
Stock market: మార్కెట్లలో కొనసాగుతున్న ఒమిక్రాన్ భయాలు!
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో సూచీలు అప్రమత్తంగా కదలాడుతున్నాయి. దేశీయంగా కొన్ని సానుకూలతలు ఉన్నప్పటికీ.. ఒమిక్రాన్ భయాలే పైచేయి సాధిస్తున్నాయి. రిలయన్స్ టారిఫ్‌లు పెంచడం, ప్రైవేటు బ్యాంకుల్లో ప్రమోటర్ల వాటాపై ఆర్‌బీఐ సానుకూల ప్రతిపాదనలు, ముడి చమురు ధరలు తగ్గడం, వివిధ దేశాల కరెన్సీలు కోలుకోవడం వంటి పరిణామాలు సూచీలకు కలిసొస్తాయని భావించినప్పటికీ.. అవేవీ ప్రభావం చూపడం లేదు. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొవిడ్ కొత్త వేరియంట్ (B.1.1.529).. క్రమంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోవైపు దేశీయంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు అప్రమత్తమయ్యాయి. కొన్ని దేశాలు విదేశీ ప్రయాణాలపై ఇప్పటికే ఆంక్షలు విధించాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 573 పాయింట్ల నష్టంతో 56,534 వద్ద.. నిఫ్టీ 199 పాయింట్ల నష్టంతో 16,826 వద్ద ట్రేడవుతున్నాయి డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.92 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో రిలయన్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ షేర్లు మాత్రమే లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, బజాజ్ ఆటో, ఎంఅండ్‌ఎం షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
► Read latest Business News and Telugu News