మిశ్రమంగానే సూచీలు
బడ్జెట్ రోజు లాగానే, గురువారమూ దేశీయ సూచీలు మిశ్రమంగా ముగిశాయి. గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూపు కంపెనీల షేర్లకు నష్టాల పరంపర కొనసాగుతోంది.
కొనసాగిన అదానీ గ్రూపు కంపెనీల షేర్ల పతనం
అదానీ ఎంటర్‌ప్రైజెస్ 26% క్షీణత
6 రోజుల్లో రూ.8.76 లక్షల కోట్ల మార్కెట్ విలువ ఆవిరి
సమీక్ష
బడ్జెట్ రోజు లాగానే, గురువారమూ దేశీయ సూచీలు మిశ్రమంగా ముగిశాయి. గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూపు కంపెనీల షేర్లకు నష్టాల పరంపర కొనసాగుతోంది. మలివిడత పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీఓ)ను రద్దు చేసుకుని, మదుపర్లకు సత్వరం సొమ్ము వాపసు ఇస్తామని ప్రకటించిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు బీఎస్‌ఈలో 26.50% పతనమై రూ.1,564.70 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 28.88 శాతం వరకు నష్టపోయింది. ఈ ప్రభావం నిఫ్టీ సూచీని వెనక్కి లాగింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో అదానీ గ్రూపు షేర్లేవీ లేకపోవడంతో ఈ సూచీ లాభాల్లో ముగియగా.. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ షేర్లున్న నిఫ్టీ స్వల్ప నష్టాల్లో ముగిసింది. అదానీ గ్రూపులోని అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్ షేర్లు లోయర్ సర్క్యూట్ అయిన 10% నష్టపోయాయి. అదానీ పోర్ట్స్ 6.13%, అదానీ విల్మర్ 5%, ఎన్‌డీటీవీ 4.99%; అదానీ పవర్ 4.98 శాతం నష్టపోయాయి. అయితే అదానీ గ్రూపు ఇటీవలే కొనుగోలు చేసిన అంబుజా సిమెంట్స్ 5.33%, ఏసీసీ 0.05% మేర లాభపడ్డాయి. 6 రోజుల వరుస పతనంతో అదానీ గ్రూపు కంపెనీల మార్కెట్ విలువ ఇప్పటివరకు 8.76 లక్షల కోట్ల (100 బిలియన్ డాలర్ల) మేర తగ్గింది. ఇందువల్ల సామాన్య మదుపర్లూ భారీగా నష్టపోతున్నారు.
ఒడుదొడుకుల మధ్య...
ఉదయం సెన్సెక్స్ 59,459.87 పాయింట్ల వద్ద నష్టాల్లో ఆరంభమైంది. అంచనా మేరకే అమెరికా ఫెడ్ వడ్డీ రేటును 0.25 శాతమే పెంచినా, మన 2023-24 బడ్జెట్ వృద్ధికి ఊతమిచ్చేలానే ఉందని పరిశ్రమ వర్గాలు భావించినా మదుపర్లు తొలుత అమ్మకాలకే మొగ్గుచూపారు. ఆ తర్వాత కొనుగోళ్లతో సూచీ లాభాల్లోకి వచ్చినప్పటికీ ఒడుదొడుకుల మధ్యే కదలాడింది. చివరకు 224.16 పాయింట్ల లాభంతో.. 59,932.24 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సూచీ 60007.67 వద్ద గరిష్ఠ స్థాయిని తాకింది. నిఫ్టీ స్వల్పంగా 5.9 పాయింట్లు నష్టపోయి 17,610.40 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 40 పైసలు తగ్గి 82.20 వద్ద ముగిసింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 0.29 శాతం తగ్గి 82.78 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్, సింగపూర్ సూచీలు మినహా మిగతావి లాభాల్లోనే ముగిశాయి. ఐరోపా మార్కెట్లూ సానుకూలంగానే మొదలయ్యాయి.
17 రాణించాయ్: బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 17 రాణించగా.. 13 డీలాపడ్డాయి. ఐటీసీ 4.74%, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 3.25%, హిందుస్థాన్ యునిలీవర్ 2.46%, ఇన్ఫోసిస్ 2.18 శాతం లాభపడ్డాయి. నష్టపోయిన వాటిల్లో ఎన్‌టీపీసీ (1.97%), హెచ్‌డీఎఫ్‌సీ (1.85%), టైటన్ (1.8%), టాటా స్టీల్ (1.76%), పవర్ గ్రిడ్ (1.75%) ఉన్నాయి. రంగాల సూచీల్లో ఎఫ్‌ఎమ్‌సీజీ, ఐటీ, టెక్నాలజీ, ఇండస్ట్రియల్స్, బ్యాంకెక్స్ సానుకూలంగా ముగియగా.. యుటిలిటీస్, విద్యుత్, చమురు-గ్యాస్, లోహ, ఇంధన సూచీలు ప్రతికూలంగా ముగిశాయి.
* అక్టోబరు- డిసెంబరు లాభంలో భారీ వృద్ధి నమోదు చేసిన అశోక్ లేలాండ్ షేరు బీఎస్‌ఈలో 2.95% పెరిగి రూ.152.05 వద్ద ముగిసింది.
* బ్రిటన్‌లో వడ్డీరేటు 0.50% పెంపు: ద్రవ్యోల్బణంతో పోరాటంలో భాగంగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కీలక వడ్డీ రేటును అర శాతం పెంచి 4 శాతానికి చేర్చింది. బ్రిటన్ కేంద్ర బ్యాంకు కూడా ఇంత అధికంగా వడ్డీ రేటును పెంచడం ఇదే చివరిసారి కావొచ్చని అక్కడి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డిసెంబరులో ద్రవ్యోల్బణం కాస్త నెమ్మదించడమే ఇందుకు నేపథ్యం.
నేటి బోర్డు సమావేశాలు: ఎస్‌బీఐ, ఐటీసీ, దివీస్, ఇండిగో, మారికో, మెడ్‌ప్లస్, పేటీఎం, టాటా పవర్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
ashok chavan: మోదీ బండారం బయటపడుతుందనే రాహుల్‌పై అనర్హత: అశోక్ చవాన్
-
India News
అగ్గి చల్లారిందా..? రాహుల్-ఉద్ధవ్ మధ్య ‘సావర్కర్ వివాదం’ సద్దుమణిగిందా..?
-
General News
Viveka Murder Case: ముందస్తు బెయిల్ ఇవ్వండి.. హైకోర్టును ఆశ్రయించిన అవినాష్‌రెడ్డి
-
Movies News
Social Look: పల్లెటూరి అమ్మాయిగా దివి పోజు.. శ్రీముఖి ‘పింక్’ పిక్స్!
-
World News
Mexico-US Border: శరణార్థి శిబిరంలో ఘోర అగ్నిప్రమాదం.. 39 మంది మృతి..!
-
Sports News
Cricket: నాన్‌స్ట్రైకర్ రనౌట్.. బ్యాట్ విసిరి కొట్టిన బ్యాటర్