5g Specturm: 5జీ స్పెక్ట్రమ్‌పైౖ రూ.1.50 లక్షల కోట్లు

5జీ స్పెక్ట్రమ్‌ వేలం సోమవారంతో ముగిసింది. 7 రోజుల్లో రూ.1,50,173 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. ‘10 బ్యాండ్‌లలో మొత్తం 72,098 మెగాహెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌ను అమ్మకానికి ఉంచగా.. 51,236 మెగాహెర్ట్జ్‌ (71 శాతం) మేర విక్రయమైంది.

Updated : 02 Aug 2022 05:32 IST

అక్టోబరు నుంచి 5జీ సేవలు

దిల్లీ: 5జీ స్పెక్ట్రమ్‌ వేలం సోమవారంతో ముగిసింది. 7 రోజుల్లో రూ.1,50,173 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. ‘10 బ్యాండ్‌లలో మొత్తం 72,098 మెగాహెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌ను అమ్మకానికి ఉంచగా.. 51,236 మెగాహెర్ట్జ్‌ (71 శాతం) మేర విక్రయమైంది. ఆగస్టు 10 కల్లా 5జీ స్పెక్ట్రమ్‌ను సంస్థలకు కేటాయిస్తాం. దేశంలో 5జీ సేవలు అక్టోబరు నుంచి ప్రారంభమవుతాయి. 2-3 ఏళ్లలో దేశం అంతటా ఈ సేవలు విస్తరిస్తాయి. తొలి ఏడాది స్పెక్ట్రమ్‌ చెల్లింపుల కింద ప్రభుత్వానికి రూ.13,365 కోట్లు లభిస్తాయి. దేశీయ రంగంలోకి వచ్చే రెండేళ్లలో రూ.2-3 లక్షల కోట్ల మేర పెట్టుబడులు రావొచ్చు’ అని టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. సాధ్యమైనంత వేగంగా 5జీ సేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు రిలయన్స్‌ జియో అధిపతి ముకేశ్‌ అంబానీ, ఎయిర్‌టెల్‌ సీఈఓ గోపాల్‌ విత్తల్‌ తెలిపారు.  

* 1800 మెగాహెర్ట్జ్‌ మినహా, మిగతా అన్ని బ్యాండ్‌లలో ప్రాథమిక ధరకే స్పెక్ట్రమ్‌ విక్రయం జరిగింది. 600 మెగాహెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌పై ఎవరూ ఆసక్తి చూపలేదు. గతేడాది విక్రయమైన 4జీ స్పెక్ట్రమ్‌ విలువ రూ.77,815 కోట్ల కంటే ఈసారి దాదాపు రెట్టింపు ఆదాయం రాగా,  2010 నాటి 3జీ స్పెక్ట్రమ్‌ ఆదాయం రూ.50,968.37 కోట్లతో పోలిస్తే మూడింతలైంది.

జియో: దేశంలోని 22 సర్కిళ్లలోనూ 5జీ స్పెక్ట్రమ్‌ కోసం రూ.88,078 కోట్ల విలువైన బిడ్లు వేసింది. 6-10 కి.మీ. పరిధిలో సిగ్నల్‌ అందించగల 700 మెగాహెర్ట్జ్‌తో పాటు, 800, 1800, 3300 మెగాహెర్ట్జ్‌, 26 గిగాహెర్ట్జ్‌ బ్యాండ్‌లలో కలిపి 24,740 మెగాహెర్ట్జ్‌స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసింది. ఇందుకోసం ఏడాదికి రూ.7,877 కోట్లు చెల్లించాల్సి ఉంది.

ఎయిర్‌టెల్‌: 700 మెగాహెర్ట్జ్‌ మినహా, వివిధ బ్యాండ్‌లలో 19,867 మెగాహెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌ను రూ.43,084 కోట్లతో కొనుగోలు చేసింది.

వొడాఫోన్‌ ఐడియా: రూ.18,799 కోట్ల విలువైన 6228 మెగాహెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసింది. 5జీ సేవలతో పాటు దేశం అంతటా 4జీ సేవలు అందించగలమని పేర్కొంది.

అదానీ: 26 గిగాహెర్ట్జ్‌ బ్యాండ్‌లో 400 మెగాహెర్ట్జ్‌ (మొత్తం విక్రయమైన స్పెక్ట్రమ్‌లో 1 శాతం లోపు) స్పెక్ట్రమ్‌ను రూ.212 కోట్లకు కొనుగోలు చేసింది. ముంబయితో పాటు ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో తమ ప్రైవేటు నెట్‌వర్క్‌ కోసం ఈ స్పెక్ట్రమ్‌ను అదానీ గ్రూప్‌ వినియోగించుకోనుంది.


ముందుండి నడిపిస్తాం: ‘ప్రపంచంలోనే అత్యంత ఆధునిక 5జీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్పెక్ట్రమ్‌ కొనుగోలు చేశాం. ఇప్పటికే కోట్ల మంది వినియోగదార్లకు డిజిటల్‌ సేవలను అందిస్తున్నాం. మరింత నాణ్యమైన సేవలతో, 5జీ శకంలోకి భారత్‌ను తీసుకెళ్లడంలో జియో ముందుండి నడిపిస్తుంది.’

- రిలయన్స్‌ జియో ఛైర్మన్‌ ఆకాశ్‌ అంబానీ


ఆంధ్రప్రదేశ్‌లో అదనపు 4జీ స్పెక్ట్రమ్‌: ‘తక్కువ వ్యయంతోనే అత్యుత్తమ సేవలకు అనువైన స్పెక్ట్రమ్‌ కొనుగోలు చేయాలన్నది మా వ్యూహం. కవరేజీ, వేగం విషయంలో అత్యుత్తమ 5జీ సేవలను అందిస్తామన్న నమ్మకం మాకుంది. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, పంజాబ్‌లలో అదనపు 4జీ స్పెక్ట్రమ్‌ కొనుగోలు వల్ల మరింత మెరుగ్గా సేవలందించగలం’

- ఎయిర్‌టెల్‌ ఎండీ, సీఈఓ గోపాల్‌ విత్తల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని