మన ఆర్థిక వ్యవస్థకు ప్రపంచం వల్లే ‘ఏడు’పు

‘ద్రవ్యోల్బణ అంచనాలను అంతర్జాతీయ అనిశ్చితి మేఘాలు కమ్మేశాయి. అధిక ద్రవ్యోల్బణాన్ని ఇలాగే వదిలేస్తే.. మరో దుష్ప్రభావాన్ని ఆహ్వానించినట్లు అవుతుంది. గత రెండున్నరేళ్లలో కరోనా మహమ్మారి, రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం రూపంలో రెండు భారీ కుదుపులకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లోనైంది.

Updated : 01 Oct 2022 07:51 IST

2022-23 వృద్ధి అంచనాల్లో మళ్లీ కోత

7.2% నుంచి 7 శాతానికి తగ్గింపు

కీలక రేట్లు మరో అర శాతం పెంపు

ద్రవ్యోల్బణ అంచనాలు యథాతథం

ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష

‘ద్రవ్యోల్బణ అంచనాలను అంతర్జాతీయ అనిశ్చితి మేఘాలు కమ్మేశాయి. అధిక ద్రవ్యోల్బణాన్ని ఇలాగే వదిలేస్తే.. మరో దుష్ప్రభావాన్ని ఆహ్వానించినట్లు అవుతుంది. గత రెండున్నరేళ్లలో కరోనా మహమ్మారి, రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం రూపంలో రెండు భారీ కుదుపులకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లోనైంది. అంతర్జాతీయ మాంద్యం భయాల నుంచి మన ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు అప్రమత్తతతో వ్యవహరిస్తోంది. అవసరమైతే తగు చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉంది. రూపాయి విలువ ఏ స్థాయిలో ఉండాలనే దాని కంటే కూడా, ఒడుదొడుకుల నియంత్రణపై ఆర్‌బీఐ దృష్టి సారిస్తుంది.’

- శక్తికాంత దాస్, ఆర్‌బీఐ గవర్నరు

ముంబయి: దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మరోసారి తగ్గించింది. 2022-23లో వృద్ధిరేటు 7 శాతంగా నమోదు కావొచ్చని తాజాగా పేర్కొంది. తొలుత 7.8 శాతమని అంచనా వేసినా, గత ఏప్రిల్‌లో 7.2 శాతానికి తగ్గించిన ఆర్‌బీఐ.. ప్రస్తుత అంతర్జాతీయ అనిశ్చితిని పరిగణనలోకి తీసుకుని ఇలా సవరించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండటం, వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు కీలక రేట్లను పెంచే విషయంలో దూకుడు ప్రదర్శిస్తుండటం, అంతర్జాతీయంగా గిరాకీ తగ్గుతున్నందున, మన ఎగుమతులపై ప్రభావం పడి, దేశీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి కొంత ఇబ్బందులు కలగవచ్చని ఆర్‌బీఐ గవర్నరు శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. ద్రవ్య పరపతి విధాన (ఎంపీసీ) సమీక్ష నిర్ణయాలను ఆయన శుక్రవారం వెల్లడించారు. నిర్ణయాలివీ..

రెపోరేటు: కీలకమైన రెపో రేటును మరో అర శాతం పెంచి 5.9 శాతానికి చేర్చింది. 2019 ఏప్రిల్‌ తర్వాత ఇదే అత్యధిక రెపోరేటు కావడం గమనార్హం. ఈ ఏడాది మే నుంచి కీలక రేట్లను పెంచడం ఇది వరుసగా నాలుగోసారి. అప్పటినుంచి మొత్తంగా 190 బేసిస్‌ పాయింట్లను ఆర్‌బీఐ పెంచింది. ఇందువల్ల తమ ఖాతాదార్ల రుణాలపై బ్యాంకులు వడ్డీరేట్లు పెంచుతాయి. కీలక రేట్ల పెంపునకు ఎంపీసీలోని ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు రెపోరేటు పెంపునకు ఓటేశారు. ఓ వైపు వృద్ధికి అండగా నిలుస్తూనే.. ద్రవ్యోల్బణాన్ని నియంత్రిత లక్ష్య (2- 6% మధ్యలో) శ్రేణిలోకి తీసుకొచ్చేందుకు సర్దుబాటు విధాన వైఖరిని ఉపసంహరించడంపై దృష్టి సారిస్తున్నట్లు దాస్‌ తెలిపారు. తద్వారా మున్ముందు కూడా కీలక రేట్లను పెంచే అవకాశం ఉందనే సంకేతాలను ఆయన ఇచ్చారు.

జనవరి నుంచి అదుపులోకి ద్రవ్యోల్బణం!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణ అంచనాల్లో మార్పు చేయకుండా 6.7 శాతంగానే కొనసాగించింది. 2023 జనవరి నుంచి ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని భావిస్తున్నట్లు పేర్కొంది. 2022 జనవరి నుంచి ద్రవ్యోల్బణం నియంత్రిత లక్ష్య శ్రేణిలోని గరిష్ఠమైన 6 శాతానికి ఎగువన ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో దిగుమతుల భారం వల్లే ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరిగిందని ఆర్‌బీఐ గవర్నరు చెప్పారు. ఇటీవల ఆ ఒత్తిడి కొంత తగ్గినా, ఆహార పదార్థాలు, ఇంధన ధరలు ఇంకా అధిక స్థాయుల్లోనే కొనసాగుతున్నాయని అన్నారు. ఆహార పదార్థాల నుంచి మరింత ముప్పు పొంచి ఉందని తెలిపారు. ఖరీఫ్‌ పంట దిగుబడి తక్కువగా ఉండొచ్చనే అంచనాలతో, తృణ ధాన్యాలు, గోధుమలు, బియ్యం ధరలు అధికంగా ఉంటున్నాయని వివరించారు.

విదేశీ మారకపు నిల్వల్లో 67% క్షీణత ఎందుకంటే..

ఏప్రిల్‌ నుంచి విదేశీ మారకపు నిల్వల్లో 67 శాతం క్షీణతకు అమెరికా డాలరు బలోపేతం కారణంగా విలువల్లో వచ్చిన మార్పులు, అమెరికా బాండ్లపై అధిక ప్రతిఫలాలే కారణమని శక్తికాంత దాస్‌ తెలిపారు. ఏప్రిల్‌ 2న 606.475 బిలియన్‌ డాలర్లుగా ఉన్న విదేశీ మారకపు నిల్వలు.. సెప్టెంబరు 23 కు 537.5 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 7.4 శాతం తగ్గినా, ఇతర వర్థమాన, ఆసియా దేశాల కరెన్సీలతో పోలిస్తే మెరుగైన స్థితిలోనే ఉందని దాస్‌ తెలిపారు. రూపాయి మారకపు విలువ ఇంత ఉండాలని ఆర్‌బీఐ నిర్దేశించడం లేదని, అయితే ఒడుదొడుకులకు లోనైనప్పుడే జోక్యం చేసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. తగినంత విదేశీ మారకపు నిల్వలు కలిగి ఉండాలన్నదే లక్ష్యమని వివరించారు. కరెన్సీ కదలికలు పరపతి విధాన నిర్ణయాలను నిర్దేశించబోవన్నారు.

* టోకనైజేషన్‌: నేటి (అక్టోబరు 1) నుంచి అమల్లోకి రానున్న టోకనైజేషన్‌ నిబంధనలకు వ్యవస్థ సిద్ధంగా ఉందని, 35 కోట్ల కార్డులు టోకనైజ్డ్‌ అయ్యాయని ఆర్‌బీఐ తెలిపింది. క్రెడిట్, డెబిట్‌ కార్డులపై ఉంటే వివరాల స్థానంలో ‘టోకెన్‌’గా వ్యవహరించే ప్రత్యామ్నాయ కోడ్‌ ద్వారా లావాదేవీలు చేసుకునే సౌలభ్యమే టోకనైజేషన్‌. దీని వల్ల కార్డు లావాదేవీలు మరింత సురక్షితం అవుతాయి.

* కరెంటు ఖాతా లోటు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 3 శాతం కంటే తక్కువగానే నమోదయ్యే అవకాశం ఉందని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నరు మైఖేల్‌ పాత్ర చెప్పారు. తొలి అర్ధభాగంలో స్వల్పంగా పెరిగినా, రెండో అర్ధభాగంలో తగ్గుముఖం పట్టొచ్చని అన్నారు.

* రూపాయి వాణిజ్యం: విదేశాల నుంచి దిగుమతులకు, ఇక్కడ నుంచి ఎగుమతులకు సంబంధించిన లావాదేవీలు కూడా మన కరెన్సీలో నిర్వహించేందుకు 4- 5 దేశాల నుంచి మంచి స్పందన లభించిందని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నరు టి.రవి శంకర్‌ చెప్పారు. మరిన్ని విదేశీ బ్యాంకులూ ఆసక్తిగా ఉన్నాయన్నారు.

* నిబంధనలకు అనుగుణంగానే రుణ వసూళ్లు: బ్యాంకులు/ రుణ సంస్థలు రుణ వసూళ్ల బాధ్యతను బయటి సంస్థలకు అప్పగించడాన్ని ఆర్‌బీఐ వ్యతిరేకించడం లేదని, అయితే చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలనే కోరుకుంటోందని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నరు ఎం.కె.జైన్‌ స్పష్టం చేశారు. రుణ వసూళ్ల కోసం థర్ద్‌ పార్టీ సంస్థలను నియమించుకోవడంపై మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌పై ఆర్‌బీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాము తీసుకున్న ఈ చర్య.. ప్రత్యేకంగా ఆ ఒక్క సంస్థపైనే అని ఆయన తెలిపారు.

* దుకాణాలు, విక్రయ కేంద్రాల వద్ద ప్రత్యక్ష (ఫేస్‌ టు ఫేస్‌) చెల్లింపులకు వీలు కల్పించే ఆఫ్‌లైన్‌ పేమెంట్‌ అగ్రిగేటర్లను కూడా ఆర్‌బీఐ నియంత్రణ పరిధిలోకి తీసుకురానుంది. ఆన్‌లైన్‌ అగ్రిగేటర్లకు వర్తించే నిబంధనలే వీరికీ వర్తిస్తాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ విక్రయదార్లెవరూ కార్డుదార్ల వివరాలను నిక్షిప్తం చేయడానికి వీలుండదు.

* వినియోగదారులకు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సదుపాయాన్ని అందించే నిమిత్తం గ్రామీణ ప్రాంతీయ బ్యాంకులకు అర్హతా నిబంధనల పరిమితిని సడలిస్తున్నట్లు దాస్‌ చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్‌ బ్యాంకింగ్‌ను విస్తరించే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేస్తామని అన్నారు.

* ఎంపీసీ తదుపరి సమావేశం డిసెంబరు 5- 7 తేదీల్లో జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని