Alphabet: అంచనాలు అందుకోని గూగుల్‌.. Q4 నియమాకాల్లో కోత!

గూగుల్‌ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌ (Alphabet Inc) త్రైమాసిక ఫలితాల్లో నిరాశ పరిచింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో మార్కెట్‌ అంచనాలను అందుకోలేకపోయింది.

Updated : 26 Oct 2022 16:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గూగుల్‌ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌ (Alphabet Inc) త్రైమాసిక ఫలితాల్లో నిరాశ పరిచింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో మార్కెట్‌ అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో అమెరికా స్టాక్‌ మార్కెట్లో కంపెనీ షేర్లు క్షీణించాయి. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఆల్ఫాబెట్‌ వ్యయాలను తగ్గించుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో నియామకాల్లో కోత పెట్టాలని నిర్ణయించింది.

ప్రపంచవ్యాప్తంగా మాంద్యం భయాలు అలముకొన్న వేళ ప్రజలు ఖర్చులకు వెనకాడే పరిస్థితి ఉన్నందు వల్ల ఆన్‌లైన్‌ ప్రకటనల మార్కెట్‌పై ప్రభావం పడింది. దీంతో ఆల్ఫాబెట్‌  ప్రకటనల ఆదాయంలో వృద్ధి అంతంత మాత్రంగానే నమోదైంది. గతేడాది ప్రకటనల ద్వారా 53.13 బిలియన్‌ డాలర్లు ఆర్జించిన ఆ కంపెనీ.. ఈ ఏడాది స్వల్ప వృద్ధితో 54.48 బిలియన్లు మాత్రమే ఆర్జించింది. అలాగే కంపెనీ మొత్తం ఆదాయం 69.09 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. గతేడాది మూడో త్రైమాసికంలో 65.12 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అనలిస్టులు 70 బిలియన్‌ డాలర్ల మేర ఆదాయాన్ని అంచనా వేయగా.. అంతకంటే తక్కువగా ఆదాయాలను ఆల్ఫాబెట్‌ ప్రకటించింది. ముఖ్యంగా వీడియో ప్లాట్‌ఫాం యూట్యూబ్‌ ఆదాయం 7.42 బిలియన్‌ డాలర్లు అంచనా వేయగా.. 7.07 బిలియన్‌ డాలర్లు మాత్రమే వచ్చినట్లు ప్రకటించింది. వాస్తవానికి గతేడాది కంటే యూట్యూబ్‌ ఆదాయం 2 శాతం మేర తగ్గడం గమనార్హం. దీంతో కంపెనీ షేరు విలువ 6 శాతం మేర క్షీణించింది.

నియామకాల్లో కోత

మూడో త్రైమాసికంలో ఆశించిన మేర ఫలితాలు ప్రకటించలేకపోవడంతో వ్యయాలు తగ్గించుకునే పనిలో పడింది ఆల్ఫాబెట్‌. ముఖ్యంగా ప్రకటనల ఆదాయంలో క్షీణత నేపథ్యంలో రాబోయే త్రైమాసికంతో పాటు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో నియామకాల్లో వేగం తగ్గించాలని ఆల్ఫాబెట్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ నిర్ణయించారు. వృద్ధికి అవకాశం ఉన్న చోట మాత్రమే వనరులు వినియోగించాలని నిర్ణయించినట్లు కంపెనీ సమావేశంలో చెప్పారు. 

క్యూ3లో 12,765 మందిని నియమించుకోవడం ద్వారా మొత్తం ఉద్యోగుల సంఖ్యను 1,86,779కి పెంచుకున్న గూగుల్‌.. క్యూ4లో నియామకాల సంఖ్యను భారీగా కుదించాలని నిర్ణయించింది. క్యూ3లో నియామకాల సంఖ్యలో దాదాపు సగం మాత్రమే చేపట్టాలని నిర్ణయించినట్లు ఆల్ఫాబెట్‌ సీఎఫ్‌ఓ రుత్‌ పోరాట్‌ తెలిపారు. అయితే, క్రిటికల్‌ రోల్స్‌తో పాటు, దృష్టి కేంద్రీకరించిన విభాగాల్లో నియామకాలు కొనసాగుతాయని తెలిపారు. అలాగే వ్యయాలు తగ్గించుకోవడంలో భాగంగా గూగుల్‌ తన తదుపరి తరం పిక్సల్‌ బుక్‌ ల్యాప్‌ట్యాప్‌ ప్రణాళికను రద్దు చేసింది. ‘ఏరియా  120’ పేరిట గూగుల్‌ ఏర్పాటు చేసిన స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌కు ఇచ్చే నిధుల్లో కోత పెట్టింది. ఇప్పటికే డిజిటల్‌ గేమింగ్‌ సర్వీస్‌ స్టడియాను మూసివేస్తున్నట్లు గూగుల్‌ ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని