Ford Layoffs: ఫోర్డ్‌లో 3,800 మంది ఉద్యోగుల తొలగింపు

Ford Layoffs: టెక్‌ కంపెనీల తరహాలోనే కార్ల తయారీ సంస్థ ఫోర్డ్‌ సైతం ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఐరోపాలో భారీ ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు ప్రకటించింది.

Published : 14 Feb 2023 17:51 IST

బెర్లిన్‌: వచ్చే మూడేళ్లలో ఐరోపాలో 3,800 మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు (Layoffs) ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్‌ (Ford) వెల్లడించింది. ఆర్థికంగా సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో తమ కార్యకలాపాలను గాడిన పెట్టే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు విద్యుత్తు కార్ల విభాగంలో పోటీ ఎక్కువైన నేపథ్యంలోనూ వ్యయాలను నియంత్రించుకోనున్నట్లు పేర్కొంది.

జర్మనీలో 2,300 మందిని, యూకేలో 1,300 మందిని, ఐరోపాలోని మిగిలిన ప్రాంతాల్లో మరో 200 మందిని తొలగించనున్నట్లు ఫోర్డ్‌ తెలిపింది. 2035 నాటికి ఐరోపాలో పూర్తిగా విద్యుత్తు వాహనాలనే విక్రయించాలన్న తమ లక్ష్యం నుంచి మాత్రం సడలడం లేదని స్పష్టం చేసింది. ఈ ఏడాదిలోనే కంపెనీ ఐరోపాలో తయారు చేసిన తొలి విద్యుత్తు కారును విడుదల చేయనుంది. ఉద్యోగుల తొలగింపును వీలైనంత వరకు ‘వాలంటరీ సపరేషన్‌ ప్రోగ్రాం’ ద్వారా చేపడతామని తెలిపింది.

క్రమంగా విద్యుత్తు వాహన తయారీ దిశగా రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో ఇంజినీర్ల సంఖ్య పెద్దగా అవసరం ఉండకపోవచ్చునని ఫోర్డ్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ విభాగంలోనే దాదాపు 2,800 మంది తొలగించాలని యోచిస్తోంది. మిగిలిన 1,000 మందిని పరిపాలనా విభాగాల నుంచి తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఇంజినీరింగ్‌ విభాగంలో ఇంకా 3,400 మంది ఉంటారని సమాచారం. ఫోర్డ్‌ (Ford)కు ఐరోపాలో మొత్తం 34,000 మంది ఉద్యోగులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని