ముడి చమురుపై విండ్‌ఫాల్‌ పన్ను పెంపు

దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుతో పాటు డీజిల్‌, విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ఎగుమతులపైనా అదాటు (విండ్‌ఫాల్‌) లాభాల పన్నును ప్రభుత్వం పెంచింది. అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది.

Published : 06 Feb 2023 02:25 IST

డీజిల్‌, ఏటీఎఫ్‌ ఎగుమతులపైనా

దిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుతో పాటు డీజిల్‌, విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ఎగుమతులపైనా అదాటు (విండ్‌ఫాల్‌) లాభాల పన్నును ప్రభుత్వం పెంచింది. అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఓఎన్‌జీసీ లాంటి కంపెనీలు దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై పన్ను ప్రస్తుతం టన్నుకు రూ.1,900 ఉండగా, ఏకంగా రూ.3,150 పెంచి రూ.5,050 చేసింది. డీజిల్‌ ఎగుమతులపై పన్ను లీటరుకు రూ.5 నుంచి రూ.7.5కు పెంచింది. ఏటీఎఫ్‌ ఎగుమతులపైనా పన్నును లీటరుకు రూ.3.50 నుంచి పెంచి     రూ.6 చేసింది. కొత్త పన్ను రేట్లు ఫిబ్రవరి 4 నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రతి 15 రోజులకోసారి విండ్‌ఫాల్‌ పన్నులో ప్రభుత్వం మార్పులు చేస్తోంది. గత సమీక్ష సమయంలో అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడంతో, పన్ను రేట్లను తగ్గించింది. ఆ తర్వాత నుంచి చమురు ధరలు పెరగడంతో ప్రస్తుత మార్పులు చేసింది. పెట్రోలు ఎగుమతులపై మాత్రం పన్ను విధించడం లేదు.


సంక్షిప్తంగా..

* వచ్చే 12-18 నెలల్లో ఉత్పత్తి సామర్థ్యాలను పెంచేందుకు ఫోర్డ్‌ సనంద్‌ ప్లాంట్‌ కార్యకలాపాలను ప్రారంభించడానికి చూస్తున్నట్లు టాటా మోటార్స్‌ ప్రయాణికుల వాహన విభాగ అధిపతి శైలేశ్‌ చంద్రా పేర్కొన్నారు. గత ఏడాది ఆగస్టులో ఫోర్డ్‌ సనంద్‌ తయారీ ప్లాంట్‌ను రూ.726 కోట్లకు టాటాలు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. సనంద్‌ ప్లాంట్‌ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 3 లక్షల యూనిట్లుగా ఉంది.

* 2022లో భారత ముడి ఉక్కు ఉత్పత్తి 5.80 శాతం పెరిగి 124.45 మిలియన్‌ టన్నులకు చేరినట్లు స్టీల్‌మింట్‌ తాజా నివేదిక పేర్కొంది. 2021లో భారత్‌ 117.63 మి.టన్నుల ముడి ఉక్కును ఉత్పత్తి చేసింది. ఫినిష్డ్‌ ఉక్కు ఉత్పత్తి 104.54 మి.టన్నుల నుంచి 110.03 మి.టన్నులకు పెరిగింది. ఫినిష్డ్‌ ఉక్కు వినియోగం 98.39 మి.టన్నుల నుంచి 8 శాతం పెరిగి 106.48 మి.టన్నులకు చేరింది.

* వచ్చే ఆర్థిక సంవత్సరంలో శుద్ధ ఇంధన రుణ సంస్థ ఐఆర్‌ఈడీఏ, ఇంజినీరింగ్‌ కన్సల్టెన్సీ సంస్థ వాప్కోస్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)లను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు దీపం కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే పేర్కొన్నారు. వచ్చే బడ్జెట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.51,000 కోట్ల సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది.

* బలమైన గృహ గిరాకీ నేపథ్యంలో వ్యాపార విస్తరణకు గోద్రేజ్‌ ప్రోపర్టీస్‌ సిద్ధమైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 15 స్థలాలను కొనుగోలు చేసింది. వీటితో రూ.27,500 కోట్ల విక్రయాలు జరుగుతాయని ఆశిస్తోంది. మార్చికి కొత్త ప్రాజెక్ట్‌ల నిర్మాణం కోసం మరిన్ని భూములు కొనుగోలు చేయాలని భావిస్తోంది.

* రుణాల లభ్యత, అందుబాటు పెంచేందుకు నేషనల్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌ఫర్మేషన్‌ రిజిస్ట్రీ (ఎన్‌ఎఫ్‌ఐఆర్‌)ను ఏర్పాటు చేయడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ముసాయిదా బిల్లు రూపొందించినట్లు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్‌ సేథ్‌ పేర్కొన్నారు. గత ఏడాది సెప్టెంబరులో ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి మండలి సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రుణ రిపాజిటరీ ఏర్పాటు ప్రతిపాదనపై చర్చించినట్లు తెలిపారు. ఆర్‌బీఐ రూపొందించిన బిల్లుపై చర్చలు నడుస్తున్నట్లు వివరించారు.

* మ్యాక్స్‌ గ్రూప్‌ సంస్థ మ్యాక్స్‌ వెంచర్స్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ గురుగ్రామ్‌లో అభివృద్ది చేస్తున్న వాణిజ్య ప్రాజెక్ట్‌లో 49 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు రూ.290 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు న్యూయార్క్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తెలిపింది. గతేడాది సెప్టెంబరు ఎకరేజ్‌ బిల్డర్స్‌ను రూ.322.50 కోట్లకు మ్యాక్స్‌ ఎస్టేట్స్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని