అడ్మిరల్‌ లక్ష్మీనారాయణ్‌ రాందాస్‌ ఇక లేరు

భారత్‌ -పాక్‌ యుద్ధ వీరుడు, భారతదేశ పూర్వ నౌకాదళాధిపతి, రామన్‌ మెగసెసే, వీర్‌చక్ర పురస్కార గ్రహీత అడ్మిరల్‌ లక్ష్మీనారాయణ్‌ రాందాస్‌ (90) ఇకలేరు.

Updated : 16 Mar 2024 06:05 IST

నౌకాదళాధిపతిగా విశిష్ట సేవలు
రామన్‌ మెగసెసే, వీర్‌చక్ర పురస్కార గ్రహీత

కాప్రా, ఏఎస్‌రావునగర్‌, న్యూస్‌టుడే: భారత్‌ -పాక్‌ యుద్ధ వీరుడు, భారతదేశ పూర్వ నౌకాదళాధిపతి, రామన్‌ మెగసెసే, వీర్‌చక్ర పురస్కార గ్రహీత అడ్మిరల్‌ లక్ష్మీనారాయణ్‌ రాందాస్‌ (90) ఇకలేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లోని ఆర్మీ ఆస్పత్రిలో శుక్రవారం సాయంత్రం పరమపదించారు. రాందాస్‌కు భార్య లలిత, కుమార్తెలు కవిత, సాగరి, మల్లిక ఉన్నారు. శనివారం తిరుమలగిరిలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు అల్లుడు మధు తెలిపారు.

ఐఎన్‌ఎస్‌ బియాస్‌కు నాయకత్వం..

ముంబయిలో 1933 సెప్టెంబరు 5న లక్ష్మీనారాయణ్‌, నారాయణి దంపతులకు రాందాస్‌ జన్మించారు. త్రివిధ దళాల్లో చేరాలన్న తపనతో 1949లో తన 16వ ఏటే దేహ్రాదూన్‌లోని సైనిక దళాల శిక్షణ అకాడమీలో చేరి అక్కడ క్యాడెట్‌గా తర్ఫీదు పొందారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక త్రివిధ దళాల శిక్షణలో చేరిన మొదటి బ్యాచ్‌లో ఆయన ఒకరు. 1953లో భారత నౌకాదళంలో చేరిన రాందాస్‌ అంచలంచెలుగా ఎదిగారు. 1971లో జరిగిన పాకిస్థాన్‌, భారత్‌ యుద్ధ సమయంలో బంగ్లాదేశ్‌ విమోచనకు తూర్పు నౌకాదళాన్ని ఏర్పాటు చేశారు. ఐఎన్‌ఎస్‌ బియాస్‌కు నాయకత్వం వహించారు. యుద్ధ సమయంలో 93 వేల మంది పాకిస్థాన్‌ సైనికులు తప్పించుకునేందుకు చేసిన పన్నాగాన్ని పసిగట్టి నిలువరించారు. పాకిస్థాన్‌ సముద్ర మార్గం గుండా పేలుడు పదార్థాలు, నిషేధిత వస్తువులను బంగ్లాదేశ్‌కు తరలిస్తున్న నౌకలను ఆయన సారథ్యంలోని ఐఎన్‌ఎస్‌ బియాస్‌ అడ్డుకుంది. నౌకాదళాధిపతిగా 1990 నుంచి 1993 వరకు పనిచేసి పదవీ విరమణ చేశారు. అనంతరం అణ్వాయుధాల తయారీకి వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య పరిరక్షణ, విద్య, ఆరోగ్యం, పేదరికం, అంటరానితనం నిర్మూలనకు కృషి చేశారు. ఆయన చేసిన సేవలకు ప్రతిష్ఠాత్మక ‘రామన్‌ మెగసెసే’ పురస్కారాన్ని అందుకున్నారు. పదవీ విరమణ తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం అలీబాగ్‌లో అయిదెకరాల స్థలం ఇవ్వడంతో ఆయన అక్కడే స్థిరపడ్డారు. ఆరు నెలల క్రితం హైదరాబాద్‌లోని సైనిక్‌పురిలో నివసిస్తున్న కుమార్తె సాగరి ఇంటికి వచ్చారు. ఇక్కడే తుదిశ్వాస విడిచారు.

సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం

విశ్రాంత నౌకాదళాధిపతి అడ్మిరల్‌ లక్ష్మీనారాయణ్‌ రాందాస్‌ మృతిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. 16 ఏళ్ల వయసులోనే సంయుక్త సైనిక దళాల్లో చేరిన రాందాస్‌.. తర్వాత నౌకాదళంలో చేరి అంచెలంచెలుగా ఎదిగారని ముఖ్యమంత్రి కొనియాడారు. రాందాస్‌ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సానుభూతి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని