Adani FPO: అందుకే ఎఫ్‌పీఓను ఉపసంహరించుకున్నాం: గౌతమ్ అదానీ

Adani FPO: అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఎఫ్‌పీఓను ఉపసంహరించుకున్నారు. ఈ నిర్ణయం వెనుక కారణాన్ని గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ వివరించారు.

Updated : 02 Feb 2023 11:54 IST

దిల్లీ: అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.20,000 కోట్ల మలి విడత పబ్లిక్‌ ఆఫర్‌ (Adani Enterprises FPO)ను ఉపసంహరించుకోవడంపై అదానీ గ్రూప్ (Adani Group) కంపెనీల ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ (Gautam Adani) స్వయంగా వివరణ ఇచ్చారు. స్టాక్‌ మార్కెట్‌లో ఒడుదొడుకులే ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణమని వివరించారు. అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ ఆరోపణల తర్వాత అదానీ గ్రూప్‌ (Adani Group) కంపెనీ షేర్లు తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఆయా కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 90 బిలియన్ డాలర్లకు పైగా ఆవిరైంది.

‘‘పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన FPO తర్వాత, నిన్నటి ఉపసంహరణ నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. కానీ నిన్న కనిపించిన మార్కెట్ అస్థిరతను పరిగణనలోకి తీసుకుంటే, FPOతో కొనసాగడం నైతికంగా సరైనది కాదని బోర్డు గట్టిగా భావించింది. ఈ నిర్ణయం కంపెనీల ప్రస్తుత కార్యకలాపాలు, భవిష్యత్తు ప్రణాళికలపై ఎలాంటి ప్రభావం చూపబోదు. సకాలంలో ప్రాజెక్ట్‌ల  అమలు, డెలివరీపై మేం దృష్టి సారిస్తాం. మా బ్యాలెన్స్ షీట్ ఆరోగ్యకరంగానే ఉంది. ఆస్తులూ పటిష్ఠంగా ఉన్నాయి. మా EBITDA స్థాయిలు, నగదు ప్రవాహాలు చాలా బలంగా ఉన్నాయి. రుణ బాధ్యతలను నెరవేర్చడంలో మాకు నిష్కళంకమైన ట్రాక్ రికార్డ్ ఉంది. మేము దీర్ఘకాలిక విలువ సృష్టిపై దృష్టి సారించడం కొనసాగిస్తాం. మా ప్రతి వ్యాపారం బాధ్యతాయుతమైన రీతిలో విలువను సృష్టించడం కొనసాగిస్తుంది. మా సంస్థలు ఏర్పాటు చేసుకున్న అంతర్జాతీయ భాగస్వామ్యాలే మా గవర్నెన్స్‌ సూత్రాలకు బలమైన ధ్రువీకరణ. మార్కెట్‌లో స్థిరత్వం వచ్చిన తర్వాత మా క్యాపిటల్‌ మార్కెట్‌ వ్యూహాన్ని సమీక్షిస్తాం’’ అని ఇన్వెస్టర్లను ఉద్దేశించి విడుదల చేసిన వీడియో ప్రసంగంలో గౌతమ్‌ అదానీ అన్నారు.

రూ.20,000 కోట్ల సమీకరణ నిమిత్తం అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ (Adani Enterprises) ప్రారంభించిన ‘మలి విడత పబ్లిక్‌ ఆఫర్‌ (FPO)’ గత నెల 27-31 మధ్య కొనసాగింది. సరిగ్గా ఎఫ్‌పీఓ ప్రారంభం కావడానికి ముందే హిండెన్‌బర్గ్‌ నివేదిక రావడంతో ఎఫ్‌పీఓపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవయ్యాయి. ఎట్టకేలకు చివరి రోజు సంస్థాగతేతర మదుపర్ల సాయంతో ఎఫ్‌పీఓ పూర్తిగా సబ్‌స్క్రైబైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని