Hurun Rich List: భారత్‌లో అంబానీయే అత్యంత ధనవంతుడు

Hurun Rich List: ‘‘360 వన్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2023’’ను హురున్‌ విడుదల చేసింది. ఈ జాబితాలో గౌతమ్‌ అదానీని దాటేసి ముకేశ్‌ అంబానీ తొలిస్థానంలో నిలిచారు.

Published : 10 Oct 2023 18:26 IST

ముంబయి: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) భారత్‌లో మళ్లీ అత్యంత ధనవంతుడిగా నిలిచారు. హురున్‌ (Hurun) విడుదల చేసిన తాజా కుబేరుల జాబితాలో అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీని దాటేసి అంబానీ ఈ స్థానానికి చేరారు. ఈ ఏడాది ముకేశ్‌ సంపద రెండు శాతం పెరిగి రూ.8.08 లక్షల కోట్లకు చేరినట్లు ‘‘360 వన్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2023’’ (360 ONE Wealth Hurun India Rich List 2023) పేర్కొంది. అదే సమయంలో అదానీ సంపద 57 శాతం తరిగి రూ.4.74 లక్షల కోట్లకు కుంగినట్లు వెల్లడించింది.

అమెరికా షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ (Hindenburg) ఈ ఏడాది జనవరిలో అదానీ గ్రూప్‌ (Adani Group)పై విడుదల చేసిన నివేదిక కారణంగానే గౌతమ్‌ అదానీ సంపద తగ్గినట్లు హురున్‌ ఎండీ, ప్రధాన పరిశోధకుడు అనస్‌ రెహ్మాన్‌ జునైద్‌ తెలిపారు. తమ నమోదిత సంస్థల షేర్ల ధరలను పెంచడం కోసం అదానీ గ్రూప్‌ అవకతవకలకు పాల్పడినట్లు హిండెన్‌బర్గ్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. వీటిని ఆ సంస్థ తీవ్రంగా ఖండించినప్పటికీ.. గ్రూప్‌ కంపెనీల షేర్లు భారీ దిద్దుబాటుకు గురయ్యాయి. దీంతో గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని ప్రమోటర్‌ ఫ్యామిలీ సంపద సైతం కుంగింది.

ఆగస్టు 30 నాటి సంపద ఆధారంగా దేశవ్యాప్తంగా 1,319 మందితో కూడిన ధనవంతుల జాబితాను హురున్‌ విడుదల చేసింది. సీరం ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సైరస్‌ పూనావాలా దేశంలో మూడో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. క్రితం ఏడాదితో పోలిస్తే ఆయన సంపద 36 శాతం పెరిగి రూ.2.78 లక్షల కోట్లకు చేరింది. తర్వాత హెచ్‌సీఎల్‌ టెక్‌కు చెందిన శివ్‌ నాడార్‌ నాలుగో స్థానంలో ఉన్నారు. ఆయన సంపద 23 శాతం ఎగబాకి రూ.2.28 లక్షల కోట్లకు పెరిగింది. గోపిచంద్‌ హిందుజా, దిలీప్‌ సంఘ్వీ, లక్ష్మీ నివాస్‌ మిత్తల్‌, రాధాకృష్ణన్‌ దమానీ, కుమార్‌ మంగళం బిర్లా, నీరజ్ బజాజ్‌ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. డిమార్ట్‌కు చెందిన రాధాకృష్ణ దమానీ సంపద మాత్రం 18 శాతం తగ్గి రూ.1.43 లక్షల కోట్లకు చేరింది. దీంతో ఆయన జాబితాలో క్రితం ఏడాదితో పోలిస్తే మూడు స్థానాలు కిందకు వచ్చి ఎనిమిదో ర్యాంకులో నిలిచారు.

నైకాకు చెందిన ఫల్గుణి నాయర్‌ను దాటేసి జోహో కంపెనీ రాధా వెంబు దేశంలో అత్యంత ధనవంతురాలిగా నిలిచారు. జెప్టోకు చెందిన కైవల్య వోరా ఈ జాబితాలో అత్యంత పిన్న వయస్కుడు. 94 ఏళ్ల వయసులో ప్రెసిషన్‌ వైర్స్‌ ఇండియాకు చెందిన మహేంద్ర రతిలాల్‌ మెహతా హురున్ ధనవంతుల జాబితాలో తొలిసారి చోటు దక్కించుకున్నారు. భారత్‌లో గత ఏడాది వ్యవధిలో ప్రతి మూడు వారాలకు ఇద్దరు బిలియనీర్లు పుట్టుకొచ్చారు. ప్రస్తుతం దేశంలో 259 మంది బిలియనీర్లు ఉన్నారు. గత 12 ఏళ్లలో ఈ సంఖ్య 4.4 రెట్లు పెరిగింది. జాబితాలో ఉన్నవారిలో 51 మంది సంపద వార్షిక ప్రాతిపదికన రెండింతలు పెరిగింది. క్రితం ఏడాది ఈ సంఖ్య 24గా ఉంది.

అత్యధికంగా ముంబయి నుంచి హురున్‌ ధనవంతుల జాబితాలో 328 మంది చోటు దక్కించుకున్నారు. తర్వాత దిల్లీ 199, బెంగళూరు 100 మందితో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తొలిసారి తిరుప్పూర్ అత్యధిక సంఖ్యలో ధనవంతులను అందించిన మొదటి 20 నగరాల జాబితాలో చేరింది. కెదారా క్యాపిటల్‌కు చెందిన మనీశ్‌ కేజ్రీవాల్‌ ప్రైవేట్‌ ఈక్విటీ రంగం నుంచి ధనవంతుల లిస్ట్‌లో చేరిన తొలి వ్యక్తిగా నిలిచారు. ఆయన సంపద విలువ రూ.3,000 కోట్లు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని