60000-60500 శ్రేణిలో నిరోధం!

సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో వరుసగా నాలుగో వారమూ మార్కెట్ల లాభాలు కొనసాగాయి. కంపెనీల త్రైమాసిక ఫలితాలు మార్కెట్లను నడిపించాయి. జులైలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5 నెలల కనిష్ఠమైన 6.71 శాతానికి పరిమితమైనా, రిజర్వ్‌బ్యాంక్‌ లక్ష్యమైన 6 శాతం కంటే ఎగువనే ఉంది. జూన్‌లో పారిశ్రామికోత్పత్తి

Published : 16 Aug 2022 03:18 IST

సమీక్ష: సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో వరుసగా నాలుగో వారమూ మార్కెట్ల లాభాలు కొనసాగాయి. కంపెనీల త్రైమాసిక ఫలితాలు మార్కెట్లను నడిపించాయి. జులైలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5 నెలల కనిష్ఠమైన 6.71 శాతానికి పరిమితమైనా, రిజర్వ్‌బ్యాంక్‌ లక్ష్యమైన 6 శాతం కంటే ఎగువనే ఉంది. జూన్‌లో పారిశ్రామికోత్పత్తి 12.3 శాతం వృద్ధి నమోదుచేసింది. తయారీ, విద్యుదుత్పత్తి రంగాలు వరుసగా 12.5 శాతం, 16.4 శాతం పెరిగాయి. మాంద్యం భయాలు తగ్గడంతో బ్యారెల్‌ ముడిచమురు ధర 3.4 శాతం పెరిగి 98.2 డాలర్ల వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 79.23 నుంచి 79.65కు బలహీనపడింది. అమెరికాలో నిరుద్యోగిత రేటు 3.5 శాతానికి పరిమితమైంది. ద్రవ్యోల్బణం 9.1 శాతం నుంచి 8.5 శాతానికి తగ్గడంతో, అంతర్జాతీయ సెంటిమెంట్‌ బలపడింది. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 1.8 శాతం లాభంతో 59,463 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 1.7 శాతం పెరిగి 17,698 పాయింట్ల దగ్గర స్థిరపడింది. లోహ, యంత్ర పరికరాలు, విద్యుత్‌ షేర్లు రాణించాయి. ఎఫ్‌ఎమ్‌సీజీ, ఐటీ, ఔషధ స్క్రిప్‌లు నష్టపోయాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.7,850 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, డీఐఐలు రూ.2,478 కోట్ల షేర్లను విక్రయించారు. ఈ నెలలో ఇప్పటివరకు ఈక్విటీల్లో ఎఫ్‌పీఐలు రూ.22,452 కోట్ల పెట్టుబడులు పెట్టారు.

లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 13:12గా నమోదు కావడం..

ఎంపిక చేసిన షేర్లలో కొనుగోళ్లను సూచిస్తోంది.

ఈ వారంపై అంచనా: ప్రస్తుతం సెన్సెక్స్‌ కీలక నిరోధ స్థాయి 60,000- 60,500 పాయింట్ల చేరువలో కదలాడుతోంది. ఈ శ్రేణిని అధిగమిస్తే మార్కెట్‌ మరింత లాభపడొచ్చు. మరోవైపు 58,580 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించొచ్చు. ఈ స్థాయిని కోల్పోతే స్వల్పకాలంలో దిద్దుబాటు/ స్థిరీకరణకు అవకాశం ఉంటుంది.

ప్రభావిత అంశాలు: అంతర్జాతీయ మార్కెట్లు, కంపెనీల త్రైమాసిక ఫలితాల నుంచి వచ్చే సంకేతాలను దేశీయ సూచీలు అందిపుచ్చుకోవచ్చు. ప్రధాన మంత్రి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం మార్కెట్లపై ప్రభావం చూపొచ్చు. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, డిజిటల్‌ బ్యాంకింగ్‌ రంగాలు, ఆర్థికాభివృద్ధి చర్యలపై మదుపర్లు దృష్టిపెట్టొచ్చు. షేరు ఆధారిత కదలికలు కీలకం కానున్నాయి. జులై టోకు ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం విడుదల కానున్నాయి. త్రైమాసిక ఫలితాల సీజన్‌ ముగుస్తున్నందున.. ఏజీఎంలలో కంపెనీల వ్యాఖ్యలు, కార్పొరేట్‌ వార్తలపై కన్నేయొచ్చు. రుతుపవనాల పురోగతి నుంచి సంకేతాలు తీసుకోవచ్చు. అమెరికా ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ (ఎఫ్‌ఓఎంసీ) జులై సమావేశ నిర్ణయాలు వెలువడనున్నాయి. చైనా కేంద్ర బ్యాంక్‌ వడ్డీరేట్లు తగ్గించడం ప్రభావం చూపొచ్చు. డాలర్‌తో పోలిస్తే రూపాయి కదలికలు, ఎఫ్‌ఐఐ పెట్టుబడులు, ముడిచమురు ధరలు నుంచి కూడా సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. ఎఫ్‌ఐఐ కొనుగోళ్లు, చమురు ధరల్లో దిద్దుబాటు సెంటిమెంట్‌ను బలోపేతం చేయొచ్చు.

తక్షణ మద్దతు స్థాయులు: 58,800, 58,244, 57,577

తక్షణ నిరోధ స్థాయులు: 59,941, 60,176, 60,845

సెన్సెక్స్‌ 60,000- 60,500 పాయింట్ల శ్రేణిని అధిగమిస్తే మరింత లాభపడొచ్చు.

- సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని