ఏప్రిల్‌లో శాకాహారం 8% ప్రియం

ఉల్లిపాయలు, టమోటాల ధరలు పెరగడంతో గత నెలలో వెజిటేరియన్‌ (శాకాహార) థాలీ సగటు ధర సుమారు 8% పెరిగిందని క్రిసిల్‌ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ అనాలసిస్‌ నెలవారీ ‘రోటీ రైస్‌ రేట్‌’ నివేదిక వెల్లడించింది.

Published : 09 May 2024 01:54 IST

మాంసాహారం ధర తగ్గింది
‘రోటీ రైస్‌ రేట్‌’ నివేదిక

ముంబయి: ఉల్లిపాయలు, టమోటాల ధరలు పెరగడంతో గత నెలలో వెజిటేరియన్‌ (శాకాహార) థాలీ సగటు ధర సుమారు 8% పెరిగిందని క్రిసిల్‌ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ అనాలసిస్‌ నెలవారీ ‘రోటీ రైస్‌ రేట్‌’ నివేదిక వెల్లడించింది. అయితే నాన్‌-వెజిటేరియన్‌ (మాంసాహార) భోజనం ధర తగ్గిందని పేర్కొంది. బ్రాయిలర్‌ కోడిమాంసం ధరలు తగ్గడమే ఇందుకు కారణం.

  • రోటీ, కూరగాయలు (టమోటాలు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు), అన్నం, పప్పు, పెరుగు, సలాడ్‌తో కూడిన వెజ్‌ థాలీ సగటు ధర 2023 ఏప్రిల్‌లో రూ.25.4 ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.27.4కు చేరింది. ఈ ఏడాది మార్చి నాటి రూ.27.3తో పోల్చినా స్వల్పంగా పెరిగింది. ఉల్లిపాయల ధర 41%, టమోటాలు 40%, బంగాళాదుంపలు 38%, బియ్యం 14%, పప్పులు 20% ప్రియమవ్వడమే ఇందుకు నేపథ్యం. అయితే జీలకర్ర, మిరప, వంటనూనెల ధర వరుసగా 40%, 31%, 10% తగ్గడంతో వెజ్‌ థాలీ ధర మరీ ఎక్కువ పెరగలేదు.
  • నాన్‌-వెజ్‌ థాలీలో పప్పు స్థానంలో చికెన్‌ ఉంటుంది. గత నెలలో దీని సగటు ధర రూ.56.3గా నమోదైంది. 2023 ఏప్రిల్‌లో ఇది రూ.58.9గా ఉంది. ఈ ఏడాది మార్చి నాటి రూ.54.9తో పోలిస్తే మాత్రం ఏప్రిల్‌లో ధర పెరిగింది. బ్రాయిలర్‌ ధర 12% తగ్గడంతో (50% వెయిటేజీ దీనిదే) నాన్‌-వెజ్‌ థాలీ ధర వార్షిక ప్రాతిపదికన తగ్గింది. బ్రాయిలర్‌ ధర 4% పెరగడంతో,  ఈ ఏడాది మార్చి కంటే ఏప్రిల్‌లో నాన్‌వెజ్‌ థాలీ ధర 3% పెరిగిందని నివేదిక తెలిపింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని