సంక్షిప్త వార్తలు (6)

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఈ ఏడాదిలో చివరిసారిగా డిసెంబరు 14న సమావేశమవుతోంది.

Published : 02 Dec 2022 03:48 IST

ముడి చమురుపై విండ్‌ఫాల్‌ పన్ను సగానికి తగ్గింపు
డీజిల్‌ ఎగుమతులపైనా

దిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసిన ముడి చమురుతో పాటు డీజిల్‌ ఎగుమతులపై విధించిన అదాటు (విండ్‌ఫాల్‌) లాభాల పన్నును ప్రభుత్వం తగ్గించింది. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై  పన్నును టన్నుకు రూ.5,300 తగ్గించి రూ.4,900కు పరిమితం చేసింది. లీటర్‌ డీజిల్‌ ఎగుమతిపై రూ.10.50 గా ఉన్న పన్నును రూ.2.50 తగ్గించి, రూ.8కి పరిమితం చేసింది. సవరించిన పన్ను రేట్లు డిసెంబరు 2 నుంచి అమల్లోకి రానున్నాయి. కొన్ని వారాలుగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కన్పిస్తోంది. పెట్రోలు ఎగుమతులపై పన్ను లేకపోగా, విమాన ఇంధనంపై పన్నును లీటరుకు రూ.5గా కొనసాగించింది. ఈ తగ్గింపు వల్ల చమురు అప్‌స్ట్రీమ్‌ కంపెనీలైన ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా, వేదాంతాతో పాటు ప్రధాన ఇంధన ఎగుమతిదార్లైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, నయారా ఎనర్జీకి సానుకూలం కావచ్చు.


విమాన ఇంధన ధర తగ్గింది

దిల్లీ: అంతర్జాతీయంగా ముడిచమురు ధర తగ్గినందున, దేశీయంగా విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ధరను 2.3 శాతం  తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలు గురువారం ప్రకటించాయి. అంతర్జాతీయ చమురు ధరలు, విదేశీ మారకపు రేట్లకు అనుగుణంగా ప్రతి నెలా 1వ తేదీన ఏటీఎఫ్‌ ధరలను సవరిస్తుంటారు. పెట్రోల్‌, డీజిల్‌ రిటైల్‌, వంటగ్యాస్‌ ధరల్లో మాత్రం వరుసగా ఎనిమిదో నెలా ఎటువంటి మార్పు చేయలేదు. దేశ రాజధానిలో ఏటీఎఫ్‌ ధర కిలోలీటరుకు రూ.2,775 తగ్గి రూ.1,17,587.64కు చేరింది. విమానయాన సంస్థల నిర్వహణా వ్యయంలో సుమారు 40 శాతం ఏటీఎఫ్‌ ఖర్చే ఉంటుంది కనుక, వాటికి ఇది ఊరట కలిగిస్తుంది. గత నెలలోనూ ఏటీఎఫ్‌ ధరను 4.19 శాతం  (కిలో లీటరుకు రూ.4,842.37) మేర తగ్గించారు.


అమెరికాలో గ్రాన్యూల్స్‌ ఇండియా ఫార్మా ప్యాకేజింగ్‌ యూనిట్‌

ఈనాడు, హైదరాబాద్‌: గ్రాన్యూల్స్‌ ఇండియా అమెరికాలోని వర్జీనియాలో ఫార్మాస్యూటికల్‌ ప్యాకేజింగ్‌ యూనిట్‌ను ప్రారంభించింది. వర్జీనియాలోని ప్రిన్స్‌ విలియమ్‌ కౌంటీలో 12.5 మిలియన్‌ డాలర్ల పెట్టుబడితో (దాదాపు రూ.100 కోట్లు) ఈ యూనిట్‌ నిర్మించినట్లు గ్రాన్యూల్స్‌ ఇండియా ఇక్కడ వెల్లడించింది. ఇప్పటి వరకు ప్యాకేజింగ్‌ కార్యకలాపాలను ‘అవుట్‌సోర్స్‌’ చేసుకున్నామని, ఇకపై సొంతంగానే ఈ పనులు నిర్వహించనున్నట్లు పేర్కొంది. దీంతో ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రేడియంట్స్‌) నుంచి ప్యాకేజింగ్‌ వరకు అన్ని రకాల ఔషధ తయారీ కార్యకలాపాలను సొంతంగా నిర్వహిస్తున్నట్లు అవుతుందని గ్రాన్యూల్స్‌ ఇండియా ఎండీ కృష్ణ ప్రసాద్‌ చిగురుపాటి పేర్కొన్నారు.


శిల్ప మెడికేర్‌ యూనిట్‌కు హెల్త్‌ కెనడా అనుమతి

ఈనాడు, హైదరాబాద్‌: శిల్ప మెడికేర్‌కు చెందిన జడ్చర్ల ఫార్మా ఎస్‌ఈజడ్‌లోని యూనిట్‌-4కు కెనడా ఔషధ నియంత్రణ సంస్థ (హెల్త్‌ కెనడా) అనుమతి లభించింది. ఈ ఏడాది సెప్టెంబరులో ఈ యూనిట్‌ను ‘హెల్త్‌ కెనడా’ బృందం పరిశీలించింది. ఈ యూనిట్లో స్టెరైల్‌ ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లు/ కేప్సూల్స్‌ను ఉత్పత్తి చేస్తారు. తాజాగా లభించిన అనుమతితో కెనడాలో మందుల విక్రయాలు చేపట్టే అవకాశం లభిస్తుందని శిల్ప మెడికేర్‌ పేర్కొంది. ఈ నేపథ్యంలో గురువారం బీఎస్‌ఈలో సంస్థ షేరు 8.19% లాభపడి, రూ.304.60 వద్ద స్థిరపడింది.


3 నెలల గరిష్ఠానికి తయారీ పీఎంఐ

దిల్లీ: భారత్‌లో తయారీ కార్యకలాపాలు నవంబరులో 3 నెలల గరిష్ఠానికి చేరాయి. ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా మానుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ సూచీ (పీఎంఐ) అక్టోబరులో 55.3 పాయింట్లుగా నమోదు కాగా, నవంబరులో అది 55.7 పాయింట్లకు చేరింది. వరుసగా 17వ నెలా నిర్వహణ పరిస్థితులు మెరుగ్గా ఉన్నట్లు ఇది సూచిస్తోంది. పీఎంఐ పాయింట్లు 50కి పైన నమోదైతే వృద్ధిగా, 50కి దిగువన నమోదైతే క్షీణతగాను భావిస్తారు. నవంబరులో కొత్త ఆర్డర్లు, ఎగుమతులు పెరగడంతో ఉత్పత్తి పరిమాణం పెరిగింది. దీంతో తయారీ రంగం కళకళలాడింది.


ఫెడ్‌ రేటు మరో అర శాతం పెంపు?

న్యూయార్క్‌: అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఈ ఏడాదిలో చివరిసారిగా డిసెంబరు 14న సమావేశమవుతోంది. ఈ సారి మరో 0.50% మేర వడ్డీరేట్లు పెంచొచ్చని వాల్‌స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. గత మూడు దశాబ్దాల్లోనే అత్యధిక వడ్డీ రేట్ల పెంపులను ఈ ఏడాదిలో ఫెడ్‌ చేపట్టింది. ఇదే ధోరణి కాస్త తక్కువ వేగంతోనైనా.. వచ్చే ఏడాదీ కొనసాగొచ్చన్న అంచనాలున్నాయి. ఆహారం,  దుస్తులు, ముఖ్యంగా ఇంధనం ధరలు ఆకాశాన్నంటడంతో 40 ఏళ్ల గరిష్ఠానికి చేరిన ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఫెడ్‌ రిజర్వ్‌ కఠిన ధోరణిని అవలంబిస్తోంది. మార్చిలో సున్నా స్థాయిలో ఉన్న వడ్డీ రేట్లు ప్రస్తుతం 3.75-4 శాతం స్థాయికి చేరాయి. 2023లో ఇవి 5 శాతం కంటే ఎగువకు వెళ్లే అవకాశమూ ఉందంటున్నారు. కరోనా పరిణామాల నుంచి ఆర్థిక వ్యవస్థ బయటపడడంతో, పెరిగిన గిరాకీకి అనుగుణంగా సరఫరా వ్యవస్థలు నెలకొనలేదు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వల్ల ఏర్పడిన పరిస్థితులూ ధరలు పెరిగేందుకు కారణమయ్యాయి. అందుకే ద్రవ్యోల్బణం శాంతించే వరకు వడ్డీ రేట్లను పెంచుకుంటూ వెళ్లేందుకే ఫెడ్‌ సుముఖంగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని