scam: ఓటీపీ లేకుండానే దోచేస్తున్నారు.. ఇలా జాగ్రత్త పడండి

Bank OTP bypass scam: డిజిటల్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థపై ఎక్కువగా ఆధారపడిన ఖాతాదారులు కొత్తతరహా బ్యాంకింగ్‌ మోసాల గురించి అప్రమత్తంగా ఉండాలి. 

Published : 13 Oct 2023 21:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సైబర్‌ నేరగాళ్లు బ్యాంక్ ఖాతాలోని డబ్బు కాజేయాలంటే ఓటీపీ తప్పనిసరి. గతంలో ఖాతాదారులను మాటలతో మభ్యపెట్టి ఓటీపీ రాబట్టి డబ్బు దోచేవారు. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. ఓటీపీతో పనిలేకుండానే డబ్బు కాజేసే కొత్త పంథాను అనుసరిస్తున్నారు. ఓటీపీ లేకుండానే ( OTP bypass scam) ఖాతాలోని డబ్బును ఎగరేసుకుపోతున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా నేరాలు అధికంగా చోటు చేసుకుంటున్నాయి. డిజిటల్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థపై ఎక్కువగా ఆధారపడుతున్నందున ఈ తరహా మోసాల గురించి ఖాతాదారులకు అవగాహన ఉండాలి. లేకపోతే చిన్న పొరపాటు వల్ల సైబర్‌ వలలో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ నియమాలు పాటించి సైబర్‌ మోసాల బారిన పడకుండా జాగ్రత్త పడండి.

  • ఎస్‌ఎంఎస్‌లు, ఈ-మెయిల్స్‌ పట్ల జాగ్రత్త వహించండి. తెలియని వ్యక్తుల నుంచి ఎలాంటి లింక్‌లు వచ్చినా వాటిపై క్లిక్‌ చేయకండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ అటాచ్‌మెంట్‌లను డౌన్‌లోడ్‌ చేయెద్దు. బ్యాంక్‌ల నుంచి వచ్చిన సందేశాల్లో ఏమైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే సదరు బ్యాంక్‌ అధికారిని సంప్రదించి వివరణ అడగండి.
  • బ్యాంక్‌ యాప్‌లను అధికారిక యాప్‌ స్టోర్‌ల నుంచి మాత్రమే డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. మెరుగైన భద్రతా ఫీచర్‌లను పొందేందుకు బ్యాంకింగ్ యాప్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవటం ముఖ్యం.
  • సైబర్‌ సెక్యూరిటీ బెదిరింపులు, స్కామ్‌ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. అంతే కాదు సైబర్‌ సంస్థల అధికారులు చేసే సూచనలు, మార్గదర్శకాలను పాటించాలి.
  • బ్యాంక్‌ ఖాతాలకు టూ-స్టెప్‌ అథెంటికేషన్‌ (2FA)ని ఎనేబుల్‌ చేసుకోవాలి. మీ ఖాతాకు మరింత భద్రత కల్పించడానికి ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది.
  • అనుమానాస్పదంగా వచ్చే కాల్స్‌ పట్ల జాగ్రత్తగా ఉండండి. బ్యాంక్‌ సంబంధిత వ్యక్తుల మంటూ వ్యక్తిగత సమాచారం, ఖాతా వివరాలు, ఓటీపీ గురించి అడిగితే ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ సమాచారం పంచుకోకండి. బ్యాంక్‌ అధికారిక కస్టమర్‌ సర్వీస్‌ నంబర్‌కు కాల్‌ చేసి ఆ కాల్‌ బ్యాంక్‌ నుంచే వచ్చిందా? లేదా? అని నిర్ధారించుకోండి.
  • సురక్షితమైన వైఫై నెట్‌వర్క్‌లను మాత్రమే ఉపయోగించడం మంచిది. పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లలో ఆర్థిక లావాదేవీలను నిర్వహించకపోవడం ఉత్తమం.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని