కొవిడ్‌ చుక్కల మందు టీకాపై క్లినికల్‌ పరీక్షలు పూర్తి

కరోనా మహమ్మారి నుంచి రక్షణకు భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన చుక్కల మందు టీకా- బీబీవీ154 (నాసల్‌ వ్యాక్సిన్‌) పై మూడో దశ క్లినికల్‌ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ టీకా సమర్థంగా పనిచేయడమే కాకుండా, ఎంతో సురక్షితమైనదిగా నిర్థారణ అయినట్లు భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. దీనిపై

Published : 16 Aug 2022 03:18 IST

సమర్థత, భద్రత నిర్థారణ అయ్యాయి

భారత్‌ బయోటెక్‌ వెల్లడి

ఈనాడు బిజినెస్‌ బ్యూరో: కరోనా మహమ్మారి నుంచి రక్షణకు భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన చుక్కల మందు టీకా- బీబీవీ154 (నాసల్‌ వ్యాక్సిన్‌) పై మూడో దశ క్లినికల్‌ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ టీకా సమర్థంగా పనిచేయడమే కాకుండా, ఎంతో సురక్షితమైనదిగా నిర్థారణ అయినట్లు భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. దీనిపై రెండు డోసుల టీకా (ప్రైమరీ డోసు) పరీక్షలతో పాటు, బూస్టర్‌ డోసు పరీక్షలను వేరువేరుగా, ఏకకాలంలో పూర్తిచేసినట్లు తెలిపింది. ప్రైమరీ డోసు టీకా పరీక్షలను దేశవ్యాప్తంగా 14 ప్రదేశాల్లో 3,100 మంది వాలంటీర్లపై నిర్వహించారు. బూస్టర్‌ డోసు పరీక్షలను 9 ప్రదేశాల్లో 875 మందిపై చేపట్టారు. ఈ పరీక్షల సమాచారాన్ని భారత ఔషధ నియంత్రణ మండలికి అందజేసినట్లు భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది.

ముక్కు ద్వారా సులభంగా వేయొచ్చు

చుక్కల మందు టీకాను ముక్కు ద్వారా ఇవ్వడం ఎంతో సులువని భారత్‌ బయోటెక్‌ పేర్కొంది. దీనికి అనుమతి లభించిన వెంటనే పెద్దఎత్తున సార్వత్రిక టీకాల కార్యక్రమాన్ని చేపట్టేందుకు వీలుంటుందని వివరించింది. తాము అభివృద్ధి చేసిన చుక్కల మందు టీకాపై క్లినికల్‌ పరీక్షలు విజయవంతంగా పూర్తయినట్లు 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభసందర్భంలో వెల్లడించడానికి ఎంతో సంతోషిస్తున్నామని భారత్‌ బయోటెక్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్ర ఎల్ల అన్నారు. తక్కువ, మధ్య ఆదాయాలు గల దేశాల్లో కొవిడ్‌ టీకా కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టడానికి ఈ టీకా వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ టీకాను అమెరికాలోని వాషింగ్టన్‌ యూనివర్సిటీ- సెయింట్‌ లూయిస్‌ సహకారంతో భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసింది. మనదేశంలో కేంద్ర ప్రభుత్వం కొవిడ్‌ సురక్ష కార్యక్రమం కింద సహకారాన్ని అందించింది. టీకాను ఉత్పత్తి చేయడానికి భారత్‌ బయోటెక్‌.. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాల్లోని తన యూనిట్లలో తగిన ఏర్పాట్లు చేసింది. ఈ టీకాను 2- 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేయాలి. కాబట్టి నిల్వ, రవాణా ఎంతో సులువని కంపెనీ వివరించింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని