సంక్షిప్త వార్తలు(7)

ఇంజినీరింగ్‌, నిర్మాణ రంగ దిగ్గజ సంస్థ ఎల్‌అండ్‌టీ జనవరి- మార్చి త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన రూ.4,396.12 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,986.78 కోట్లతో పోలిస్తే ఇది 10.2% అధికం.

Updated : 09 May 2024 02:28 IST

ఎల్‌అండ్‌టీ తుది డివిడెండు 1400%

దిల్లీ: ఇంజినీరింగ్‌, నిర్మాణ రంగ దిగ్గజ సంస్థ ఎల్‌అండ్‌టీ జనవరి- మార్చి త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన రూ.4,396.12 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,986.78 కోట్లతో పోలిస్తే ఇది 10.2% అధికం. ఇదే సమయంలో ఆదాయం రూ.59,076.06 కోట్ల నుంచి రూ.68,120.42 కోట్లకు పెరిగింది. ‘గత ఆర్థిక సంవత్సరాన్ని అద్భుతంగా ముగించాం. రూ.3 లక్షల కోట్లకు పైగా కొత్త ఆర్డర్లు లభించడంతో, మా వద్ద ఉన్న మొత్తం ఆర్డర్ల విలువ రూ.4.75 లక్షల కోట్లకు చేరింది. క్లయింట్లలో కంపెనీపై ఉన్న స్థిరమైన విశ్వాసానికి ఇది నిదర్శనమ’ని ఎల్‌అండ్‌టీ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టరు ఎస్‌.ఎన్‌.సుబ్రమణ్యన్‌ తెలిపారు. వాటాదార్ల విలువను పెంచే లక్ష్యంతో కంపెనీ తొలి షేర్ల బైబ్యాక్‌ ప్రక్రియనువిజయవంతంగా పూర్తి చేసిందని పేర్కొన్నారు.

  • 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.28 (1400%) తుది డివిడెండును బోర్డు సిఫారసు చేసింది.
  • 2023-24లో రూ.3,02,812 కోట్ల కొత్త ఆర్డర్లను ఎల్‌అండ్‌టీ దక్కించుకుంది. 2022-23తో పోలిస్తే ఈ విలువ 31 శాతం ఎక్కువ. ఇందులో అంతర్జాతీయ ఆర్డర్ల విలువ రూ.1,63,112 కోట్లు కాగా.. మొత్తం ఆర్డర్ల విలువలో ఇది 53 శాతమని కంపెనీ తెలిపింది. ఇందులోనూ అత్యధిక ఆర్డర్లు గల్ఫ్‌ దేశాల నుంచే వచ్చాయి. 2023-24లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల విభాగం రూ.1,42,589 కోట్ల ఆర్డర్లను పొందింది. 2022-23తో పోలిస్తే ఈ విలువ 22% అధికం. ఇంధన ప్రాజెక్టుల విభాగం రూ.73,788 కోట్ల ఆర్డర్లను పొందగా.. 2022-23తో పోలిస్తే ఈ విలువ 100% కంటే ఎక్కువే.

హైదరాబాద్‌ మెట్రో పునర్‌ వ్యవస్థీకరణ: 2024-25పై ఆశావహ దృక్పథంతోనే కంపెనీ ఉందని సుబ్రమణ్యన్‌ తెలిపారు. వాటా ఉపసంహరణ ప్రణాళికలపై స్పందిస్తూ... ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రధానంగా హైదరాబాద్‌ మెట్రో పునర్‌వ్యవస్థీకరణపై దృష్టి పెడతామని తెలిపారు. 2025 మార్చి కల్లా అయోధ్య రామ్‌ మందిర్‌ నిర్మాణం పూర్తవుతుందని అన్నారు.


హీరో మోటోకార్ప్‌ లాభం రూ.943 కోట్లు

తుది డివిడెండు రూ.40

దిల్లీ: ద్విచక్ర వాహన దిగ్గజ సంస్థ హీరో మోటోకార్ప్‌నకు విక్రయాలు కలిసివచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో హీరో మోటోకార్ప్‌ ఏకీకృత నికర లాభం రూ.943.46 కోట్లకు చేరుకుంది. 2022-23 ఇదే కాల లాభం రూ.810.8 కోట్లతో పోలిస్తే ఇది 16.7% అధికం. ఇదే సమయంలో ఏకీకృత ఆదాయం రూ.8,434.28 కోట్ల నుంచి రూ.9,616.68 కోట్లకు చేరుకుంది. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ 13.92 లక్షల మోటార్‌ సైకిళ్లు, స్కూటర్లు విక్రయించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో వీటి అమ్మకాలు 12.7 లక్షలుగా ఉన్నాయి. మొత్తం వ్యయాలు రూ.7,508.94 కోట్ల నుంచి రూ.8,427.36 కోట్లకు పెరిగాయి.
పూర్తి ఆర్థిక సంవత్సరానికి: 2023-24లో కంపెనీ రూ.37,788.62 కోట్ల ఏకీకృత ఆదాయంపై రూ.3,742.16 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 2022-23లో రూ.34,158.38 కోట్ల ఆదాయంపై రూ.2,799.9 కోట్ల లాభం కనిపించింది. ఇదే సమయంలో అమ్ముడైన వాహనాల సంఖ్య 53.29 లక్షల నుంచి 56.21 లక్షలకు చేరింది.

మొత్తం డివిడెండు రూ.140: భవిష్యత్తులోనూ స్థూల ఆర్థిక అంశాలు పరిశ్రమ వృద్ధికి సహాయపడగలవని కంపెనీ సీఎఫ్‌ఓ నిరంజన్‌ గుప్తా పేర్కొన్నారు. ‘ముడి పదార్థాల ధరలు స్థిరంగా ఉండడంతో పాటు, వర్షపాతం సాధారణ స్థాయిలో నమోదవుతుందన్న అంచనాలు, ప్రభుత్వ వ్యయాలు పెరిగే అవకాశాల వంటివి రాబోయే త్రైమాసికాల్లో వాహన అమ్మకాలకు చేదోడుగా నిలవవచ్చని అన్నారు.

  • రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.40 తుది డివిడెండును కంపెనీ బోర్డు ప్రతిపాదించింది. ఇంతకుముందు ప్రకటించిన రూ.100 ప్రత్యేక డివిడెండ్‌తో కలిపి 2023-24కు మొత్తం డివిడెండు రూ.140కు చేరింది.
  • మెరుగైన ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో షేరు ధర 3.26% పెరిగి రూ.4624.35 వద్ద ముగిసింది. మార్కెట్‌ విలువ రూ.2922.86 కోట్లు పెరిగి రూ.92,450.81 కోట్లకు చేరుకుంది.

టాటా పవర్‌ లాభం రూ.1,046 కోట్లు

దిల్లీ: టాటా పవర్‌, మార్చి త్రైమాసికంలో  రూ.1,046 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.939 కోట్లతో పోలిస్తే ఇది 11% ఎక్కువ. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.13,325.30 కోట్ల నుంచి రూ.16,463.94 కోట్లకు వృద్ధి చెందింది. పూర్తి ఆర్థిక సంవత్సరం (2023-24)లో కంపెనీ నికర లాభం రికార్డు స్థాయిలో రూ.4,280 కోట్లకు చేరింది. 2022-23లో ఇది రూ.3,810 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం రూ.56,547.10 కోట్ల నుంచి రూ.63,272.32 కోట్లకు పెరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.1 ముఖవిలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.2 (200%) డివిడెండ్‌ను బోర్డు సిఫారసు చేసింది. ఇందుకు రికార్డు తేదీగా జులై 4ను నిర్ణయించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో రూ.20,000 కోట్ల మూలధన వ్యయాలకు టాటా పవర్‌ ప్రణాళికలు రూపొందించింది. గత ఆర్థిక సంవత్సరంలో చేసిన రూ.12,000 కోట్ల వ్యయాలతో పోలిస్తే ఇవి 66% అధికం. 2070కు సున్నా ఉద్గారాల లక్ష్యం, హరిత ప్రాజెక్టులపై దృష్టి పెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది.


విజయ డయాగ్నొస్టిక్‌ లాభం రూ.33.45 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి విజయ డయాగ్నొస్టిక్‌ సెంటర్‌ రూ.155.21 కోట్ల ఆదాయాన్ని, రూ.33.45 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదేకాలంలో ఆదాయం రూ.120.99 కోట్లు, నికరలాభం రూ.27.49 కోట్లు ఉన్నాయి. దీంతో  పోల్చితే ఈసారి ఆదాయం     28.3%, నికరలాభం 21.7% పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి సంస్థ రూ.547.81 కోట్ల ఆదాయాన్ని, రూ.118.83 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2022-23తో పోల్చితే ఆదాయం 19.3%, నికరలాభం 40.4% పెరిగాయి.


వాహన రిటైల్‌ విక్రయాలు పెరిగాయ్‌: ఫాడా

దిల్లీ: దేశంలో వాహన రిటైల్‌ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన ఏప్రిల్‌లో 27% పెరిగి 22,06,070కి చేరాయని పరిశ్రమ సమాఖ్య ఫాడా బుధవారం వెల్లడించింది. ప్రయాణికుల వాహనాలు (కార్లు, ఎస్‌యూవీలు, వ్యాన్లు), ద్విచక్ర వాహనాలతో పాటు అన్ని విభాగాల్లో వృద్ధి నమోదైందని పేర్కొంది. 2023 ఏప్రిల్‌లో రిటైల్‌ విక్రయాలు 17,40,649గా ఉన్నాయి. ‘ద్విచక్ర వాహనాలకు గిరాకీ బాగా పెరిగింది. 125 సీసీ మోడళ్లకు ఆదరణ బాగుండటంతో పాటు వాటి సరఫరా పెరగడంతో, విక్రయాలు అధికమయ్యాయి. సానుకూల మార్కెట్‌ సెంటిమెంట్‌, స్థిరమైన ఇంధన ధరలు, అనుకూల రుతుపవనాల అంచనాలు, పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌ వంటివి వాహనాలకు గిరాకీ పెరిగేందుకు దోహదం చేశాయ’ని ఫాడా ప్రెసిడెంట్‌ మనీశ్‌ రాజ్‌ సింఘానియా వెల్లడించారు.


15% పెరిగిన టీవీఎస్‌ మోటార్‌ లాభం

దిల్లీ: టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.387 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.336 కోట్లతో పోలిస్తే ఇది 15% అధికం. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.8,031 కోట్ల నుంచి రూ.10,042 కోట్లకు పెరిగింది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం ద్విచక్ర, త్రిచక్ర వాహనాల విక్రయాలు (ఎగమతులతో కలిపి) 22% పెరిగి 10.63 లక్షలకు చేరాయి. 2022-23 ఇదే త్రైమాసికంలో విక్రయాలు 8.68 లక్షలుగా ఉన్నాయి.

2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఏకీకృత నికర లాభం రూ.1,329 కోట్ల నుంచి రూ.1,686 కోట్లకు పెరిగింది. కార్యకలాపాల ఆదాయం రూ.31,974 కోట్ల నుంచి రూ.39,145 కోట్లకు చేరింది. గతంలో ఎన్నడూ లేనంతగా, గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం, లాభం నమోదయ్యాయని కంపెనీ తెలిపింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 40 లక్షలకు పైగా వాహనాలను విక్రయించినట్లు పేర్కొంది. 2023-24లో ద్విచక్ర, త్రిచక్ర వాహనాల విక్రయాలు 41.91 లక్షలుగా నమోదయ్యాయి. 2022-23లో నమోదైన 36.82 లక్షల వాహన విక్రయాలతో పోలిస్తే ఇవి 14% అధికం.


భారత్‌ ఫోర్జ్‌ లాభంలో 77% వృద్ధి

దిల్లీ: వాహన విడిభాగాల తయారీ దిగ్గజం భారత్‌ ఫోర్జ్‌, జనవరి- మార్చి త్రైమాసికంలో ఏకీకృత పద్ధతిలో రూ.227.12 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.127.74 కోట్లతో పోలిస్తే ఇది 77.8% ఎక్కువ. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.3,629.05 కోట్ల నుంచి రూ.4,164.21 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలూ రూ.3,469.05 కోట్ల నుంచి రూ.3,843.55 కోట్లకు పెరిగాయి. పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2023-24) కంపెనీ రూ.910.16 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 లాభం రూ.508.39 కోట్లతో పోలిస్తే బాగా పెరిగింది. కార్యకలాపాల ఆదాయం రూ.12,910.26 కోట్ల నుంచి రూ.15,682.07 కోట్లకు చేరింది. రక్షణ ఎగుమతి ఆర్డర్ల సరఫరాను కంపెనీకి చెందిన కల్యాణి స్ట్రాటజిక్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ పూర్తి చేయడం, అన్ని వ్యాపార విభాగాలు ఎగుమతుల పరంగా రాణించడంతో మెరుగైన ఆర్థిక ఫలితాలను నమోదు చేయగలిగామని భారత్‌ ఫోర్జ్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టరు బి.ఎన్‌.కల్యాణి తెలిపారు.

పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేరుకు రూ.6.50 (325%) తుది డివిడెండును కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని