ప్రజాస్వామ్య వనంలో గంజాయి మొక్క

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఏది?... అంటే సమాధానం స్పష్టంగా చెప్పలేకపోవచ్చు! ఆంధ్రప్రదేశ్‌ దేనికి రాజధాని? అంటే మాత్రం... గంజాయ్‌ కేపిటల్‌ ఆఫ్‌ ఇండియా అని టక్కున సమాధానం వచ్చే దుస్థితి!

Updated : 18 Apr 2024 16:45 IST

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఏది?... అంటే సమాధానం స్పష్టంగా చెప్పలేకపోవచ్చు! ఆంధ్రప్రదేశ్‌ దేనికి రాజధాని? అంటే మాత్రం... గంజాయ్‌ కేపిటల్‌ ఆఫ్‌ ఇండియా అని టక్కున సమాధానం వచ్చే దుస్థితి! దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా ఆంధ్రవైపే వేలెత్తి చూపించే పరిస్థితి.... ఇదీ ఐదేళ్లలో జగనన్న ఆంధ్రావనికి అద్దిన పురోగతి!

జగన్‌మోహన్‌రెడ్డి- రోడ్లు వేయలేదు. రాజధాని కట్టలేదు. అభివృద్ధి చేయలేదు. ఉద్యోగాలు ఇవ్వలేదు. పోలవరాన్ని పట్టించుకోలేదు. ముఖ్యమంత్రిగా చేయాల్సిందేదీ చేయని జగన్‌..  చేయకూడని పాపిష్టి పనులెన్నో చేశారు. ప్రజల ప్రాణాలను తోడేసే గంజాయి భూతానికి బీభత్సమైన స్వేచ్ఛనిచ్చారు. మత్తు పదార్థాల వ్యాపారంలో మునిగితేలుతున్న జగన్‌ పార్టీ నేతల సాక్షిగా ఏపీ ఇప్పుడు ‘గంజాయి కాపిటల్‌ ఆఫ్‌ ఇండియా’ అయ్యింది. మాదక ద్రవ్యాల విషవృక్షానికి నీళ్లుపోసిన జగన్‌మోహన్‌రెడ్డి పాలన- బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లలెందరినో జీవచ్ఛవాలను చేసింది. కుటుంబాలకు ఆసరా కావాల్సిన యువతను ఉచ్ఛంనీచం తెలియని నేరగాళ్లుగా మార్చింది.


మాదక రక్కసి సేవలో జగన్‌

ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యమని 47వ రాజ్యాంగ అధికరణ నిర్దేశిస్తోంది. ఒంటికి హానికరమైన మత్తు పదార్థాల సేవనాన్ని నిషేధించడానికి సర్కారు కృషిచేయాలని అదే అధికరణ స్పష్టంచేస్తోంది. దాన్ని తుంగలో తొక్కిన జగన్‌- మద్యం మహమ్మారిని జనం మీదకు తోలారు. అది చాలదన్నట్లు- అతి ప్రమాదకరమైన మాదక ద్రవ్యాల కబంధ హస్తాల్లోకి రాష్ట్రాన్ని తోసేశారు. అఫ్గానిస్థాన్‌ నుంచి విజయవాడ చిరునామాకు వస్తున్న రూ.9వేల కోట్ల విలువైన హెరాయిన్‌ను 2021లో గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో అధికారులు పట్టుకున్నారు. ఆ తరవాత కొద్దిరోజులకు జగన్‌ మాట్లాడుతూ- ‘‘రాష్ట్రంలో డ్రగ్స్‌ వ్యవహారాలు లేవు’’ అని నాలుక చప్పరించారు. ‘‘డ్రగ్స్‌ ఆంధ్రప్రదేశ్‌ అని గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు’’ అని గుండెలు బాదుకున్నారు. కళ్ల ముందు కనపడుతున్న సమస్యను ‘లేదు.. లేదు’ అంటే జనం ఏవగించుకుంటారు. జగన్‌ బుర్రలో ఆ బల్బు ఆలస్యంగా వెలిగినట్లుంది- అందుకే మాట మార్చి డ్రగ్స్‌ను అడ్డుకోవాలనే కొత్త రాగం ఎత్తుకున్నారు. ‘‘రాష్ట్రాన్ని వచ్చే మూడు నాలుగు నెలల్లో సంపూర్ణ మాదక ద్రవ్యాల రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలి’’ అని 2022 డిసెంబరులో ఘన సంకల్పమొకటి ప్రకటించారు జగన్‌. అయ్యగారు అలా ‘అబ్రకదబ్ర’ అని పదిహేను నెలలు అయ్యింది కదా.. మరేం జరిగింది? రాష్ట్రంలో మాదకద్రవ్యాల వేళ్లు ఇంకా లోతులకు చొచ్చుకుపోయాయి. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బూదవాడలో ఇటీవలే గంజాయి చాక్లెట్లు భారీగా దొరికాయి. ఇలాంటివే మరెన్నో ఘటనలు... జగన్‌ ఏలుబడిలో మారుమూల పల్లెలకూ చేరిన మత్తురక్కసి అడుగుజాడలను పట్టించేవే అన్నీ!


బడి.. గుడి.. అన్నిచోట్లా గంజాయి!

గన్‌ దౌర్భాగ్య పాలన ఫలితంగా అభంశుభం తెలియని పసివారూ డ్రగ్స్‌ కోరల్లో చిక్కుకున్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం, కృష్ణా జిల్లా పెనమలూరు, ఎన్టీఆర్‌ జిల్లా రామవరప్పాడు, తిరుపతి జిల్లా చంద్రగిరి... ఇలా పలు ప్రాంతాల్లోని పాఠశాలల విద్యార్థులు గంజాయికి అలవాటుపడ్డారు. ఆంధ్ర, నన్నయ విశ్వవిద్యాలయాల నుంచి కర్నూలు, ఒంగోలు వైద్య కళాశాలల వరకు అన్నీ గంజాయి పొగలతో మసిబారాయి. కలియుగ వైకుంఠం తిరుమల కొండపైకి గంజాయిని తరలించే దుస్సాహసాలూ జగన్‌ ఏలుబడిలోనే వెలుగుచూశాయి. ఒంగోలులోని అప్పాయికుంటలో ఇటీవల సీతారామాంజనేయుల తెప్పోత్సవం జరిగింది. వేడుక అనంతరం స్వామివార్ల విగ్రహాలను ఆలయానికి తీసుకెళ్తున్న భక్తులపై పైశాచిక మూక ఒకటి దాడిచేసింది. గంజాయి మత్తులో ఊగిపోతున్న ఆ దుర్మార్గులు.. స్వామివారి విగ్రహంపై మద్యంపోశారు. గతంలో కనివినీ ఎరగని ఇలాంటి అకృత్యాలకు మూలకారణం జగన్‌మోహన్‌రెడ్డి అరాచక రాజ్యమే. ఆంధ్రప్రదేశ్‌ను అన్నిరకాలుగా ఛిన్నాభిన్నం చేసిన జగన్‌- ప్రజాస్వామ్య తులసివనంలో ఓ గంజాయి మొక్క!


మాఫియాపై జగన్‌ ప్రేమానురాగాలు

గన్‌ రాజ్యంలో గంజాయి పీడ సోకని ప్రాంతం లేదు. గడచిన రెండు నెలల్లోనే అనంతపురం, అనపర్తి, అరకు, చిత్తూరు, నెల్లూరు, నూజివీడు, మంగళగిరి వంటి చోట్ల గంజాయి ముఠాల ఆనవాళ్లు బయటపడ్డాయి. తాజాగా రాజమహేంద్రవరం నుంచి చెన్నైకు వెళ్తున్న 457 కిలోల గంజాయి బాపట్లలో పట్టుబడింది. విశాఖ మన్యం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తున్న గుట్టల కొద్దీ గంజాయిలో అధికారులు స్వాధీనం చేసుకుంటోంది ఆవగింజంతే! గంజాయి దందాను వ్యవస్థీకృత నేర సామ్రాజ్యంగా విస్తరించిన కిరాతకుల జోలికైతే జగన్‌ ప్రభుత్వం ఏనాడూ పోలేదు. దానిపై ఏపీ హైకోర్టు సైతం తీవ్రంగా తలంటింది. ‘గంజాయి అక్రమ రవాణా కేసుల్లో లారీ డ్రైవర్లు తదితరులనే నిందితులుగా పేర్కొంటున్నారు. దీని వెనక ఉన్న పెద్ద తలకాయలను ఎప్పుడూ నిందితులుగా చేర్చడం లేదు. ఇది దర్యాప్తు తీరుపై సందేహాలకు తావిస్తోంది’ అన్న ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు- జగన్‌ ప్రభుత్వ పనితీరుకు అద్దంపట్టేవే. మాదక ద్రవ్యాల కేసుల దర్యాప్తుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేయాలని, డీజీపీ క్రమం తప్పకుండా సమీక్షించాలని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. జగన్‌ కిరాయి సైనికులైన పోలీసులకు న్యాయస్థానం హితవచనాలు తలకెక్కుతాయా? ఎక్కవు కాబట్టే గంజాయికి ఏపీలో ‘సోర్స్‌’ లేదని, అదంతా ఒడిశా నుంచే వస్తోందని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి నిరుడు తేల్చిపడేశారు. ఖాకీ చొక్కాలేసుకుని నిర్లజ్జగా జగన్‌కు ఊడిగం చేస్తున్నవారు వాస్తవాలను ఒప్పుకొంటారని అనుకోవడమే పొరపాటు. వ్యవస్థలను చెరబట్టి ప్రజాభద్రతను పొట్టనపెట్టుకున్న జగనే రాష్ట్రానికి ఒక గ్రహపాటు!


పులి కాదు పిల్లి

పిల్లిని చూపించి పులి అని బుకాయించడంలో జగన్‌ పార్టీ, దాని కరపత్రికలకు తిరుగులేదు. విశాఖ మన్యంలో గంజాయి సాగును పూర్తిగా తుడిచిపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందంటూ జగన్‌ వీరభక్తులు మోతెక్కించారు. వాళ్ల ఆత్మసుత్తి ప్రకటనలకు గాలితీస్తూ- ‘‘దక్షిణ భారతదేశంలోని అయిదు రాష్ట్రాలకు ఏపీ నుంచే గంజాయి సరఫరా అవుతోంది’’ అని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి త్రివిక్రమవర్మ బహిరంగంగానే చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలకే కాదు- దేశం మొత్తానికి ఏపీ నుంచే గంజాయి బట్వాడా అవుతోంది. ‘‘విశాఖపట్నం, ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో అడ్డూఆపూ లేకుండా గంజాయి సాగవుతోంది’’ అని కేంద్ర నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో వార్షిక నివేదిక సైతం స్పష్టంచేసింది. దాదాపు రూ.10వేల కోట్ల విలువైన గంజాయి ఏటా విశాఖ మన్యం నుంచి బయటికొస్తోంది. ఏపీలోని పల్లె పల్లెనూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న గంజాయి పొగలు- జాతీయ, అంతర్జాతీయ స్థాయులకూ పాకి రాష్ట్రం పరువును ఎప్పుడో పాతాళానికీడ్చేశాయి. అయినాసరే, మన్యంలో గంజాయి సాగును పెకలించేందుకు జగన్‌ ఇదమిత్థంగా చేసిందేమీ లేదు. గంజాయిని కట్టడి చేయడంలో జగన్‌ నేరపూరిత నిర్లక్ష్యం- వేలాది కుటుంబాల్లో కన్నీటి మంటలను రగిల్చింది.


జగన్‌ ఇంటి దగ్గరే ఘోరాలు

‘‘ముఖ్యమంత్రి నివాసం ఉండే తాడేపల్లిలో గంజాయి బ్యాచ్‌ల ఆగడాలకూ అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. వారితో మాకు నిద్రాహారాలు ఉండటం లేదు. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నాం’’ అంటూ స్థానిక మహిళలు నిరుడు ఫిబ్రవరిలో పోలీస్‌ స్టేషన్‌ దగ్గర ఆందోళన చేశారు. అయినా జగన్‌ సర్కారు కదల్లేదు. ఆపై కొద్ది రోజులకే జగన్‌ ఇంటికి కూతవేటు దూరంలోనే ఓ దళిత అంధ బాలికను నరికి చంపాడో దుర్మార్గుడు. గంజాయి తాగి ఆ బాలిక ఇంట్లోకి జొరబడిన నీచుడు- పాపం ఆ అసహాయురాలిని కిరాతకంగా హతమార్చాడు. జగన్‌ నివాసానికి సమీపంలోనే అంతకు ముందు ఓ దళిత యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. గంజాయి మత్తు తలకెక్కిన ముగ్గురు కర్కోటకులు ఆ ఘోరానికి ఒడిగట్టారు. నెల్లూరు జిల్లా కావలిలో దారినపోతున్న ఎనిమిదేళ్ల పసిదాని గొంతు కోశాడో గంజాయి బానిస. గుంటూరులో ఇద్దరు మైనర్లు గంజాయి దమ్ముకొట్టి బైకు మీద తిరుగుతూ వరసగా దొంగతనాలకు పాల్పడ్డారు. అడ్డొచ్చిన ఇద్దరు వాచ్‌మెన్లను చంపి, ముగ్గురిని తీవ్రంగా గాయపరిచారు. జగన్‌ జమానాలో గంజాయి గ్యాంగులు ఊరూరా పుట్టుకొచ్చాయి. రోడ్ల మీద వీరంగాలేస్తూ అవి సామాన్యులను హడలెత్తిస్తున్నాయి.


వైకాపా మూకల మత్తు దందా

స్వతహాగా జగనే ఒక నేరచరితుడు. అందుకే ఆయన పార్టీ- నేరగాళ్లకు రాజకీయ పునరావాస కేంద్రమైంది. హేయమైన నేరాల్లో చెయ్యితిరిగిన వైకాపా నేతలు- మాదక ద్రవ్యాల దందాసురులుగానూ అవతరాలెత్తారు. దిల్లీ నుంచి కొకైన్‌, ఎండీఎంఏ, గాంజా పౌడర్‌లను తీసుకొస్తున్న ఇద్దరిని మొన్న జనవరిలో తెలంగాణలోని నిజామాబాద్‌లో అరెస్టు చేశారు. వారిలో ఒకరైన ద్వారంపూడి విక్రమ్‌రెడ్డి- రాజమహేంద్రవరం వైకాపా ఎంపీ అనుచరుడు. విక్రమ్‌రెడ్డి తండ్రి స్థానిక వైకాపా నాయకుడు. జగన్‌ నీడలో హాయిగా సేదతీరుతూ జనాన్ని కాటేస్తున్న ఇలాంటి విషపురుగులు ఇంకెన్నో ఉన్నాయి. రాప్తాడు వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి స్టిక్కర్‌ ఉన్న కారులో అయిదుగురు కుర్రాళ్లు గంజాయి సేవిస్తూ ఆ మధ్యన రోడ్డెక్కారు. ‘‘ఏరా... ఎమ్మెల్యే బండికే అడ్డం వస్తావా’’ అంటూ ఒక యువకుడి మీద దాడిచేశారు. రంపచోడవరం వైకాపా నాయకుడైన కృష్ణారెడ్డి 300 కేజీల గంజాయిని తీసుకొస్తూ- డివైడర్‌ను ఢీకొట్టి, ఆ పక్కనే ఉన్న జలాశయంలోకి కారును బోల్తా కొట్టించాడు. సత్యసాయి జిల్లాకు చెందిన వైకాపా ఎమ్మెల్యే కుమారుడి స్నేహితుడూ ఇంకొందరు గంజాయి, డ్రగ్స్‌తో కర్నూలులో పట్టుబడ్డారు. వాళ్లను విడిపించడానికి ఇద్దరు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. గుంటూరులో జగన్‌ పార్టీ ప్రజాప్రతినిధి సోదరుడి కొడుకు తరచూ డ్రగ్స్‌ను సరఫరా చేస్తుంటాడు. ఆ సంగతి అందరికీ తెలిసినా- అతని మీద ఈగైనా వాలదు. పల్నాడులోని ఒక నియోజకవర్గంలో జగన్‌ పార్టీ ప్రబుద్ధులే గంజాయి వ్యాపారులు. ఈ అమానుష దందాలో తలమునకలైన వైకాపా నేతల ఉదంతాలు ఇంకెన్నో జిల్లాల్లో వెలుగుచూశాయి. ప్రజారోగ్యాన్ని పీల్చిపిప్పిచేసే మత్తుపిశాచిని ముద్దుచేస్తోంది సొంతపార్టీ వాళ్లు కాబట్టే గంజాయి మీద జగన్‌మోహన్‌రెడ్డి ఉక్కుపాదం మోపలేదా? గంజాయితో యువశక్తులు చచ్చుబడుతున్నా సరే, గుడ్లప్పగించి చూస్తూ కూర్చున్న జగన్‌ వరస చూస్తే అలాగే ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని