ఇంతకంటే.. విఫల సీఎం ‘కలరా’!

నా అక్కచెల్లెళ్లారా... నా అన్నదమ్ముల్లారా... మీ జగనన్న పాలనలో... తిరుపతి నుంచి శ్రీకాకుళం వరకు... చిత్తూరు నుంచి కర్నూలు వరకు... మన మార్కు కనిపిస్తోందంటూ పదేపదే బాకా ఊదుతున్నారు!

Updated : 14 Mar 2024 07:47 IST

తాగునీటి స్వచ్ఛత మరచిన వైకాపా సర్కారు
ఏడాది పొడవునా ప్రజల్ని పిండేస్తున్న అతిసార
తాజాగా గుంటూరులో కలరా కేసులు బహిర్గతం

నా అక్కచెల్లెళ్లారా...
నా అన్నదమ్ముల్లారా...  
మీ జగనన్న పాలనలో...
తిరుపతి నుంచి శ్రీకాకుళం వరకు...
చిత్తూరు నుంచి కర్నూలు వరకు...
మన మార్కు కనిపిస్తోందంటూ పదేపదే బాకా ఊదుతున్నారు!
అవును నిజమే...
జగన్‌ ఐదేళ్ల పాలన ఫలితంగా...
పైపుల్లో శుద్ధమైన తాగునీరు...  మచ్చుకైనా రావడంలేదు!  
వానలప్పుడు మాత్రమే పలకరించే...
అతిసార ఇక్కడే తిష్ఠ వేసింది!
ఎప్పుడో కానీ బాధించని...
వాంతులు, విరేచనాలు ఏడాదంతా పీడిస్తున్నాయి!
దాదాపుగా వెళ్లిపోయిందనుకున్న ‘కలరా’ మళ్లీ కనిపించింది!
మొత్తానికి ప్రజారోగ్యం గాలిలో దీపమైంది...! ఇదేనా జగన్‌ మీ మార్కు పాలన?


మనిషి జీవించేందుకు నీరు ఎంత అవసరమో... దాని నాణ్యత అంతకంటే ముఖ్యం. స్వచ్ఛమైన తాగునీరు ప్రజల ప్రాథమిక హక్కు. కనీస అవసరాల్లో అత్యంత కీలకమైన శుద్ధి చేసిన తాగునీటిని ప్రజలకు అందించడంలో జగన్‌ సర్కారు ఘోరంగా విఫలమైంది. ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసింది. పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా కలుషిత నీటిని తాగుతూ అన్ని ప్రాంతాల ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా అతిసార కారణంగా మరణాలు సంభవిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. సంఘటనలు జరిగినప్పుడు హడావుడి చేయడం, తర్వాత తనదైన శైలిలో మొద్దు నిద్రపోవడం మినహా శాశ్వత ప్రతిపాదికన చర్యలు తీసుకోవడాన్ని జగన్‌ ప్రభుత్వం మానేసింది. పైగా నీటి నమూనాల పరీక్షల ఫలితాలను సైతం పూర్తిస్థాయిలో వెల్లడించకుండా దాపరికాన్ని ప్రదర్శిస్తోంది. ఫిబ్రవరిలో గుంటూరు నగరంలో అతిసారతో ముగ్గురు మృతి చెందడం తీవ్ర భయాందోళనకు గురిచేసింది. వాంతులు, విరేచనాలతో వందల మంది చికిత్స పొందారు. 345 మంది బాధితుల మల నమూనాలను పరీక్షిస్తే... ముగ్గురికి కలరా సోకినట్లు తేలడం సంచలనాన్ని రేకెత్తిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చివరిగా పదేళ్ల క్రితం అంటే 2014 సంవత్సరంలో కలరా కేసు నమోదైంది. అందరూ మరచిపోతున్న తరుణంలో గుంటూరులో కలరా వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. అయితే, ఈ విషయాన్ని బయటకు రానీయకుండా వైకాపా ప్రభుత్వం జాగ్రత్త పడుతుండటం గమనార్హం.

‘జల్‌జీవన్‌’ సర్వేలో డొల్లతనం వెల్లడి

రాష్ట్రవ్యాప్తంగా నదులు, వాగుల పరీవాహకాల్లోని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసింది. విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, అనంతపురం, కడప, నెల్లూరు, ఒంగోలు, కర్నూలు, తిరుపతి, విజయనగరం తదితర నగరాల్లో ఇళ్ల నుంచి వచ్చే మురుగును, మానవ వ్యర్థాలను నామమాత్రంగా శుద్ధి చేస్తున్నారు. చాలాభాగం నేరుగా నదుల్లో కలిపేస్తున్నారు. ఈ కారణంగానే... గతంలో వర్షాకాలం ఆరంభంలో మాత్రమే వెలుగు చూసే అతిసార కేసులు ప్రస్తుతం ఏడాది పొడవునా కొనసాగుతున్నాయి. గ్రామాల్లో సరఫరా చేస్తున్న తాగునీటిలో 35% కలుషితమవుతోందని, పైపుల లీకేజీలు, నిర్వహణ లోపాలు ఇందుకు కారణమని జల్‌జీవన్‌ మిషన్‌ అధ్యయనంలో తేలింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 2022 ఫిబ్రవరి 22 నుంచి ఏప్రిల్‌ 25 వరకు పది బృందాలు 58 రోజులపాటు అధ్యయనం చేశాయి. పైపులైన్లలో 30% లీకేజీలు ఉన్నట్లు గుర్తించాయి. రక్షిత తాగునీటి పథకాల నిర్వహణకు నిధుల కొరత 40%ఉందని, కొన్ని పథకాల అమలులో 30% వరకు మానవ వనరుల కొరత ఉందని పేర్కొ న్నాయి.


కీలక శాఖల మధ్య సమన్వయం కరవు

గ్రామాల్లో ఎక్కడైనా తాగునీటి పైపులు లీకవుతున్నా, మురుగు నిలిచి దోమలు పెరుగుతున్నా ఆశా, ఆరోగ్య కార్యకర్తలు... పంచాయతీరాజ్‌ శాఖ ఉద్యోగుల దృష్టికి తీసుకెళ్లాలి. కానీ, రెండు శాఖల మధ్య
సమన్వయం ఉండడంలేదు. ప్రతి శుక్రవారం ‘డ్రై డే’ పాటించాలని చెబుతున్నా కాగితాలకే పరిమితం అవుతోంది.

అనుమతులు లేని ఆర్వో ప్లాంట్లతోనూ ముప్పు

గ్రామాల నుంచి పట్టణాల వరకు అత్యధికులు ప్రైవేటు ఆర్వో ప్లాంట్ల నుంచి మినరల్‌ వాటర్‌ను కొంటున్నారు. వీటిని నడిపే వారు భూగర్భ జల వనరులు, స్థానిక సంస్థలు, తూనికలు, కొలతల శాఖ, జీఎస్టీ, విద్యుత్తు, వైద్యారోగ్య శాఖల నుంచి అనుమతులు పొందాలి. కానీ ఇవేమీ జరగడంలేదు. ఎవరికి తోచినట్లు వారు ప్లాంట్లను నిర్వహిస్తున్నారు. నీటి నాణ్యతపై ఏ దశలోనూ తనిఖీలు జరగడంలేదు.

ఘోరంగా నీటి పరీక్షల కేంద్రాల నిర్వహణ

తాగునీటి నమూనాలను గ్రామాల్లో... గ్రామీణ నీటి పారుదల శాఖ వారు, పట్టణాల్లో... ప్రజారోగ్య శాఖ అధికారులు కనీసం రెండు వారాలకోసారి తప్పనిసరిగా సేకరించాలి. కానీ... ఇది ఆచరణలో జరగడంలేదు. నీటిలో ఫ్లోరైడ్‌, కాల్షియం, ఫాస్పరస్‌ తదితరాల మోతాదును తెలుసుకోవడానికి, ఇతర పరీక్షలు చేసేందుకు అవసరమైన రసాయనాల కొనుగోలుకు నిధులను సకాలంలో ఇవ్వడంలేదు. రాష్ట్రంలో ప్రజారోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రాంతీయ, జిల్లా ప్రజారోగ్య ప్రయోగశాలలు, నీటి పరీక్షల కేంద్రాలు మొత్తంగా 11 నడుస్తున్నాయి. వీటిల్లో 143 పోస్టులకుగానూ 35 మందే పనిచేస్తుండటంతో నిర్వహణ ఘోరంగా తయారైంది.


  • నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం పలుకూరులో 2023 జూన్‌లో అతిసారతో 50 మంది, అదే ఏడాది నవంబరులో కర్నూలు జిల్లా కల్లూరు పట్టణ పరిధిలోని లక్ష్మీపురంలో 70 మంది, చిత్తూరు సమీపంలోని తుమ్మిందలో 16 మంది, విజయనగరం జిల్లా గజపతినగరం సమీపంలోని ఎం.గుమడాంలో పది మంది ఆసుపత్రుల పాలయ్యారు.
  • కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని బల్లిపర్రు గ్రామంలో 2022 మేలో 15 మంది అతిసార బారినపడ్డారు. చికిత్స పొందుతూ ఓ వృద్ధురాలు ప్రాణం విడిచారు. అదే ఏడాది మేలో కాకినాడ పదో డివిజన్‌ దుమ్ములపేటలో 20 మంది డయేరియాతో బాధపడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం మూలగరువులో 11 మంది అస్వస్థతకు గురయ్యారు. జూన్‌లో చిత్తూరు జిల్లా బాలాయపల్లి మండలం అక్కసముద్రంలోనూ పలువురు అతిసార బారిననపడ్డారు.
  • అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌ పరిధిలో 2023 ఆగస్టులో డయేరియాతో ముగ్గురు వలస కార్మికులు మృతిచెందారు. ఇదే జిల్లా అనకాపల్లి మండలం కూండ్రం గ్రామంలో 2022 జులైలో పది మంది వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు.
  • విజయవాడ గన్నవరం సమీపంలో 2022 జులైలో అతిసార సోకి ముగ్గురు మృతిచెందగా 50 మంది అనారోగ్యం పాలయ్యారు.
  • నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం ఇసుకపాళెంలో 2023 జులైలో వాంతులు, విరేచనాలతో 32 మంది అస్వస్థతకు గురయ్యారు. చికిత్స పొందుతూ వారిలో నలుగురు ప్రాణాలు విడిచారు.
  • విజయనగరం జిల్లా డెంకాడ మండలం పినతాడివాడ, గునుపూరు గ్రామాల్లో 2023 సెప్టెంబరులో 40 మంది కలుషిత నీటి కారణంగా అస్వస్థతకు గురయ్యారు. ఇదే జిల్లా గంట్యాడ మండలం లక్కిడాంలో 2022 జులైలో 40 మందికిపైగా అతిసార బారినపడ్డారు.
  • నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం పగిడ్యాల, బీరవోలు, ఆంజనేయనగర్‌లలో 2023 నవంబరులో 100 మంది అతిసారతో ఆసుపత్రుల్లో చేరారు.
  • గుంటూరు జిల్లా మంగళగిరి నగర పాలిక పరిధిలోని 12వ సచివాలయ పరిధిలో రంగుమారిన నీరు కారణంగా పలువురు వాంతులు, విరేచనాలతో ఇబ్బందిపడ్డారు.

ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని