వెండి దిగుమతులపై భారం

బంగారం, వెండి, ప్లాటినం దిగుమతులకు సంబంధించి సుంకాల్లో స్వల్ప మార్పులను ఆర్థిక మంత్రి చేశారు. అన్ని లోహాలకు బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీ (బీసీడీ) ఒకేరకంగా 10 శాతం చేశారు.

Updated : 02 Feb 2023 03:30 IST

ఈనాడు వాణిజ్య విభాగం: బంగారం, వెండి, ప్లాటినం దిగుమతులకు సంబంధించి సుంకాల్లో స్వల్ప మార్పులను ఆర్థిక మంత్రి చేశారు. అన్ని లోహాలకు బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీ (బీసీడీ) ఒకేరకంగా 10 శాతం చేశారు. అయితే ఏఐడీసీ (వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సుంకం), ఎస్‌డబ్ల్యూఎస్‌ (సామాజిక సంక్షేమ సర్‌ఛార్జ్‌)లలో మార్పులు చేశారు. ఇప్పటివరకు వెండి కడ్డీల దిగుమతిపై సుంకాలన్నీ కలిపి 10.75% అవుతుండగా, ఇకపై 15 శాతం కానుంది. ముడి వెండి (సిల్వర్‌ దోరె) దిగుమతిపై సుంకాలు 9.21% గా ఉండగా, ఇకపై 14.35 శాతం అవుతుంది. అమెరికా, జర్మనీల తరవాత వెండిని లోహం రూపంలో అత్యధికంగా కొనుగోలు చేసేది మన దేశమే. 2022లో మనదేశం 8,000 టన్నుల వెండిని దిగుమతి చేసుకుందని అంచనా.

విదేశాల్లో విలువైన లోహాలతో తయారు చేస్తున్న ఆభరణాలు, వస్తువుల దిగుమతిపై ఇప్పటివరకు 22% సుంకం విధిస్తుండగా, దీనిని 25 శాతానికి పెంచారు. దేశీయ తయారీని ప్రోత్సహించడమే లక్ష్యమని తెలిపారు.

వజ్రాల తయారీకి అవసరమైన సీడ్స్‌పై సుంకం తొలగింపు

దేశీయంగా ప్రయోగశాలల్లో వజ్రాల (ఎల్‌జీడీ) తయారీని మరింతగా ప్రోత్సహించేందుకు, సంబంధిత ముడిపదార్థాల (సీడ్స్‌) దిగుమతిపై 5 శాతంగా ఉన్న బేసిక్‌ కస్టమ్స్‌ సుంకాన్ని పూర్తిగా తొలగించారు. సహజసిద్ధ వజ్రాల కటింగ్‌, పాలిషింగ్‌ ప్రపంచవ్యాప్త వ్యాపారంలో నాలుగింట మూడొంతుల వ్యాపారం మనదేశమే చేస్తోందని ఆర్థిక మంత్రి తెలిపారు. సహజ వజ్రాల నిక్షేపాలు తగ్గుతున్నందున, ప్రయోగశాలల్లో తయారీ అధికమవుతోందన్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకే ఈ రాయితీ కల్పిస్తున్నట్లు వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు