ప్రవాసుల నుంచి రూ.9.20 లక్షల కోట్లు

ప్రవాసులు 2022లో మన దేశంలోని కుటుంబీకులు, సన్నిహితులకు 111 బిలియన్‌ డాలర్ల  (సుమారు రూ.9.2 లక్షల కోట్ల)ను బదిలీ చేశారు. వృత్తి, వ్యాపారాల నిమిత్తం ఒక దేశం నుంచి తరలి వెళ్లి, వివిధ దేశాల్లో నివశిస్తున్న వారు.. తమ స్వదేశానికి పంపిన అత్యధిక మొత్తం ఇదే.

Published : 09 May 2024 02:01 IST

2022లో భారత్‌కు చేరాయ్‌: యూఎన్‌
ఈ స్థాయిలో మరే దేశానికి చేరలేదు

దిల్లీ: ప్రవాసులు 2022లో మన దేశంలోని కుటుంబీకులు, సన్నిహితులకు 111 బిలియన్‌ డాలర్ల  (సుమారు రూ.9.2 లక్షల కోట్ల)ను బదిలీ చేశారు. వృత్తి, వ్యాపారాల నిమిత్తం ఒక దేశం నుంచి తరలి వెళ్లి, వివిధ దేశాల్లో నివశిస్తున్న వారు.. తమ స్వదేశానికి పంపిన అత్యధిక మొత్తం ఇదే. ఒక ఏడాదిలోనే 100 బిలియన్‌ డాలర్ల ప్రవాస నిధుల మైలురాయిని అందుకున్న తొలి దేశంగా భారత్‌ నిలిచిందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ మైగ్రేషన్‌ తన నివేదికలో పేర్కొంది.

ప్రవాసులు అత్యధికంగా నిధులు పంపిన దేశాల్లో భారత్‌, మెక్సికో, చైనా, ఫిలిప్పిన్స్‌, ఫ్రాన్స్‌.. తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. చైనా కొన్నేళ్లపాటు ద్వితీయ స్థానంలో నిలవగా, 2021 నుంచి ఆ స్థానాన్ని మెక్సికో ఆక్రమించింది. 2022లో మెక్సికోకు ప్రవాసుల నుంచి 61 బి.డాలర్లు రాగా.. చైనా 51 బి.డాలర్లు అందుకుంది. ప్రవాస నిధులపరంగా 2010లో (53.48 బిలియన్‌ డాలర్లు), 2015లో (68.91 బి.డాలర్లు), 2020లో (83.15 బి.డాలర్లు) అగ్రస్థానంలో నిలిచిన భారత్‌.. 2022లో 100 బిలియన్‌ డాలర్ల మైలురాయిని అధిగమించి ఆ స్థానాన్ని నిలబెట్టుకుందని నివేదిక తెలిపింది.

దక్షిణాసియా ప్రాంతం నుంచే ఎక్కువ

దక్షిణాసియా ప్రాంతం నుంచి, వృత్తి-వ్యాపారాల నిమిత్తం ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుండటంతో.. ప్రపంచవ్యాప్తంగా ప్రవాసుల నుంచి ఈ ప్రాంతమే ఎక్కువగా నిధులు అందుకుంటోందని నివేదిక పేర్కొంది. ప్రవాసులు ఎక్కువగా నిధులు పంపిస్తున్న తొలి 10 దేశాల్లో దక్షిణాసియా ప్రాంతం నుంచే మూడు దేశాలు- భారత్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచి కార్మిక వలసలూ అధికంగా ఉంటున్నాయి. 2022లో ప్రవాస నిధులపరంగా పాకిస్తాన్‌ ఆరో స్థానంలో (30 బిలియన్‌ డాలర్లు), బంగ్లాదేశ్‌ (21.5 బి.డాలర్లు) ఎనిమిదో స్థానంలో ఉన్నాయి.

గల్ఫ్‌ దేశాలకు అధికం

వలస కార్మికులకు గల్ఫ్‌ దేశాలే ప్రధాన గమ్యస్థానాలుగా కొనసాగుతున్నాయని నివేదిక తెలిపింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ మొత్తం జనాభాలో 88% మంది వలస వచ్చిన ప్రజలే కాగా.. కువైట్‌, ఖతార్‌లో ఈ సంఖ్య వరుసగా 73%, 77 శాతంగా ఉంది. భారత్‌ నుంచి సుమారు 1.8 కోట్లు లేదా మొత్తం జనాభాలో 1.3% మంది ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారని, వీళ్లలో ఎక్కువ మంది యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, అమెరికా, సౌదీ అరేబియాల్లో నివసిస్తున్నారని నివేదిక తెలిపింది. మరోవైపు వలసలకు గమ్యస్థానంలో భారత్‌ 13వ స్థానంలో ఉంది. మొత్తంగా 44.80 లక్షల మంది భారత్‌కు వలస వచ్చారు. భారత్‌ నుంచి వలస వెళ్లిన వారిలో పురుషుల కంటే మహిళల శాతమే స్వల్పంగా ఎక్కువ అని నివేదిక పేర్కొంది.

విద్యార్థులూ అక్కడి నుంచే

చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్తున్న వారి సంఖ్య విషయంలోనూ ఆసియా దేశాలే ముందు వరసలో ఉన్నాయి. 2021లో చైనా నుంచి 10 లక్షల మందికి పైగా విద్యార్థులు విదేశాలకు చదువుల నిమిత్తం వలస వెళ్లారు. ఈ విషయంలో భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ నుంచి సుమారు 5,08,000 మంది చదువుల కోసం విదేశాల బాట పట్టారు. వలస విద్యార్థులకు గమ్యస్థానాల్లో అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. ఈ దేశానికి సుమారు 8,33,000 మంది విద్యార్థులు వివిధ దేశాల నుంచి చదువుకునేందుకు వెళ్లారు. ఆ తర్వాతి స్థానాల్లో బ్రిటన్‌ (6,01,000), ఆస్ట్రేలియా (3,78,000), జర్మనీ (3,76,000), కెనడా (3,18,000) ఉన్నాయి. మరోవైపు రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా, థాయ్‌లాండ్‌, పాకిస్తాన్‌, భారత్‌ లాంటి దేశాల్లోని విద్యార్థులకు చైనా కూడా ప్రధాన గమ్యస్థానంగా మారిందని నివేదిక తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని