cryptocurrency: క్రిప్టో మార్కెట్‌పై ఆ వార్తల ప్రభావం.. బిట్‌కాయిన్‌ విలువ పతనం!

క్రిప్టో కరెన్సీపై భారత ప్రభుత్వం నిషేధం విధించనుందన్న వార్తలు క్రిప్టోకరెన్సీ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది.

Published : 24 Nov 2021 20:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రిప్టో కరెన్సీపై భారత ప్రభుత్వం నిషేధం విధించనుందన్న వార్తలు క్రిప్టోకరెన్సీ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. బుధవారం కొన్ని క్రిప్టో కరెన్సీ విలువలు దారుణంగా పతనమయ్యాయి. ప్రముఖ క్రిప్టో కరెన్సీ అయిన బిట్‌ కాయిన్‌ విలువ ఏకంగా 25.51 శాతం మేర పడిపోయింది. భారత్‌కు చెందిన కాయిన్‌ స్విచ్‌ కుబేర్‌ ఎక్స్ఛేంజీలో దాని విలువ 46,601 డాలర్లుగా (సుమారు రూ.34 లక్షలు)గా నమోదైంది. రెండు వారాల క్రితం దీని విలువ 68,327 (సుమారు రూ.50లక్షలు)గా ఉండేది. మరో ప్రముఖ క్రిప్టో కరెన్సీ ఎథేర్‌ విలువ సైతం 20.83 శాతం క్షీణించింది. దీని విలువ ప్రస్తుతం 3,662 డాలర్లుగా (రూ.2.6 లక్షలు) ఉంది. వీటితో పాటు టెథేర్‌, కార్డనో, రిపిల్‌, పాల్‌కడోట్‌, యూఎస్‌డీ కాయిన్‌, డోజీ కాయిన్‌ వంటి ఇతర క్రిప్టో కరెన్సీలు సైతం విలువను కోల్పోయాయి.

దేశవ్యాప్తంగా ఎన్నడూలేని రీతిలో క్రిప్టో కరెన్సీపై ఇటీవల కాలంలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే శీతకాల సమావేశాల్లో క్రిప్టో కరెన్సీ, డిజిటల్‌ కరెన్సీ నియంత్రణ కోసం ‘క్రిప్టో కరెన్సీ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ డిజిటల్‌ అఫీషియల్‌ డిజిటల్‌ కరెన్సీ బిల్లు, 2021’ను కేంద్రం తీసుకురాబోతోంది. ఇందులో ప్రైవేట్‌ క్రిప్టో కరెన్సీపై నిషేధం విధించాలని కేంద్రం యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ప్రైవేట్ క్రిప్టో కరెన్సీ అనే దానికి కేంద్రం స్పష్టమైన నిర్వచనం ఇవ్వలేదు. 

బిట్‌కాయిన్‌, ఎథీరియంతోపాటు పలు క్రిప్టో టోకెన్స్‌ పబ్లిక్‌ బ్లాక్‌ చెయిన్‌ నెట్‌వర్క్‌ను వినియోగిస్తున్నాయి. ఇందులో జరిగే లావాదేవీలు గుర్తించే వీలుంది. వీటిని ఏ ప్రైవేటు సంస్థా నిర్వహించడం లేదు. బ్లాక్‌ చెయిన్‌ సాంకేతికతను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఉన్న ప్రభుత్వం వీటిపై నిషేధం విధించకపోవచ్చని తెలుస్తోంది. అయితే, లావాదేవీలను గుర్తించడానికి వీలులేని, కొన్ని ప్రైవేటు సంస్థల నియంత్రణలో ఉన్నటువంటి క్రిప్టో కరెన్సీలపై నిషేధం విధించే అవకాశం ఉందని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. అయినా ఇప్పటికీ ఈ విషయంలో స్పష్టత కొరవడిన నేపథ్యంలో క్రిప్టో కరెన్సీ మార్కెట్‌పై ప్రభావం పడింది.

Read latest Business News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని