Budget 2023: మోదీ సర్కారు ఆ ఐదు నిర్ణయాలపై ఆసక్తి..!

వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం ప్రస్తుత ప్రభుత్వానికి లేదు. ఈ నేపథ్యంలో 2023 బడ్జెట్‌(Budget 2023)తోనే మోదీ సర్కారు ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఐదు కీలక అంశాల్లో సర్కారు నిర్ణయాలపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

Updated : 21 Jan 2023 10:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటోంది. భారత్‌ పరిస్థితి మెరుగ్గా ఉన్నా.. దీని ప్రభావం కొంతైనా దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు ఉద్యోగాల కోతను మొదలుపెట్టాయి. దీంతో ప్రజల వ్యయశక్తి తగ్గి ప్రభుత్వ ఆదాయం తగ్గనుంది. ఈ క్రమంలో ఎక్కడ అభివృద్ధికి బ్రేకులు పడకుండా ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడం మోదీ సర్కారుకు కత్తిమీద సాములా మారనుంది. ప్రభుత్వం వ్యయ నియంత్రణ ఎక్కడ బ్యాలెన్స్‌ తప్పినా ద్రవ్యలోటు పెరిగిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు మార్కెట్‌ నుంచి కేంద్రం నిధులు సమీకరించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఇది వడ్డీరేట్లపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. ఫలితంగా ద్రవ్యోల్బణం అదుపుతప్పే ప్రమాదముంది.

తక్కువ ద్రవ్యలోటు..

గోల్డ్‌మన్‌ శాక్స్‌ నిపుణుల అభిప్రాయం ప్రకారం 2023 ఏప్రిల్‌ 1 నుంచి కేంద్రం ద్రవ్యలోటును 50 బేసిస్‌ పాయింట్లు తగ్గించవచ్చు. భారత్‌ దీనిని తన జీడీపీలో 5.9గా నిర్ధారించే అవకాశలున్నాయి. అభివృద్ధి పనులను ఆపకుండానే ఈ సారి సంక్షేమ పథకాలపై దృష్టిపెట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో గ్రామీణ పథకాలు, హౌసింగ్‌ పై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉందని గోల్డ్‌మన్‌ శాక్స్‌ నిపుణులు అండ్రూ టిల్టన్‌, శాంతను సేన్‌ గుప్తా అభిప్రాయపడ్డారు.

పన్ను శ్లాబుల్లో మార్పులు..

బడ్జెట్‌ (Budget 2023) అనగానే మధ్య తరగతి జీవి ఆశగా ఎదురు చూసేవి పన్ను శ్లాబుల్లో మార్పులు. ప్రస్తుతం రూ.2.5లక్షల ఆదాయంపై పన్ను లేదు. 2014-15లో ప్రవేశపెట్టిన ఈ నిబంధనలో ఇప్పటి వరకూ మార్పు లేదు. చిరు ఉద్యోగులకు పెరుగుతున్న ఖర్చులకు (ద్రవ్యోల్బణానికి) సరిపడా మాత్రమే జీతాలు పెరిగినా ఆ మేరకు పన్ను పోటు కూడా పెరుగుతూ వస్తోంది. తాజాగా అంతర్జాతీయ పరిణామాల కారణంగా ఇంధన, ఆహారధరల్లో వృద్ధితో ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో పన్ను లేని ఆదాయ పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతుందనే అంచనాలున్నాయి. 

స్టాండర్డ్‌ డిడక్షన్‌ పెంపు..

ఆదాయపు పన్ను లెక్కింపులో కీలకమైన స్టాండర్డ్‌ డిడక్షన్‌ పరిధిపై కూడా చాలా రోజులగా అసంతృప్తి నెలకొంది. ప్రస్తుతం ఇది రూ.50,000గా ఉంది. దీనిని కనీసం రూ.లక్షకు పెంచాలన్న డిమాండ్లు బలంగా ఉన్నాయి. పెరుగుతున్న జీవన వ్యయాలను దృష్టిలో పెట్టుకొని దీనిలో ప్రభుత్వం కొంత వెసులుబాటు పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు.

గృహ రుణ వడ్డీ చెల్లింపులపై మినహాయింపు పెంపు

గృహ రుణాలపై చెల్లించే వడ్డీకి ఇప్పటి వరకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 24(బీ) ప్రకారం మినహాయింపు లభిస్తుంది. దీనికి అత్యధికంగా రూ.2,00,000 లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది. కొవిడ్‌ తర్వాత మళ్లీ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ పుంజుకొంది. ఇళ్ల రేట్ల ధరలు ఏటా కనీసం 3.5శాతం చొప్పున పెరిగాయి. మరో పక్క వడ్డీ రేట్లు కూడా పెరిగాయి. కొవిడ్‌ సమయంలో 6.5 వద్ద ఉన్న వడ్డీ రేటు 8.5 దాటేసింది. దీంతో వినియోగదారులపై చెల్లింపుల భారం కూడా పెరిగింది. ఈ సమయంలో సెక్షన్‌ 24(బీ) పరిధిని కూడా పెంచాల్సిన అవసరం ఉంది.

మౌలిక వసతులు, సంక్షేమ పథకాలకు నిధులు పెంపు..

2024 పార్లమెంట్‌ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో  ప్రభుత్వం భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రకటించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. భవిష్యత్తులో చేపట్టే బృహత్‌ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రకటనలు ఈ బడ్జెట్‌లో ఉండే అవకాశాలు ఉన్నాయి. 2024లో కేవలం తాత్కాలిక బడ్జెట్‌ కావడంతో అప్పుడు ప్రభుత్వానికి పెద్దగా అవకాశాలు ఉండవు. దీనిని దృష్టిలో ఉంచుకొనే నయా ప్రాజెక్టుల ప్రకటనలు ఉండొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని