Guntur: పనిమనిషిపై చోరీ నేరం మోపిన వైకాపా ఎమ్మెల్యే!

వైకాపా ఎమ్మెల్యే ఇంట్లో ఓ మహిళ సుమారు 15 ఏళ్ల నుంచి పని చేస్తోంది. ఆమె కుమారుడు ఇటీవల తెదేపా నాయకుల వెంట తిరుగుతున్నారు.

Updated : 26 Jan 2024 08:42 IST

ఆమె కుమారుడు తెదేపాలో తిరుగుతున్నారని అక్కసు
గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా తీరుపై విమర్శలు

ఈనాడు, అమరావతి; పెదకాకాని, పట్టాభిపురం, న్యూస్‌టుడే: వైకాపా ఎమ్మెల్యే ఇంట్లో ఓ మహిళ సుమారు 15 ఏళ్ల నుంచి పని చేస్తోంది. ఆమె కుమారుడు ఇటీవల తెదేపా నాయకుల వెంట తిరుగుతున్నారు. అది జీర్ణించుకోలేని ఆ ఎమ్మెల్యే కుటుంబీకులు ఆమెపై చోరీ అభియోగం మోపారు. అదీ చాలక పోలీసులతో దాడి చేయించారు. ఈ ఘటన గుంటూరులో రాజకీయంగా కలకలం రేగింది. గురువారం గుంటూరు తెదేపా కార్యాలయంలో బాధితులు గోడు వెల్లబోసుకున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే ముస్తఫా ఇంట్లో ఆషా అనే మహిళ పని చేస్తున్నారు. ఆమె కుమారుడు మన్సూర్‌ తెదేపాలో తిరుగుతున్నారు. ఈ విషయం తెలిసి ఎమ్మెల్యే కుమార్తె, నియోజకవర్గ సమన్వయకర్త నూరిఫాతిమా, ఆమె భర్త.. బుధవారం ఆషాను పిలిపించుకొని ప్రశ్నించారు. తనకేమీ తెలియదని చెప్పినా ఇంట్లో ఆభరణాలు పోయాయని ఆ నేరం ఆమెపై మోపి, పోలీసులతో కొట్టించారు. దీనిపై ఫిర్యాదు చేయడానికి ఆషా, మన్సూర్‌ గురువారం పెదకాకాని స్టేషన్‌కు వెళ్తే.. వివరాలు తెలుసుకొని, ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు కట్టాల్సిన పోలీసులు ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లడం విమర్శలకు దారితీసింది. మరోవైపు ఆభరణాల చోరీ నిజమా కాదా? ఆషాను పోలీసులు కొట్టారా లేదా అనేది డీఎస్పీతో విచారించి చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని