క్రెడిట్‌ స్కోరు.. ఈ అపోహలు వీడాలి

ఒక వ్యక్తి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు క్రెడిట్‌ స్కోరు ఉపయోగపడుతుంది. రుణాలు తీసుకున్నప్పుడు వాయిదాలను, క్రెడిట్‌ కార్డును వాడినప్పుడు బిల్లులనూ సకాలంలో చెల్లించేయాలి.

Published : 07 Jul 2023 00:10 IST

ఒక వ్యక్తి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు క్రెడిట్‌ స్కోరు ఉపయోగపడుతుంది. రుణాలు తీసుకున్నప్పుడు వాయిదాలను, క్రెడిట్‌ కార్డును వాడినప్పుడు బిల్లులనూ సకాలంలో చెల్లించేయాలి. అప్పుడే ఒక క్రెడిట్‌ స్కోరు మంచి స్థాయికి చేరుతుంది. చాలామంది ఈ విషయం గురించి ఆలోచించరు. క్రెడిట్‌ స్కోరు, రుణ చరిత్ర చుట్టూ ఎన్నో సందేహాలు, అపోహలతో ఉంటారు. అందులో వాస్తవాలేమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

తీసుకున్న రుణాన్ని చెల్లించడంలో ఎంత క్రమశిక్షణతో ఉన్నారు? క్రెడిట్‌ స్కోరు తెలియజేసే ప్రాథమిక విషయం ఇదే. రుణదాతలు ప్రతి రుణగ్రహీతకు సంబంధించిన సమాచారాన్ని క్రెడిట్‌ బ్యూరోలకు చేరవేస్తుంటారు. వారు ప్రతి విషయాన్నీ రుణ చరిత్రలో నమోదు చేస్తుంటారు. కొత్తగా రుణం కావాలని దరఖాస్తు చేసినప్పుడు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మీ గురించి ఒక్క క్లిక్‌లో తెలుసుకునే వీలుంటుంది. మీకు రుణం ఇవ్వాలా? వద్దా? అనే నిర్ణయం సగం ఇక్కడే పూర్తవుతుంది. క్రెడిట్‌ స్కోరు గురించి మరిన్ని వివరాలను పరిశీలిస్తే..

తనిఖీ చేసుకుంటే..

మీరు తరచూ క్రెడిట్‌ స్కోరును తెలుసుకోవచ్చు. దీనివల్ల మీ స్కోరు, రుణ చరిత్రపై ఎలాంటి ప్రభావం ఉండదు. సిబిల్‌ వంటి ఏదైనా క్రెడిట్‌ బ్యూరో నుంచి ఏడాదికోసారి ఉచితంగా పూర్తి నివేదికను పొందవచ్చు. ఇప్పుడు చాలా ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంల నుంచి అపరిమిత ఉచిత నివేదికలనూ తీసుకునే వీలుంది. ఇలా చేయడం వల్ల మీ స్కోరుకు ఎలాంటి హానీ ఉండదు. కానీ, రుణదాత మీ క్రెడిట్‌ స్కోరును తనిఖీ చేసినప్పుడు స్కోరు స్వల్పంగా తగ్గుతుంది. మీరు రుణం కోసం విచారణ చేసినట్లు నమోదవుతుంది. కాబట్టి, కొత్తగా రుణం తీసుకునేటప్పుడు ముందుగా మీరే సొంతంగా క్రెడిట్‌ నివేదికను పరిశీలించడం మేలు.

ఆదాయం తక్కువగా ఉంటే..

క్రెడిట్‌ స్కోరుకూ ఆదాయానికీ అసలు సంబంధం లేదు. మీ క్రెడిట్‌ స్కోరుపై ఇది ఏమాత్రం ప్రభావం చూపదు. గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మీరు తీసుకున్న రుణాన్ని ఎలా చెల్లిస్తున్నారు అనేదే ఇక్కడ ప్రధానం. మీకు ఎంత ఆదాయం వస్తుందన్నది పట్టించుకోదు. సకాలంలో చెల్లింపులు ఉంటే.. స్కోరు బాగుంటుంది.

కుటుంబ సభ్యుల ప్రభావం..

పాన్‌ ఆధారంగా ఒక వ్యక్తి క్రెడిట్‌ స్కోరును గణిస్తారు. కాబట్టి, వ్యక్తిగతంగా మాత్రమే స్కోరు ఉంటుంది. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లల స్కోరులు మీ క్రెడిట్‌ స్కోరుపై నేరుగా ప్రభావం చూపవు. వారు తీసుకున్న రుణాలకు చెల్లింపులు బాగున్నా, లేకున్నా మీకు సంబంధం ఉండదు. కాకపోతే ఆ రుణాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మీకు సంబంధం ఉండకూడదు.

హామీ ఇస్తే...

వేరొకరి రుణానికి హామీ ఉన్నా, సహ దరఖాస్తుగా ఉన్నా మీరూ రుణం తీసుకున్నట్లే. ఆ రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన బాధ్యతను మీరు పంచుకున్నట్లే. వాస్తవంగా రుణం తీసుకున్న వ్యక్తి వాయిదాల చెల్లింపులను సరిగ్గా చేయకపోతే.. ఆ బాధ్యత మీపై పడుతుంది. మీరూ బాకీలను చెల్లించడంలో విఫలమైతే క్రెడిట్‌ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి, హామీ ఇచ్చేటప్పుడు, సహ దరఖాస్తుగా ఉన్నప్పుడు కలిగే ఇబ్బందులనూ దృష్టిలో పెట్టుకొని, నిర్ణయం తీసుకోవాలి.

అప్పు తీసుకోకపోతే..

అప్పు చేయకుంటే ఏ ఇబ్బందులూ రావు కదా అని అనుకోవచ్చు. నిజమే. మీకు అప్పు తీసుకోవాల్సిన అవసరం రాకపోవడం మంచి విషయమే. కానీ, జీవితంలో వివిధ లక్ష్యాల సాధనలో రుణాల అవసరం తప్పకపోవచ్చు. ఇల్లు, వాహనం కొనుగోలు, పిల్లల కోసం విద్యా రుణంలాంటివి ఇందులో ఉంటాయి. మంచి క్రెడిట్‌ స్కోరు 750 మించి ఉంటే.. వడ్డీ రేట్లలో రాయితీలూ పొందే అవకాశం ఉంటుంది. స్కోరు లేకుంటే అధిక రేట్లను చెల్లించాల్సి రావచ్చు.

రుణాలు లేకున్నా..

చాలామంది రుణం తీసుకోకపోతే ఎలాంటి క్రెడిట్‌ స్కోరూ ఉండదు. కాబట్టి, రుణ నివేదికను గమనించాల్సిన అవసరం లేదు అనుకుంటారు. గత ఏడాది ఎంతోమంది అనధికార రుణ మోసాల బారిన పడిన సంగతి మనం చూశాం. ఎంతోమంది క్రెడిట్‌ స్కోర్లు దీనివల్ల దెబ్బతిన్నాయి. కాబట్టి, మీకు రుణం లేకపోయినా.. కనీసం ఏడాదికోసారి క్రెడిట్‌ నివేదికను పరిశీలించడం మంచి అలవాటు.


శాశ్వతం కాదు...

మంచి లేదా చెడు.. క్రెడిట్‌ స్కోరు ఏదైనా అదే శాశ్వతంగా ఉండదు. ఒక నెల ఆలస్యంగా చెల్లించిన క్రెడిట్‌ కార్డు బిల్లు స్కోరులో 100 పాయింట్లను తగ్గించగలదు. కోల్పోయిన ఈ పాయింట్లను పొందేందుకు కొన్ని నెలలు పట్టొచ్చు. ఈ కాలంలో మీరు రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే.. తిరస్కరణ ఎదురు కావచ్చు. లేదా అధిక వడ్డీ రేటు చెల్లించాల్సి వస్తుంది. సకాలంలో చెల్లించడం చాలా కీలకమైన అంశం. దీన్ని సాధన చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని