Air India: భద్రతా నిబంధనల ఉల్లంఘన.. ఎయిరిండియాకు డీజీసీఏ రూ.కోటి జరిమానా

భద్రతాపరమైన నిబంధనలు పాటించనందుకు ఎయిరిండియా విమానయాన సంస్థకు డీజీసీఏ జరిమానా విధించింది. 

Updated : 24 Jan 2024 17:02 IST

దిల్లీ: ఎయిరిండియా (Air India) విమానయాన సంస్థకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) రూ.1.10 కోట్లు జరిమానా విధించింది. భద్రతాపరమైన నిబంధనలు పాటించనందున ఈ జరిమానా విధించినట్లు డీజీసీఏ బుధవారం ప్రకటనలో తెలిపింది. సుదూర ప్రాంతాలు, కీలక మార్గాల్లో ప్రయాణించే ఎయిరిండియా విమానాల్లో భద్రతాపరమైన నిబంధనలు పాటించడం లేదని సంస్థ ఉద్యోగి ఒకరు డీజీసీఏకి నివేదిక సమర్పించారు. లీజుకు తీసుకున్న విమానాల నిర్వహణ కూడా సరిగా చేపట్టడం లేదని అందులో ఆరోపించారు. దాని ఆధారంగా విచారణ జరిపిన డీజీసీఏ.. ప్రాథమిక దర్యాప్తులో నిబంధనలు అనుసరించడం లేదని నిర్ధారించి జరిమానా విధించడంతో పాటు షోకాజ్‌ జారీ చేసినట్లు వెల్లడించింది. 

డీజీసీఏ వాదనతో ఏకీభవించం

‘‘డీజీసీఏ వాదనతో మేం ఏకీభవించడంలేదు. ప్రయాణికుల భద్రత విషయంలో సంస్థ ఎక్కడా రాజీ పడలేదు. ఏవియేషన్‌ అథారిటీ లేవనెత్తిన అంశాలతో కూడిన నివేదికను ఎయిరిండియా నిపుణుల బృందం పరిశీలిస్తోంది. వారి సూచన మేరకు అప్పీల్‌కు వెళతాం’’ అని ఎయిరిండియా అధికార ప్రతినిధి తెలిపారు.

విమానయాన సంస్థలు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్రయాణికులకు సర్వీసులను అందించాల్సిన అవసరం ఉందని డీజీసీఏ స్పష్టం చేసింది. పొగమంచు కారణంగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో విమానాలు నడిపేందుకు శిక్షణ పొందిన పైలట్లను నియమించనందుకు ఎయిరిండియాతో పాటు స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థకు గతేడాది డిసెంబరులో షోకాజ్‌ జారీ చేసింది. కొద్ది రోజుల క్రితం ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో నేలపై ఆహారం తీసుకున్న ఘటనలో ఇండిగో సంస్థకు రూ.1.50 కోట్లు జరిమానా విధించిన సంగతి తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని