ఉద్యోగుల తప్పిదం.. కంపెనీలకు రూ.8వేల కోట్ల ఫైన్‌..!

ఉద్యోగులు అనుమతిలేని మెసేజింగ్‌ యాప్స్‌ ఉపయోగించినందుకుగానూ అమెరికాలో ఓ ఐదు కంపెనీలు రూ.8000 కోట్ల జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తింది...

Published : 15 Jul 2022 18:54 IST

వాషింగ్టన్‌: ఉద్యోగులు అనుమతిలేని మెసేజింగ్‌ యాప్స్‌ ఉపయోగించినందుకుగానూ అమెరికాలో ఓ ఐదు కంపెనీలు రూ.8000 కోట్ల జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తింది. అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజీ కమిషన్‌ (SEC) ఈ మేరకు ఆయా కంపెనీలకు ఇప్పటికే నోటీసులు జారీ చేసిందని సమాచారం. అయితే, దీనిపై స్పందించడానికి ఇటు ఎస్‌ఈసీ, అటు ఆయా సంస్థలు నిరాకరించాయి.

తాఖీదులు అందుకున్న వాటిలో మోర్గాన్‌ స్టాన్లీ, జె.పి.మోర్గాన్‌ అండ్‌ కంపెనీ, సిటీ గ్రూప్‌, గోల్డ్‌మన్‌ శాక్స్‌ వంటి బడా కంపెనీలు ఉన్నట్లు సమాచారం. దీంట్లో మోర్గాన్‌ స్టాన్లీ ఇప్పటికే 200 మిలియన్‌ డాలర్ల ఫైన్‌ను చెల్లించినట్లు గురువారం వెల్లడించింది. మిగతా సంస్థల సైతం దాదాపుగా అదే స్థాయిలో జరిమానా చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. అయితే, జరిమానా తగ్గింపు విషయంలో ఆయా సంస్థలు నియంత్రణా సంస్థలతో చర్చలు జరుపుతున్నాయి. వారు అంగీకరిస్తే పైన తెలిపిన మొత్తం తగ్గే అవకాశం ఉంది. అయితే, నేర తీవ్రత ఎక్కువని ఎస్‌ఈసీ భావిస్తే జరిమానా మరింత పెరిగే అవకాశమూ లేకపోలేదని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న నిపుణులు తెలిపారు.

ఇలాంటి పొరపాట్లకు ఈ స్థాయిలో జరిమానా విధించిన దాఖలాలు ఎస్ఈసీ చరిత్రలో లేవని అమెరికాలోని ఆర్థిక నిపుణులు తెలిపారు. ఓ కంపెనీ రికార్డుల నిర్వహణలో అవకతవకలు దొర్లినందుకుగానూ 2006లో 15 మిలియన్‌ డాలర్ల జరిమానా విధించారు. ఇప్పటి వరకు ఇదే గరిష్ఠం. దీంతో పోలిస్తే తాజాగా విధించిన ఫైన్‌లు చాలా ఎక్కువ. అమెరికాలో ఆర్థిక సంస్థలు తమ వ్యాపారానికి సంబంధించిన సమాచార బదిలీని నిశితంగా పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మెసేజింగ్‌ యాప్‌ల విషయంలో అనేక అభ్యంతరాలు గతంలోనే వెలుగులోకి వచ్చాయి. అయితే, కొవిడ్‌ సమయంలో అందరూ వర్క్‌ ఫ్రమ్‌ హోంకు వెళ్లడంతో పర్యవేక్షణ కష్టంగా మారింది.

జేపీ మోర్గాన్‌కు డిసెంబరులో ఎస్‌ఈసీ 200 మిలియన్ డాలర్ల ఫైన్‌ విధిస్తూ నోటీసులు జారీ చేసింది. కంపెనీకి చెందిన ఎండీలు, సీనియర్‌ సూపర్‌వైజర్లు సైతం బిజినెస్‌కు సంబంధించిన సమాచార మార్పిడికి వాట్సాప్‌, వ్యక్తిగత ఈ-మెయిళ్లు ఉపయోగించడమే ఫైన్‌ విధించడానికి కారణమని వివరించింది. మోర్గాన్‌ స్టాన్లీ అనధీకృత డివైజ్‌లు వాడినందుకుగానూ జరిమానా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఐదు కంపెనీలతో పాటు ఎస్‌ఈసీ మరికొన్ని కంపెనీలకూ నోటీసులు పంపినట్లు సమాచారం. అవి కూడా ఈ జాబితాలో చేరితే జరిమానా మొత్తం రూ.8000 కోట్లను దాటిపోయే అవకాశం ఉంది.

అమెరికాలో కొన్ని బ్యాంకులు ఇప్పటికే తమ ఉద్యోగులకు ఉత్తర్వులు జారీ చేశాయి. మెసేజ్‌లను డిలీట్‌ చేయడం నిషిద్ధమని తెలిపాయి. కార్పొరేట్‌ ఫోన్లలో వాట్సాప్‌ సహా అన్ని మేసేజ్‌లను ఆర్కైవ్‌ చేసే కొత్త సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని