Sundar Pichai: గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ పొద్దున్నే ఏం చదువుతారో తెలుసా?

Sundar Pichai: సుందర్‌ పిచాయ్‌ లాంటి ఉన్నత స్థానంలోని వ్యక్తి ఏ వార్తాపత్రికో లేక పుస్తకంతోనో వారి రోజుని ప్రారంభిస్తారని అనుకుంటాం. కానీ, పొద్దున్న లేవగానే ఆయన ఓ వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేస్తారట. అదేంటి? దాన్నే ఎందుకు చూస్తారో తెలుసుకుందాం!

Updated : 13 Feb 2024 09:38 IST

వాషింగ్టన్‌: గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ (Sundar Pichai) తన రోజును చదవడంతో ప్రారంభిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్‌ సంస్థకు నాయకుడిగా, జీవితంలో విజయవంతమైన వ్యక్తిగా ఆయనకు ఈ అలవాటు ఉండడం మనకు సాధారణ విషయంగానే అనిపించొచ్చు. అయితే, పొద్దున్న లేవగానే ఆయన ఏ వార్తాపత్రికనో.. పుస్తకమో చదువుతారని అనుకుంటాం. కానీ, టెక్‌ వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేసి అప్‌డేట్లు తెలుసుకుంటారట.

వైర్డ్‌ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ సుందర్‌ పిచాయ్‌ (Sundar Pichai) ఈ విషయాన్ని పంచుకున్నారు. ఇప్పటికీ ‘వెబ్‌’ అంటే తనకు అమితమైన ఆసక్తి అని వెల్లడించారు. పొద్దున్న లేవగానే ‘టెక్‌మీమ్‌’ అనే వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేస్తానని చెప్పారు. దీంట్లో ప్రపంచవ్యాప్తంగా టెక్‌ పరిశ్రమలో చోటుచేసుకుంటున్న తాజా సమాచారాన్ని హెడ్‌లైన్ల రూపంలో ఒక దగ్గరకు చేర్చి అందుబాటులో ఉంచుతారు. దీన్ని ఫాలో అవుతుంటామని మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌, మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల, ఇన్‌స్టాగ్రామ్‌ హెడ్‌ ఆడమ్‌ మొస్సేరీ గతంలో వెల్లడించారు.

టెక్‌మీమ్‌ను 2005లో గేబ్ రివేరా స్థాపించారు. ఇది టెక్‌ ప్రపంచంలోని అప్‌డేట్ల సారాంశాలు, అసలు కథనాల లింక్‌లను సేకరిస్తుంది. ఆయా సమాచారానికి ఉన్న ప్రాముఖ్యతను బట్టి వాటిని ఒక వరుస క్రమంలో ఉంచుతుంది. పైగా సందర్భం, పరిశ్రమలో దాని వినియోగంతో కూడిన వివరాలనూ అందిస్తుంది. ఇలా పరిశ్రమలో చోటుచేసుకుంటున్న అభివృద్ధిని రోజూ సమగ్రంగా మన ముందుంచుతుంది. టెక్‌ రంగంపై ఆసక్తి ఉన్నవారికి ఇది ఒక ప్రాధాన్య వెబ్‌సైట్‌ అని చెప్పొచ్చు.

గూగుల్‌ కొత్త ఏఐ మోడల్‌ జెమినీ..

వెబ్‌సెర్చ్‌ విధానం క్రమంగా మారిపోతోందని పిచాయ్‌ (Sundar Pichai) వైర్డ్‌తో అన్నారు. భవిష్యత్‌ కోసం దీన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనిలో భాగంగానే తాము జెమినీ (Gemini AI Model) అనే కృత్రిమ మేధ చాట్‌బాట్‌ను తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే తీసుకొచ్చిన బార్డ్‌ పేరును మార్చి దీన్ని అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. ఇది త్వరలో ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ మొబైళ్లలో యాప్‌ల రూపంలోనూ రానుందన్నారు. ఓపెన్‌ ఏఐ తీసుకొచ్చిన చాట్‌జీపీటీ, మైక్రోసాఫ్ట్‌ కోపైలట్‌ ఏఐ మోడళ్లకు పోటీగా గూగుల్‌ దీన్ని తీసుకొస్తోంది.

ఇతర కంపెనీల ఏఐ అసిస్టెంట్లతో పోలిస్తే జెమినీ (Gemini AI Model) భిన్నమైందని పిచాయ్‌ వివరించారు. తమ మోడల్‌కు కేవలం టెక్ట్స్‌లో మాత్రమే కాకుండా ఫొటోలు, ఆడియో, వీడియో, కోడ్‌.. ఇలా వివిధ రకాల డేటా ఫార్మాట్లతో శిక్షణనిచ్చినట్లు తెలిపారు. దీనివల్ల ఫొటో, వాయిస్‌, టెక్ట్స్‌ ఏ రూపంలో ఆదేశాలిచ్చినా స్పందిస్తుందని వివరించారు. నిజానికి ఇలాంటి సాంకేతికతను గూగుల్‌కు అనుసంధానించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామన్నారు. అందులో భాగంగానే గూగుల్‌ లెన్స్‌ వంటి ఫీచర్లు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. జెమినీతో తమ లక్ష్యం పూర్తి స్థాయిలో నెరవేరబోతోందన్నారు. అయితే, వీటన్నింటికీ ‘వెబ్’ సాంకేతికతే ఆధారమని.. అందుకే ఇప్పటికీ తనకు దానిపై అమితమైన ఆసక్తి అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని