలారియెట్‌(ఐబీ) సిలబస్‌ అమలుపై ఈనెల 17న ఒప్పందం చేసుకోవాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. పూర్వ ప్రాథమిక విద్య నుంచి ఐదో తరగతి వరకు వచ్చే ఏడాది ఐబీ సిలబస్‌ తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు ఐదో తరగతి వరకు సీబీఎస్‌ఈ చదివిన వారు ఐబీలోకి మారాల్సి ఉంటుంది. తదనుగుణంగా పాఠ్యపుస్తకాలను కొత్తగా ముద్రించాలి. ఈ ఏడాది మిగిలిన కోట్ల పుస్తకాలు నిరుపయోగంగా మారతాయి. 4-9 తరగతుల విద్యార్థులకు ఇచ్చిన బైజూస్‌ కంటెంట్‌ కూడా మూలన పడనుంది.

వీటిని పట్టించుకోరా?

ఐబీ సిలబస్‌ను పూర్వ ప్రాథమిక విద్య (ఎల్‌కేజీ, యూకేజీ) నుంచి అమలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం పూర్వ ప్రాథమిక విద్య లేదు. అంగన్‌వాడీల్లోనే బోధిస్తున్నారు. అంగన్‌వాడీ టీచర్లను పదో తరగతి అర్హతతో నియమించారు. వీరు ఐబీ సిలబస్‌ ప్రమాణాలను అందుకొని, బోధించగలరా? బోధనతోపాటు ఇతర విధులను సమన్వయం చేసుకోగలరా? అన్నవి ప్రశ్నలు.

  • పాఠశాలల ఉపాధ్యాయులకు ఇటీవల సీబీఎస్‌ఈ సిలబస్‌పై శిక్షణ ఇచ్చినా, ఇంకా గాడిన పడలేదు. ఇప్పుడు ఐబీకి సన్నద్ధం కావాలంటే వారి పరిస్థితేంటి? ప్రాథమిక పాఠశాలల విలీనం కారణంగా చాలాచోట్ల 1, 2 తరగతులే మిగిలాయి. పిల్లలు తక్కువగా ఉన్నారని, 9,602 బడులను ఏకోపాధ్యాయులతో కొనసాగిస్తున్నారు. ఒకే గదిలో అన్ని తరగతులకు కలిపి ఐబీ బోధన సాధ్యమా? నియామకాలు లేకపోవడంతో చాలాచోట్ల సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. రెండేసి తరగతులకు ఒక టీచర్‌ ఐబీ సిలబస్‌ ఎలా బోధిస్తారో ప్రభుత్వమే చెప్పాలి.

మనవాళ్లకు ఐఐటీల్లో సీట్లు వద్దా?

ఐటీ, నిట్‌, ట్రిపుల్‌ఐటీ, వైద్య విద్య ప్రవేశ పరీక్షలకు ఎన్‌సీఈఆర్టీ సిలబస్సే ఆధారం. వీటికి కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఉమ్మడిగా పరీక్ష నిర్వహిస్తున్నాయి. సర్కారీ బడుల్లో ఐబీ సిలబస్‌ తీసుకొస్తే వీరికి సీట్లు ఎలా వస్తాయన్నది ప్రశ్న. బైజూస్‌ కంటెంట్‌తో విద్యార్థులకు ట్యాబ్‌లు ఇచ్చారు. ఐబీ అమలుచేస్తే, బైజూస్‌ కంటెంట్‌ వృథానే కదా? కేంద్రం నూతన జాతీయ విద్యావిధానం తీసుకొచ్చేందుకు 33 ఏళ్లకు పైగా పట్టింది. కానీ, ఏపీ ప్రభుత్వం రెండేళ్లకోసారి పాఠ్యప్రణాళిక మార్చేస్తోంది. ఐబీ సిలబస్‌ విదేశాలకు వెళ్లేవారికి ఉపయోగపడొచ్చు. రాష్ట్రంలో చదువుతున్న 70లక్షల మంది విద్యార్థులో ఎంతమంది విదేశాలకు వెళ్తున్నారు? అక్కడ చదివేందుకు అయ్యే వ్యయాన్ని భరించగల సామర్థ్యం ఉన్నవారు ప్రభుత్వ బడుల్లో ఎందరుంటారు? రాష్ట్రంలో వెయ్యి ప్రభుత్వ బడులకు సీబీఎస్‌ఈ అనుబంధ గుర్తింపునిచ్చింది. ఏటా కొన్ని స్కూళ్ల చొప్పున సీబీఎస్‌ఈ గుర్తింపు సాధిస్తామని చెప్పిన సీఎం.. అంతలోనే ఐబీ సిలబస్‌కు మళ్లడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని