చైనా నుంచి నెట్‌వర్క్‌ గేర్‌

పొరుగు దేశాల నుంచి టెలికాం రంగ నిబంధనలను పాటించని వస్తువుల దిగుమతులకు అడ్డుకట్ట వేసే విధానాన్ని ప్రభుత్వం ఆవిష్కరించనున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పేర్కొన్నారు.

Published : 04 Dec 2022 02:34 IST

దిగుమతులపై గట్టి నిఘా
మరింత కఠినంగా తనిఖీలు

దిల్లీ: పొరుగు దేశాల నుంచి టెలికాం రంగ నిబంధనలను పాటించని వస్తువుల దిగుమతులకు అడ్డుకట్ట వేసే విధానాన్ని ప్రభుత్వం ఆవిష్కరించనున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పేర్కొన్నారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకానికి అర్హత పొందిన టెలికాం గేర్‌ తయారీ కంపెనీలకు చెందిన 40 మందికి పైగా సీఈఓలతో మంత్రి ఒక సమావేశాన్ని  నిర్వహించారు. వీరికి మార్కెట్‌ నుంచి మద్దతు లభించేలా 4-5 కార్యాచరణ బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఆర్థిక వ్యవస్థకు విలువ జోడించేలా, వీరి వ్యాపారాన్ని సజావుగా నిర్వహించుకునేలా మద్దతు ఇస్తామన్నారు. చైనా నుంచి నెట్‌వర్క్‌ గేర్ల(నెట్‌వర్క్‌ అనుసంధానానికి వినియోగించే పరికరాల) దిగుమతిపై దేశీయ టెలికాం గేర్‌ తయారీదార్లు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో మంత్రి పై విధంగా స్పందించారు. టెలికాం పీఎల్‌ఐ కింద ఉన్న కంపెనీలు గేర్ల ఎగుమతిని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయని.. త్వరలోనే భారత్‌ ఒక ఎగుమతి దేశంగా మారుతుందని మంత్రి పేర్కొన్నారు. రూ.4,115 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడ్డ 42 కంపెనీలను పీఎల్‌ఐ పథకానికి టెలికాం విభాగం(డాట్‌) ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా అదనంగా రూ.2.45 లక్షల కోట్ల విక్రయాలు; 44,000 మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయన్న అంచనాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని