Hiring: వచ్చే 3 నెలలు ఆచితూచి నియామకాలు!

ద్రవ్యోల్బణం, ఐటీ రంగంలో ఆందోళనలు, ఆర్థిక మందగమనం నేపథ్యంలో కంపెనీలు నియామకాల్లో అప్రమత్తత పాటిస్తున్నాయని ఓ ప్రముఖ సర్వే తెలిపింది.

Published : 05 Jan 2023 23:52 IST

దిల్లీ: రానున్న మూడు నెలల నియామకాల (hiring)పై భారత్‌లోని కంపెనీలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయని ప్రముఖ సర్వే తెలిపింది. ఆర్థిక మందగమనం, ద్రవ్యోల్బణం ఇంకా కొనసాగుతుండడం, క్రితం త్రైమాసికంలో ఐటీ రంగంలో నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో యాజమాన్యాలు ఉద్యోగులను నియమించుకోవడం (hiring)లో ఆచితూచి వ్యవహరిస్తున్నాయని మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ తెలిపింది.

ఈ జనవరి- మార్చి త్రైమాసికంలో నియామకాల (hiring)పై 3,030 పబ్లిక్‌, ప్రైవేటు కంపెనీల అభిప్రాయాన్ని మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ సేకరించింది. 48 శాతం యాజమాన్యాలు తమ సిబ్బందిని పెంచుకుంటామని తెలిపాయి. మరో 16 శాతం నియామకాల (hiring)ను తగ్గించుకుంటామని పేర్కొన్నాయి. 34 శాతం కంపెనీలు మాత్రం కొత్త ఉద్యోగుల నియామకాల్లో ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపాయి. నికరంగా 32 శాతం కంపెనీలు మాత్రమే నియామకాలను పెంచుతామని తెలిపాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నియామకాలు 17 శాతం తగ్గాయి.

ఇప్పటికే భారత్‌కు చెందిన 33 శాతం కంపెనీల సీఈఓలు నియామకాల (hiring)ను నిలిపివేశారని మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ ఇండియా ఎండీ సందీప్‌ గులాటీ తెలిపారు. స్వల్పకాలంలో ఉద్యోగ నియామకాలు నెమ్మదించినప్పటికీ.. రానున్న రోజుల్లో ఆర్థిక వృద్ధికి అనుగుణంగా పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌ తొలిసారి జీ20 సదస్సు నిర్వహించనున్న నేపథ్యంలో భారత్‌లో నియామకాల తీరు రానున్న రోజుల్లో మారుతుందని పేర్కొన్నారు. అత్యధికంగా డిజిటల్‌ రంగంలో నియామకాలు ఉంటాయని తెలిపారు. ఐటీ, స్థిరాస్తి, ఆర్థిక రంగంలోనూ ఉద్యోగుల నియామకాలు ఆశాజనకంగా ఉంటాయని చెప్పారు. నైపుణ్యాల కొరత ఇప్పటికీ ఓ సవాల్‌గా నిలుస్తోందన్నారు. కంపెనీలు, విద్యాసంస్థలు కలిసికట్టుగా ప్రణాళికలు రూపొందించి ముందుకెళ్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని