IPO: వచ్చేవారం 4 ఐపీఓలు.. రూ.4500 కోట్ల సమీకరణ

వచ్చేవారం గ్లోబల్‌ హెల్త్‌, ఫ్యూజన్‌ మైక్రోఫైనాన్స్‌, డీసీఎక్స్‌ సిస్టమ్స్‌, బికాజీ ఫుడ్స్‌ ఇంటర్నేషనల్‌ ఐపీఓ ప్రారంభం కానుంది. ఈ 4 కంపెనీలు కలిసి రూ.4,500 కోట్లు సమీకరించనున్నాయి.

Published : 30 Oct 2022 16:00 IST

దిల్లీ: వచ్చేవారం నాలుగు ఐపీఓలు రానున్నాయి. గ్లోబల్‌ హెల్త్‌, ఫ్యూజన్‌ మైక్రోఫైనాన్స్‌, డీసీఎక్స్‌ సిస్టమ్స్‌, బికాజీ ఫుడ్స్‌ ఇంటర్నేషనల్‌ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ నాలుగు కంపెనీలు కలిసి రూ.4,500 కోట్లు సమీకరించనున్నాయి. వీటితో పాటు యూనిపార్ట్స్‌ ఇండియా, ఫైవ్‌ స్టార్‌ బిజినెస్‌ ఫైనాన్స్‌ కూడా నవంబరులో పబ్లిక్‌ ఇష్యూకు రానున్నాయి.

కేబుల్స్‌, వైర్‌ హార్నెస్‌ అసెంబ్లీని తయారు చేసే డీసీఎస్‌ సిస్టమ్స్‌ ఐపీఓ అక్టోబరు 31న ప్రారంభమై నవంబరు 2న ముగియనుంది. ఫ్యూజన్‌ మైక్రోఫైనాన్స్‌ పబ్లిక్‌ ఇష్యూ నవంబరు 2-4 మధ్య జరగనుంది. గ్లోబల్‌ హెల్త్‌, బికాజీ ఫుడ్స్‌ ఐపీఓలను నవంబరు 3 నుంచి నవంబరు 7 మధ్య నిర్వహించనున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. 2022లో ఇప్పటి వరకు 22 కంపెనీలు ఐపీఓకి వచ్చాయి. రూ.44,000 కోట్లు సమీకరించాయి. 2021లో 63 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకి వచ్చి రూ.1.19 లక్షల కోట్లు సేకరించిన విషయం తెలిసిందే.

స్టాక్‌ మార్కెట్లలోని ఒడుదొడుకుల కారణంగా 2022లో ఐపీఓ మార్కెట్‌ బలహీనంగా ఉందని జియోజిట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ విభాగాధిపతి వినోద్‌ నాయర్‌ తెలిపారు. అయితే, పబ్లిక్‌ ఇష్యూకి వచ్చిన వాటికి మాత్రం మదుపర్ల నుంచి స్పందన బాగానే ఉంటోందని పేర్కొన్నారు. హెచ్‌ఎన్‌ఐలు, రిటైల్‌ మదుపర్ల వద్ద ద్రవ్య లభ్యత అధికంగా ఉండడమే దీనికి కారణమన్నారు. ముఖ్యంగా లిస్టింగ్‌ లాభాల కోసం చాలా మంది ఐపీఓలపై ఆసక్తి చూపుతున్నారన్నారు. అలాగే సంస్థాగత మదుపర్లు సైతం డైవర్సిఫికేషన్‌ కోసం నాణ్యమైన కంపెనీల్లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు.

డీసీఎక్స్‌ సిస్టమ్స్‌ రూ.500 కోట్ల సమీకరణే లక్ష్యంగా ఐపీఓకి వస్తోంది. ధరల శ్రేణిని రూ.197-207గా నిర్ణయించింది. పబ్లిక్ ఇష్యూలో సమీకరించిన నిధులతో రుణ భారం తగ్గించుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. అలాగే అనుబంధ సంస్థ రణీల్‌ అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌కు కావాల్సిన మూలధన పెట్టుబడికి మరికొన్ని నిధులను వినియోగించనున్నట్లు పేర్కొంది. మరోవైపు ఫ్యూజన్‌ మైక్రోఫైనాన్స్‌ రూ.1,104 కోట్లు సమీకరించేందుకు సిద్ధమవుతోంది. ధరల శ్రేణిని రూ.350- 368గా నిర్ధారించింది.

మేదాంతా పేరిట ఆస్పత్రులను నిర్వహిస్తున్న గ్లోబల్‌ హెల్త్‌ రూ.2,206 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ధరల శ్రేణిని రూ.319-336గా నిర్ణయించింది. రుణ భారాన్ని తగ్గించుకోవడంతో పాటు సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు ఈ నిధులను వినియోగించనున్నారు. ఐపీఓకి రానున్న మరో కంపెనీ బికాజీ ఫుడ్స్‌ రూ.1,000 కోట్లు సమీకరించడానికి సిద్ధమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని