YS Sowbhagyamma: ఇంటి శత్రువును ఆలస్యంగా గుర్తించాం

‘వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఓటెయ్యొద్దన్న నా కుమార్తె సునీత పిలుపుతో నేనూ ఏకీభవిస్తున్నా. ఓటెయ్యొద్దని రాష్ట్ర ప్రజలకు నేనూ పిలుపునిస్తున్నా.

Updated : 15 Mar 2024 14:26 IST

నా భర్త హంతకుల్ని జగన్‌ కాపాడుతున్నారు
వివేకా హత్య గురించి జగన్‌కు ముందే తెలిసినా సాయంత్రం వరకు ఎందుకు రాలేదు?
న్యాయం కోసం వెళితే నా కుమార్తె, అల్లుడిపైనే నేరం మోపాలనుకున్నారు
జగన్‌ సహకరించరని తెలిశాకే... నా కుమార్తె సునీత ఒంటరి పోరాటం చేస్తోంది
జగన్‌కు ఓటెయ్యొద్దని నేనూ పిలుపునిస్తున్నా
‘ఈనాడు-ఈటీవీ’ ముఖాముఖిలో వైఎస్‌ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ
ఈనాడు - కడప

‘వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఓటెయ్యొద్దన్న నా కుమార్తె సునీత పిలుపుతో నేనూ ఏకీభవిస్తున్నా. ఓటెయ్యొద్దని రాష్ట్ర ప్రజలకు నేనూ పిలుపునిస్తున్నా. ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన సాగుతోంది’ అని మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ పేర్కొన్నారు. ‘నా భర్త హంతకుల్ని ముఖ్యమంత్రి జగన్‌ కాపాడుతున్నారన్న అనుమానాలు బలంగా ఉన్నాయి. వివేకా హత్య గురించి బాహ్యప్రపంచాని కంటే ముందే జగన్‌కు, ఆయన సతీమణి భారతికి తెలుసన్న అనుమానం ఉంది’ అని ఆమె తెలిపారు. వివేకా హత్య విషయం తెల్లవారుజామునే జగన్‌కు తెలిసినా సాయంత్రం వరకు పులివెందుల ఎందుకు రాలేదని
ప్రశ్నించారు. 

వాళ్ల దగ్గర అధికారం ఉంది కాబట్టే ఎంపీ అవినాష్‌రెడ్డి తప్పించుకు తిరుగుతున్నారని, న్యాయం జరగకుండా తొక్కిపెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘జగన్‌ సీఎం అయ్యాక న్యాయం కోసం మా కుటుంబమంతా జగన్‌ వద్దకు వెళ్లింది. కానీ ఆయన మాతో విడిగా మాట్లాడకుండా, ఇతరుల్ని దగ్గర పెట్టుకుని మాట్లాడారు. నా కుమార్తె, అల్లుడిపైనే వేలు చూపించారు. శత్రువులు మా ఇంట్లోనే ఉన్నారని ఆలస్యంగా గ్రహించాం. అక్కడి నుంచి వచ్చేసి ఒంటరిగా న్యాయ పోరాటం చేస్తున్నాం’ అని తెలిపారు. వివేకా హత్య జరిగి అయిదేళ్లయినా ఇప్పటి వరకు కేసు దర్యాప్తు కొలిక్కిరాకపోవడం, హంతకులకు శిక్షపడకపోవడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం వివేకా అయిదో వర్ధంతి సందర్భంగా ‘ఈనాడు- ఈటీవీ’ ముఖాముఖిలో సౌభాగ్యమ్మ తన మనసులో గూడుకట్టుకున్న ఆవేదనను వెల్లడించారు.

జగన్‌కు ముందే ఎలా తెలుసు? 

నా భర్త హత్యపై మాకు అనేక అనుమానాలున్నాయి. ఆయన హత్య విషయం జగన్‌కు ముందే ఎలా తెలుసు? వివేకా మరణించారన్న విషయం తెలియగానే మేమంతా హుటాహుటిన హైదరాబాద్‌ నుంచి బయల్దేరి వచ్చేశాం. మరి జగన్‌ సాయంత్రం వరకు పులివెందుల ఎందుకు రాలేదు? ఇలాంటి ప్రవర్తనే అనేక అనుమానాలకు తావిస్తోంది.

అండగా ఉండకపోగా... ఆడపిల్లను ముప్పుతిప్పలు పెడతారా?

నా భర్తను రాజకీయ కారణాలతోనే హత్య చేశారు. తండ్రిని చంపిన హంతకుల్ని బోనులో నిలబెట్టేందుకు నా కుమార్తె సునీత ఒంటరి పోరాటం చేస్తుంటే.. జగన్‌ అండగా ఉండకపోగా ముప్పుతిప్పలు పెడుతున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా వివేకా హత్యపై సీబీఐ దర్యాప్తునకు డిమాండ్‌ చేసిన జగన్‌ అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదు. పైగా నా కుమార్తె న్యాయం కోసం వెళితే అవమానకరంగా మాట్లాడారు. వివేకా హత్య విషయంలో నా కుమార్తెను, అల్లుణ్ని ఎందుకు అనుమానించకూడదన్నట్టుగా మాట్లాడారు. వివేకా హత్యపై సీబీఐ విచారణ కోరుతూ కోర్టులో పిటిషన్‌ వేసే చివరి క్షణంలో కూడా... హంతకులకు శిక్షపడేలా చేయడంలో సహకరించాలని జగన్‌ను సునీత కోరింది. కానీ అతను పట్టించుకోకుండా లెక్కలేకుండా మాట్లాడారు. మరో దారిలేక సునీత ఒంటరి పోరాటం చేస్తోంది. చివరకు న్యాయమే గెలుస్తుంది.

నా బిడ్డపైనే నేరం మోపాలనుకున్నారు

వివేకా హత్యకు కారకులెవరో తేల్చాలని సునీత పట్టుబట్టడంతో నేరాన్ని ఆమెపైనా, ఆమె భర్తపైనా నెట్టేయాలని చూశారు. నిజంగా వారే తప్పు చేసి ఉంటే మీరే విచారించి శిక్షించొచ్చు కదా! 

నా బిడ్డ పోరాటం చూసి కుమిలిపోతున్నా

భర్తను కోల్పోయిన బాధ ఒకపక్క.. న్యాయం కోసం నా బిడ్డ కష్టం చూసి మరోపక్క కుమిలిపోతున్నా. ఆమె ఒంటరి పోరాటం చూసి బాధగా ఉన్నా... అతిపెద్ద శక్తులకు ఎదురొడ్డి కేసును ఇంత వరకు తెచ్చిన తెగువ, పట్టుదల చూసి గర్వపడుతున్నా. వివేకానందరెడ్డి, రాజశేఖరరెడ్డి ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అన్నకు వివేకా లక్ష్మణుడిలా మెలిగేవారు. వివేకా మంచి మనిషి. మృదుస్వభావి. ఆయనకు లభిస్తున్న ఆదరణ చూసి కొందరు ఓర్చుకోలేకపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించారు. ఎన్నో ఇబ్బందులు పెట్టి పక్కకు తోసేయాలని భావించారు. ఆ కక్షను మేం గ్రహించలేకపోయాం. ఎన్ని విభేదాలున్నా జగన్‌ను సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని వివేకా తపించారు. కానీ ఇంట్లోనే శత్రువులున్నారని ఆలస్యంగా గ్రహించాం.

వైఎస్‌ మరణించాకే కుట్రలు మొదలయ్యాయి

రాజశేఖరరెడ్డి ఉన్నంత వరకు మా మధ్య అనుబంధాలు బాగానే ఉన్నాయి. ఆయన మరణించాకే కుట్రలు, కుతంత్రాలు మొదలయ్యాయి. కానీ మేం మంచిగా ఆలోచించబట్టి వాటిని గ్రహించలేకపోయాం. వాళ్లు, వీళ్లు అన్న తేడా లేకుండా మసలుకునేవాళ్లం. మాకు గ్రూపు రాజకీయాలు తెలియవు. ఇప్పుడు మమ్మల్ని పూర్తిగా పక్కన పెట్టేశారు.

మా ఇంట్లోనే హత్యలు జరుగుతాయని ఊహించలేదు

పూర్వం మా ప్రాంతంలో తరచూ హత్యలు, దాడుల గురించి వినేవాళ్లం. రాజశేఖరరెడ్డి, వివేకానందరెడ్డి పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వచ్చాక హత్యా సంస్కృతి చాలా వరకు తగ్గి,  ప్రశాంత వాతావరణం నెలకొంది. కానీ చివరకు మా ఇంట్లోనే హత్యలు జరుగుతాయని ఊహించలేదు.

మాకే ఈ పరిస్థితి ఎదురైతే.. సామాన్యుల మాటేంటి?

ఏం మాట్లాడితే ఏం జరుగుతుందోనన్న భయం, ఆందోళనతో ప్రజలు బతుకుతున్నారు. సమావేశం పెట్టుకోవడానికి మాకే పులివెందులలో కల్యాణ మండపం ఇవ్వకుండా అడ్డుపడ్డారు. దాంతో మేం కడపకు మార్చుకోవాల్సి వచ్చింది. మా పరిస్థితే అలా ఉంటే.. ఇక సామాన్యుల మాటేంటి?

నా రాజకీయ ప్రవేశాన్ని భవిష్యత్తే నిర్ణయిస్తుంది

నేను ఏదీ కోరుకోలేదు. రాజకీయ ప్రవేశంపై సమయాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాను.

రాష్ట్రానికి మంచి పాలకుడు రావాలి

జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని వివేకా కలలుగన్నారు. కానీ ఇలాంటి పాలన కోసం కాదు. జగన్‌ పాలన బాగాలేదు. ప్రజావేదిక కూల్చేసినప్పుడే ఏంటీ పరిపాలన అనుకున్నాను. వచ్చే ఎన్నికల్లోనైనా రాష్ట్రానికి మంచి నాయకుడు పాలకుడు రావాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రజలకు మంచి పరిపాలన అందించే ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటున్నాను.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని