ట్రైన్‌ మ్యాన్‌లో 100 శాతం కాదు.. అదానీ వాటా 30 శాతమే

Trainman- Adani: ట్రైన్‌మ్యాన్‌ సంస్థలో అదానీ గ్రూప్‌ 30 శాతం వాటాలు కొనుగోలు చేసింది. రూ.3.56 కోట్లతో వాటాలను పొందింది.

Published : 08 Jul 2023 19:25 IST

దిల్లీ: టికెట్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ట్రైన్‌మ్యాన్‌లో (Train Man) అదానీ గ్రూప్‌నకు (Adani group) చెందిన అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ దాదాపు 30 శాతం వాటాలను కొనుగోలు చేసింది. ట్రైన్‌మ్యాన్‌ మాతృ సంస్థ స్టార్ట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో (SEPL) ఈ వాటాలను రూ.3.56 కోట్లతో కొనుగోలు చేసినట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీకిచ్చిన సమాచారంలో పేర్కొంది. వాస్తవానికి నూరు శాతం వాటాల కొనుగోలుకు ఒప్పందం కుదిరినట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ గత నెల వెల్లడించింది. అప్పట్లో ఎస్‌ఈపీఎల్‌ను ఆన్‌లైన్‌ ట్రైన్‌ బుకింగ్‌, ఇన్ఫర్మేషన్‌ ప్లాట్‌ఫామ్‌గా అదానీ గ్రూప్‌ పేర్కొంది. తాజాగా ఆ సంస్థను ఇ-కామర్స్‌, వెబ్‌సైట్‌ డెవలప్‌మెంట్‌గా పేర్కొనడం గమనార్హం.

ట్రైన్‌మ్యాన్‌లో అదానీ గ్రూప్‌ వాటాల కొనుగోలుపై గత నెల చిన్నపాటి రాజకీయ దుమారం రేగింది. ట్రైన్‌మ్యాన్‌ను అదానీ గ్రూప్‌ టేకోవర్‌ చేస్తోందన్న వార్తలపై కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు గుప్పించింది. భవిష్యత్‌లో ఐఆర్‌సీటీసీని సైతం అదానీ గ్రూప్‌ టేకోవర్‌ చేస్తుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ఆరోపించారు. ఈ ఆరోపణలను ఐఆర్‌సీటీసీ ఖండించింది. ఐఆర్‌సీటీసీ వేదికపై రోజుకు 14.5 లక్షల టికెట్లు బుక్‌ అవుతుంటాయని, అందులో ట్రైన్‌మ్యాన్‌ వాటా కేవలం 0.13 శాతమేనని ఐఆర్‌సీటీసీ పేర్కొంది. ఐఆర్‌సీటీసీకి ఎంతమాత్రం ట్రైన్‌మ్యాన్‌ పోటీ కాదని తెలిపింది. 2011లో వినీత్‌ చరాణియా, కరణ్‌ కుమార్‌ ట్రైన్‌మ్యాన్‌ను స్థాపించారు. టికెట్లను బుక్‌ చేయడంతో పాటు పీఎన్‌ఆర్‌ స్టేటస్‌, కన్ఫామ్‌ అయ్యే ఛాన్స్‌, సీట్ల అందుబాటు, కోచ్‌ పొజిషన్‌ వంటి సేవలను ఈ సంస్థ అందిస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎస్‌ఈపీఎల్‌ టర్నోవర్ రూ.4.51 కోట్లుగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని