8% వృద్ధికే అధిక అవకాశం

గత ఆర్థిక సంవత్సరానికి (2023-24) భారత జీడీపీ వృద్ధి 8 శాతంగా నమోదయ్యేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్‌ తెలిపారు.

Published : 09 May 2024 01:57 IST

2023-24పై సీఈఏ అంచనా

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరానికి (2023-24) భారత జీడీపీ వృద్ధి 8 శాతంగా నమోదయ్యేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్‌ తెలిపారు. మూడు త్రైమాసికాల్లో బలమైన వృద్ధి నమోదుకావడం ఇందుకు దోహదం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. 2023-24 మొదటి త్రైమాసికంలో 7.8%, రెండో త్రైమాసికంలో 7.6%, మూడో త్రైమాసికంలో 8.4% వృద్ధి నమోదైన సంగతి తెలిసిందే. ‘2023-24కు 7.8% వృద్ధిని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. అయితే తొలి మూడు త్రైమాసికాల్లోని వృద్ధి రేటును పరిగణనలోకి తీసుకుంటే, పూర్తి ఆర్థిక సంవత్సరానికి 8% వృద్ధి రేటు నమోదయ్యే అవకాశాలు కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నాయ’ని ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ నాగేశ్వరన్‌ తెలిపారు. ఆర్‌బీఐ అంచనా వేసిన 7.5%  కంటే ఇది ఎక్కువ.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటును ఐఎంఎఫ్‌ 6.8%, ఆర్‌బీఐ 7 శాతంగా అంచనా వేశాయి. ఆర్‌బీఐ అంచనానే నిజమైతే.. కొవిడ్‌-19 పరిణామాల తర్వాత అంటే 2021-22 నుంచి వరుసగా నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో 7 శాతానికి మించి వృద్ధి రేటు నమోదైనట్లు అవుతుందని నాగేశ్వరన్‌ తెలిపారు. ఇది వాతావరణ పరిస్థితులపై ఎక్కువగా ఆధారపడి ఉంటుందని తెలిపారు. 2024-25 తర్వాత నుంచి భారత్‌ వృద్ధి రేటు 6.5- 7% మధ్య నమోదుకావచ్చని ఆయన విశ్లేషించారు. స్థిరాస్తి రంగం వైపు పెట్టుబడులు మళ్లిస్తుండటం వల్లే, ఆర్థిక పథకాల్లో కుటుంబాల పొదుపు తగ్గుతోందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని