భారత్‌ పేరును రాజ్యాంగ నిర్మాణసభలో సమర్థించిన కళా వెంకటరావు.. నాడు చర్చలో పాల్గొన్న తెలుగు నేత

1949 సెప్టెంబరు 18న ఆర్టికల్‌ 1లో ‘ఇండియా... దటీజ్‌ భారత్‌’ అని చేర్చినరోజు నాటి రాజ్యాంగ నిర్మాణసభలో సభ్యుడిగా ఉన్న తెలుగువారు కళా వెంకటరావు భారత్‌ అన్న పదాన్ని సమర్థించారు.

Updated : 06 Sep 2023 07:38 IST

ఈనాడు, దిల్లీ: 1949 సెప్టెంబరు 18న ఆర్టికల్‌ 1లో ‘ఇండియా... దటీజ్‌ భారత్‌’ అని చేర్చినరోజు నాటి రాజ్యాంగ నిర్మాణసభలో సభ్యుడిగా ఉన్న తెలుగువారు కళా వెంకటరావు భారత్‌ అన్న పదాన్ని సమర్థించారు.

‘‘నేను భారత్‌ పేరుకు మనస్ఫూర్తిగా మద్దతిస్తున్నాను. అది పురాతనమైంది. ఆ పేరు రుగ్వేదంలో కూడా ఉంది. వాయు పురాణంలోనూ భారత్‌ సరిహద్దుల గురించి చెప్పారు. హిమాలయాలకు దక్షిణం, సముద్రాలకు ఉత్తరాన ఉన్న భూభాగమే భారత్‌ అని అర్థం. భారత్‌ అన్న పేరు చాలా పురాతనమైంది. ఇండియా అన్న పదం సింధు (ఇండస్‌ నది) నుంచి వచ్చింది. ఇండస్‌ నది ఇప్పుడు పాకిస్థాన్‌లో ప్రవహిస్తున్నందున ఆ దేశాన్ని హిందుస్థాన్‌గా పిలవొచ్చు. సింద్‌ హింద్‌గా మారింది. సంస్కృతంలో వాడే ‘స’ను ప్రాకృతంలో ‘హ’గా వాడుతారు. గ్రీకులు హింద్‌ను ఇండ్‌గా పలికారు. అందువల్ల ఇకముందు ఇండియాను భారత్‌గా పిలవడం మంచిది. అలాగే హిందీ భాష పేరునూ భారతిగా మార్చాలని నేను సేత్‌ గోవింద్‌దాస్‌, ఇతర హిందీ మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. హిందీ పేరుకు బదులు భారతి అని పెట్టాలని కోరుతున్నా... ఎందుకంటే దానికి చదువుల దేవత అన్న పూర్వనామం ఉంది’’ అని కళా వెంకటరావు నాడు రాజ్యాంగ నిర్మాణసభలో పేర్కొన్నారు.

నాడు మద్రాస్‌ ప్రెసిడెన్సీ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఈయన 1900 జులై 7న ప్రస్తుత కోనసీమ జిల్లా ముక్కామలలో జన్మించారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 1937, 1946లలో అమాలపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎంపికయ్యారు. మంత్రిగానూ పనిచేశారు. 1949 నుంచి 1951 వరకు ఏఐసీసీ కార్యదర్శిగానూ పనిచేశారు. మద్రాస్‌ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర విభజన కోసం ఏర్పాటుచేసిన కమిటీలోనూ ఈయన సభ్యుడు. 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త రాష్ట్రంలో అసెంబ్లీ సభ్యుడిగానూ ఎన్నికయ్యారు. మద్రాస్‌, ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వాల్లో రెవిన్యూశాఖ మంత్రిగానూ పనిచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు