ఆర్‌బీఐ చర్యలు ఫలించాయ్‌

ఏడు రోజుల వరుస నష్టాల తర్వాత సూచీలు శుక్రవారం బలంగా పుంజుకున్నాయి. అంచనాలకు అనుగుణంగా రెపోరేటును అర శాతం పెంచడం, వచ్చే జనవరికి ద్రవ్యోల్బణం అదుపులోకి రావొచ్చన్న అంచనాలు మదుపర్లపై సానుకూల ప్రభావం చూపాయి.

Updated : 01 Oct 2022 06:54 IST

సమీక్ష

ఏడు రోజుల వరుస నష్టాల తర్వాత సూచీలు శుక్రవారం బలంగా పుంజుకున్నాయి. అంచనాలకు అనుగుణంగా రెపోరేటును అర శాతం పెంచడం, వచ్చే జనవరికి ద్రవ్యోల్బణం అదుపులోకి రావొచ్చన్న అంచనాలు మదుపర్లపై సానుకూల ప్రభావం చూపాయి. రూపాయి కోలుకోవడమూ కలిసొచ్చింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 33 పైసలు బలపడి 81.40 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు ధర 1.19 శాతం పెరిగి 89.54 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్‌ మినహా మిగతావి నష్టాల్లో ముగిశాయి. ఐరోపా సూచీలు లాభాల్లో ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 56,240.15 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ప్రారంభ ట్రేడింగ్‌లో 56,147.23 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని సూచీ.. ఆర్‌బీఐ పరపతి నిర్ణయాలు వెలువడిన తర్వాత పరుగులు తీసింది. ఒకదశలో 57,722.63 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకి, చివరకు 1016.96 పాయింట్ల లాభంతో 57,426.92 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 276.25 పాయింట్లు పెరిగి 17,094.35 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 16,747.70- 17,187.10 పాయింట్ల మధ్య కదలాడింది. వారం ప్రాతిపదికన చూస్తే.. సెన్సెక్స్‌ 672 పాయింట్లు, నిఫ్టీ 233 పాయింట్ల చొప్పున నష్టపోయాయి.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 25 రాణించాయి. భారతీ ఎయిర్‌టెల్‌ 4.49%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 3.78%, బజాజ్‌ ఫైనాన్స్‌ 3.28%, కోటక్‌ బ్యాంక్‌ 3.22%, టైటన్‌ 2.95%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2.93%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 2.63%, టాటా స్టీల్‌ 2.53%, మారుతీ 2.35%, హెచ్‌డీఎఫ్‌సీ 2.27%, రిలయన్స్‌ 2.25%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 2.22% చొప్పున లాభపడ్డాయి. ఏషియన్‌ పెయింట్స్, డాక్టర్‌ రెడ్డీస్, ఐటీసీ, టెక్‌ మహీంద్రా స్వల్పంగా నష్టపోయాయి.

* స్టాక్‌ మార్కెట్‌లో ఒడుదొడుకుల నేపథ్యంలో రూ.1250 కోట్ల పబ్లిక్‌ ఇష్యూను వాయిదా వేస్తున్నట్లు స్టెరిలైట్‌ పవర్‌ ప్రకటించింది. గతేడాది ఆగస్టులో కంపెనీ సెబీ వద్ద ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది.

* శారదా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌కు చెందిన 69 ఆస్తులను నవంబరు 1న సెబీ వేలం వేయనుంది. ఇందుకు కనీస ధరగా రూ.30 కోట్లు నిర్ణయించింది. అక్రమ పథకాల ద్వారా ప్రజల నుంచి కంపెనీ వసూలు చేసిన డబ్బులను రాబట్టుకునే చర్యల్లో భాగంగా సెబీ ఆస్తుల వేలం నిర్వహిస్తోంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని