Stellantis: ‘పాశ్చాత్య దేశాలతో చైనా కయ్యం.. భారత్‌కు ఓ గొప్ప అవకాశం’

చైనా, పాశ్చాత్య దేశాల మధ్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇది భారత్‌కు ఓ గొప్ప అవకాశమని స్టెలాంటిస్‌ సీఈఓ అన్నారు.

Published : 24 Nov 2022 21:43 IST

దిల్లీ: చైనా, పాశ్చాత్య దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు భారత్‌కు ఓ గొప్ప అవకాశమని ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద వాహన తయారీ సంస్థ స్టెలాంటిస్‌ సీఈఓ కార్లోస్‌ తెవారిస్‌ అన్నారు. 2023లో యావత్తు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించినా.. భారత్‌ మాత్రం 6-7 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని అంచనా వేశారు.

చైనాలోని తమ జాయింట్‌ వెంచర్‌ ‘గువాంగ్జౌ ఆటోమొబైల్‌ గ్రూప్‌ (GAC)’ దివాలా ప్రక్రియకు వెళ్లనున్న తరుణంలో కార్లోస్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వాస్తవానికి జీఏసీలో తమ వాటాను 50 శాతం నుంచి 75 శాతానికి పెంచుకోవాలని ఈ ఏడాది జులైలో స్టెలాంటిస్‌ నిర్ణయించింది. కానీ, అర్ధాంతరంగా ఆ నిర్ణయాన్ని విరమించుకొని ఏకంగా భాగస్వామ్యాన్నే రద్దు చేసుకోనున్నట్లు ప్రకటించింది. తమ వ్యాపారంలో రాజకీయ జోక్యం ఎక్కువైన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.

ప్రపంచ దేశాల మధ్య చీలికలు వస్తున్నాయని.. చైనా, పాశ్చాత్య దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలే అందుకు నిదర్శనమన్నారు. ఇది కచ్చితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందన్నారు. అయితే, దీన్ని అవకాశంగా మార్చుకునే సత్తా భారత్‌కు ఉందని తెలిపారు. విడిభాగాలను సమకూర్చుకోవడం దగ్గరి నుంచి సాంకేతికత అభివృద్ధి వరకు భారత్‌కు కావాల్సిన సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. భారత్‌లో ఉండడం తాము గొప్పగా భావిస్తున్నామని తెలిపారు.

2021, 2022 వాహన తయారీ సంస్థలకు కలిసొచ్చిందని కార్లోస్‌ తెలిపారు. 2023లో మాత్రం సవాళ్లు తప్పవని పేర్కొన్నారు. మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఏడాది నెమ్మదిస్తుందని వివరించారు. ఈ ప్రభావం దాదాపు అన్ని రంగాలపై ఉంటుందన్నారు. కానీ, భారత్‌ పరిస్థితి మాత్రం 6-7 శాతం వృద్ధితో మెరుగైన స్థానంలో ఉంటుందన్నారు. అమెరికా, ఐరోపా దేశాలు ఇప్పటికే మాంద్యంలోకి జారుకున్నాయని తెలిపారు.

ఇక తమ కంపెనీ విషయానికి వస్తే.. 2023 జనవరిలో సిట్రోన్ విద్యుత్తు వెర్షన్‌ను భారత్‌లో విడుదల చేయనున్నట్లు కార్లోస్‌ ప్రకటించారు. తమిళనాడులోని తిరువళ్లూరు ప్లాంటు నుంచి దీన్ని ఉత్పత్తి చేస్తామన్నారు. ఈ ఏడాది జులైలోనే ఈ కారు పెట్రోల్‌ వెర్షన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. మరోవైపు తిరువళ్లూరు ప్లాంటు నుంచి ఐరోపా, ఆగ్నేయాసియా దేశాలకూ కార్లను ఎగుమతి చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని