ఆర్థిక వ్యవస్థ పురోగతికి ఇబ్బందే

కొవిడ్‌-19 రెండో దశ వ్యాప్తి పరిణామాలు భారత్‌ వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని, వ్యాపారాలకూ అవరోధాలు ఎదురుకావచ్చని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ అభిప్రాయపడింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంపై అనిశ్చితి నెలకొందని తెలిపింది. వీటన్నింటి కారణంగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి తాము అంచనా

Published : 29 Apr 2021 01:14 IST

కొవిడ్‌-19 రెండో దశ వ్యాప్తిపై ఏడీబీ, ఎస్‌అండ్‌పీ

దిల్లీ: కొవిడ్‌-19 రెండో దశ వ్యాప్తి పరిణామాలు భారత్‌ వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని, వ్యాపారాలకూ అవరోధాలు ఎదురుకావచ్చని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ అభిప్రాయపడింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంపై అనిశ్చితి నెలకొందని తెలిపింది. వీటన్నింటి కారణంగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి తాము అంచనా వేసిన 11 శాతం వృద్ధి రేటును సవరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎస్‌అండ్‌పీ వివరించింది. కొవిడ్‌-19 వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తే, వృద్ధి అంచనాలను తగ్గించాల్సి వస్తుందని పేర్కొంది. ఇప్పటికే కొవిడ్‌-19 ముందుతో పోలిస్తే ఉత్పత్తి నష్టాన్ని దేశం ఎదుర్కొంటోందని తెలిపింది. దీర్ఘకాలిక ఉత్పత్తి లోటు జీడీపీలో సుమారు 10 శాతం ఉండొచ్చని పేర్కొంది. కొవిడ్‌-19 రెండో దశలో కేసుల సంఖ్య గణనీయంగా ఉందని, మరణాల రేటు కూడా ఎక్కువగానే ఉందని పేర్కొంది. ఈ పరిణామాలన్నీ వృద్ధి పురోగతికి ముప్పు తెచ్చిపెట్టే అవకాశం ఉందని తెలిపింది.
ఆందోళనకరంగా పరిస్థితులు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021-22) భారత్‌ వృద్ధి రేటు 11 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని ఏడీబీ పేర్కొంది. టీకాలు వేసే కార్యక్రమం వేగవంతంగా అమలవుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకొని పై అంచనాను వెలువరించింది.. అయితే కొవిడ్‌-19 రెండో దశ వ్యాప్తి పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయని పేర్కొంది. కేసుల సంఖ్య సమర్థంగా అదుపులోకి తెస్తేనే పై వృద్ధి రేటు సాధ్యమవుతుందని 2021 సంవత్సరానికి రూపొందించిన ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ అవుట్‌లుక్‌ (ఏడీఓ) నివేదికలో ఏడీబీ వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 7 శాతం వృద్ధి రేటు నమోదుకావచ్చని తెలిపింది. 2019-20లో వృద్ధి రేటు -8 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. మౌలిక సదుపాయాలపై పెట్టుబడుల వ్యయాలు పెంచడం, తయారీకి ప్రోత్సాహకాలు, గ్రామీణ ప్రజల ఆదాయాల వృద్ధికి పథకాలు కొనసాగించడం లాంటివి ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందేందుకు దోహదం చేస్తాయని వెల్లడించింది. 2020-21లో ద్రవ్యోల్బణం 5.2 శాతానికి తగ్గే అవకాశం ఉందని తెలిపింది. కరెంటు ఖాతా లోటు జీడీపీలో 1.1 శాతానికి చేరొచ్చని పేర్కొంది. వచ్చే ఏడాది ఆసియాలోని అభివృద్ధి చెందిన దేశాల్లో చాలా వరకు మెరుగైన వృద్ధి రేటును నమోదు చేసే అవకాశం ఉందని అభిప్రాయపడింది.
పురోగతికి అవరోధం..: ఇక్రా
2021-22 సంవత్సరానికి భారత్‌ వృద్ధి రేటును 10-10.5 శాతంగా రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. కొవిడ్‌-19 వ్యాప్తి పరిణామాలు ఆర్థిక వ్యవస్థ పురోగతికి అవరోధంగా నిలిచే అవకాశం ఉందని, ఇప్పటివరకు ఆయా రాష్ట్రాలు విధించిన లాక్‌డౌన్‌ ఆంక్షలు కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని పేర్కొంది. అయితే విదేశీ కొవిడ్‌-19 టీకాలు సత్వరం అందుబాటులోకి రావడం, టీకా వేసే ప్రక్రియ వేగవంతం అవ్వడం లాంటివి ఆర్థిక వ్యవస్థ వృద్ధికి కొంత ఊతంగా పనిచేస్తాయని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని