ఈ బుడ్డోడి మాటలు వింటే మా కంపెనీ దివాలా తీయాల్సిందే: ఆనంద్‌ మహీంద్రా

Anand Mahindra: ఇన్‌స్టాలో ఓ బుడ్డోడు చెప్పిన సరదా మాటలు ఆనంద్‌ మహీంద్రా దృష్టిని ఆకర్షించాయి. అయితే, ఆ చిన్నోడు చెప్పినట్లు చేస్తే కంపెనీ దివాలా తీస్తుందని మహీంద్రా పేర్కొన్నారు.

Updated : 10 Feb 2024 11:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిన్న పిల్లలు చేసే పనులు ఒక్కోసారి ముచ్చటేస్తుంటాయి. వారు మాట్లాడే మాటలు ముద్దొస్తుంటాయి. తాజాగా నోరు కూడా సరిగా తిరగని ఓ బుడతడి మాటలు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రాను (Anand Mahindra) ఆకర్షించాయి. పైగా ఆ చిన్నోడు చెప్పినట్లు చేస్తే తమ కంపెనీ దివాలా తీస్తుందని కూడా చెప్పారు. వివరాల్లోకి వెళితే..

చీకూ అనే  చిన్నారి చెప్పిన ముద్దు ముద్దు మాటలు తన స్నేహితుడికి నచ్చాయని.. వాటిని తనతో షేర్‌ చేసుకున్నట్లు ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) తెలిపారు. అతడి మాటలు విన్న తర్వాత ఇన్‌స్టాలో మరికొన్ని వీడియోలూ వీక్షించానని వెల్లడించారు. స్నేహితుడితో పాటు తానూ ఇప్పుడు ఆ బుడ్డోడిని ఇష్టపడుతున్నాని తెలిపారు. వీడియోలో చీకూ తన తండ్రితో మాట్లాడుతూ.. మహీంద్రా థార్‌ను కొంత మంది థార్‌గా వ్యవహరిస్తుంటారని చెబుతున్నాడు. అయితే, థార్‌లో ఎక్స్‌యూవీ700 (XUV700) ఒక మోడల్‌ అని తెలిపాడు. ఎక్స్‌యూవీ700ని అతడు థార్‌గా పొరబడ్డాడు. రెండూ ఒకటే అంటూ దాన్ని కొందామని తండ్రిని అడుగుతున్నాడు. ఎక్స్‌యూవీ700లో 700 ఉంది గనక దాని ధర రూ.700 అని అనుకున్నాడు. పర్స్‌లో రూ.700 ఉన్నాయని.. ఆ డబ్బుతో బయటికెళ్లినప్పుడు కొనేద్దామని తండ్రితో చర్చిస్తున్నాడు. అయితే, ఆ బుడ్డోడు మాట్లాడిన తీరు మాత్రం అందరికీ నవ్వు తెప్పిస్తోంది. పైగా అతడి మాటల్లోని అమాయకత్వం ముచ్చటగొల్పుతోంది.

ఆనంద్‌ మహీంద్రా దీనిపై స్పందిస్తూ.. చీకూకు చెందిన కొన్ని వీడియోలు చూసిన తర్వాత తానూ అతణ్ని ఇష్టపడడం మొదలుపెట్టానని తెలిపారు. అయితే, వీడియోలో అతడు చెప్పినట్లు థార్‌ను రూ.700 అమ్మితే త్వరలోనే తమ కంపెనీ దివాలా తీస్తుందని సరదాగా వ్యాఖ్యానించారు. నెటిజన్లూ బుడ్డోడి మాటలకు ఫిదా అయిపోయి తెగ కామెంట్లు చేస్తున్నారు. ఎక్స్‌యూవీ700 ధర రూ.17 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా.. థార్‌ రూ.10,98,000 నుంచి లభిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని