Bill Gates: ఆ స్థాయిని నేను ఎప్పటికీ అందుకోలేను: బిల్‌ గేట్స్‌

స్టీవ్‌ జాబ్స్‌లా బహిరంగ సమావేశాల్లో సహజంగా వ్యవహరించలేనని మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ తెలిపారు.

Updated : 18 Mar 2024 12:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యాపిల్‌ (Apple) సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో స్టీవ్‌ జాబ్స్‌ (Steve Jobs) గురించి టెక్‌ ప్రపంచంలో తెలియని వారు ఉండరు. కంపెనీ సమావేశాలైనా, కొత్త ఉత్పత్తుల విడుదలైనా ఆయన ప్రసంగం, వ్యవహారశైలితో ఎదుటివారిని ఆకట్టుకునేవారు. తాజాగా ఇదే విషయాన్ని మైక్రోసాఫ్ట్‌ (Microsoft) వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ (Bill Gates) వెల్లడించారు. బహిరంగ వేదికలపై స్టీవ్‌ జాబ్స్‌లా నేను వ్యవహరించలేను. ఆయన చాలా సహజంగా ప్రవర్తిస్తూ ఎదుటి వారిని తన మాటలతో కట్టిపడేస్తారని ఓ పాడ్‌కాస్ట్‌లో పేర్కొన్నారు. 

‘‘స్టీవ్‌ జాబ్స్‌ చాలా సహజంగా ఉంటారు. స్టేజ్‌పై మాట్లాడటానికి ముందు ఆయన రిహార్సల్స్‌ చూడటం ఎంతో సరదాగా ఉంటుంది. కొన్నిసార్లు వేదికపై మాట్లాడుతుంటే అప్పటికప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తుంది. ఆ స్థాయిని నేను ఎప్పటికీ అందుకోలేను’’ అని బిల్‌గేట్స్‌ తెలిపారు. మైక్రోసాఫ్ట్‌ ప్రారంభించిన తొలి నాళ్లలో ఉత్పత్తుల గురించి వివిధ రకాల వ్యక్తులకు వివరించడమే కీలక ప్రక్రియగా భావించినట్లు ఆయన చెప్పారు. విద్య, వైద్యం, ఏఐకి సంబంధించి మైక్రోసాఫ్ట్ ఉత్పత్తుల గురించి అభిప్రాయ సేకరణ కోసం ఇప్పటికీ స్టీవ్‌ జాబ్స్‌ అనుసరించే కమ్యూనికేషన్‌ విధానాన్ని పాటిస్తున్నట్లు బిల్‌ గేట్స్‌ వెల్లడించారు. 

కంపెనీకి సంబంధించి నూతన ఉత్పత్తుల విడుదలతో పాటు, ఇతర సమావేశాల్లో ప్రసంగించేందుకు స్టీవ్‌ చాలా రోజుల ముందు నుంచి సిద్ధమయ్యేవారట. ఈ విషయాన్ని 2015లో విడుదలైన ‘బికమింగ్‌ స్టీవ్‌ జాబ్స్‌’ అనే పుస్తకంలో రచయితలు బ్రెంట్‌ ష్లెండర్‌, రిక్‌ టెట్‌జెలీలు వెల్లడించారు. ‘‘మేము ఒక సారి రోజంతా స్టీవ్ జాబ్స్‌తో ఉన్నాం. చిన్న ప్రజెంటేషన్‌ కోసం ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. స్లైడ్స్‌కు ఎలాంటి రంగులు వాడాలి? స్టేజ్‌పై తన వ్యవహారశైలి ఎలా ఉండాలి? ఎక్కడ స్పాట్‌ లైట్‌ పడాలి? ఇలా ప్రతి విషయంలో ఎంతో ప్రణాళికతో వ్యవహరించేవారు. ఒకసారి ఆయన వేదికపై ప్రసంగిస్తుండగా.. లైటింగ్‌లో సమస్య తలెత్తింది. ఆ సమయంలో ఆయన తన కోపాన్ని ఏ మాత్రం బయటికి వ్యక్తపరచకుండా స్టేజ్‌పై కుర్చీలో కొద్దిసేపు మౌనంగా కూర్చుండిపోయారు. కోపం తగ్గిన తర్వాత ప్రసంగం కొనసాగించారు’’అని రచయితలు వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు