ఆద్యంతం ఒడుదొడుకులే

ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో సూచీలు బుధవారం స్తబ్దుగా ముగిశాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాలతో ప్రైవేట్‌ బ్యాంకులు, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి.

Published : 09 May 2024 01:59 IST

సమీక్ష

ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో సూచీలు బుధవారం స్తబ్దుగా ముగిశాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాలతో ప్రైవేట్‌ బ్యాంకులు, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. సార్వత్రిక ఎన్నికల 3 దశల్లో ఓటింగ్‌శాతం తక్కువగా నమోదైందనే వార్తల నడుమ, విదేశీ అమ్మకాలు కొనసాగడమూ ఇందుకు తోడైంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి పైసా తగ్గి  83.52 వద్ద స్థిరపడింది. బ్యారెల్‌ ముడిచమురు 1.65% తగ్గి 81.79 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో సియోల్‌ లాభపడగా, మిగతావి నష్టపోయాయి. ఐరోపా సూచీలు మెరుగ్గా ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 73,225 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. అనంతరం కోలుకుని లాభాల్లోకి వచ్చిన సూచీ, 73,684.93 వద్ద గరిష్ఠాన్ని తాకింది. ఆఖర్లో మళ్లీ అమ్మకాలు రావడంతో 45.46 పాయింట్ల నష్టపోయి 73,466.39 వద్ద ముగిసింది. నిఫ్టీ ఎటువంటి మార్పులేకుండా 22,302.50 దగ్గర స్థిరపడింది. 

  • మార్చి త్రైమాసికంలో లాభం 22.75% తగ్గడంతో వోల్టాస్‌ షేరు ఇంట్రాడేలో 9.13% కోల్పోయి రూ.1,261.65 వద్ద కనిష్ఠానికి చేరింది. చివరకు 4.99% నష్టంతో 1,319.10 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.2,294.68 కోట్లు తగ్గి రూ.43,647.01 కోట్లుగా నమోదైంది.
  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 15 నీరసించాయి. ఏషియన్‌ పెయింట్స్‌ 2.31%, అల్ట్రాటెక్‌ 1.76%, హెచ్‌యూఎల్‌ 1.65%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.61%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.29%, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.05%, ఇన్ఫోసిస్‌ 0.93% నష్టపోయాయి. టాటా మోటార్స్‌ 2.43%, పవర్‌గ్రిడ్‌ 2.25%, ఎన్‌టీపీసీ 1.89%, ఎల్‌ అండ్‌ టీ 1.53%, మారుతీ 1.41%, నెస్లే 1.19%, రిలయన్స్‌ 1.18% లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో ఐటీ 0.57%, బ్యాంకింగ్‌ 0.38%, టెక్‌ 0.29% పడ్డాయి. ఇంధన, పరిశ్రమలు, యుటిలిటీస్‌, వాహన, లోహ, విద్యుత్‌, సేవలు రాణించాయి.
  • నూలు, పత్తి బేళ్లు సరఫరా చేసే పియోటెక్‌ ఇండస్ట్రీస్‌ ఐపీఓ ఈనెల 10న ప్రారంభమై 14న ముగియనుంది. ఒక్కో షేరు ధరను రూ.94గా నిర్ణయించారు. ఐపీఓ ద్వారా కంపెనీ రూ.14.47 కోట్లు సమీకరించనుంది. ఐపీఓ అనంతరం కంపెనీ షేర్లు బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌పై నమోదుకానున్నాయి. రిటైల్‌ మదుపర్లు కనీసం 1200 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి.
  • భారత్‌లో అగ్రగామి పసిడి శుద్ధి సంస్థ తమ ప్లాట్‌ఫామ్‌పై పసిడి ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌ ప్రారంభించినట్లు బీఎస్‌ఈ విభాగమైన ఇండియా ఇంటర్నేషనల్‌ ఎక్స్ఛేంజీ (ఇండియా ఐఎన్‌ఎక్స్‌) వెల్లడించింది. పసిడి శుద్ధి సంస్థ పేరును ఎక్స్ఛేంజీ తెలపలేదు.
  • కేరళకు చెందిన ఏఆర్‌ఎంసీ ఐవీఎఫ్‌ ఫెర్టిలిటీ సెంటర్‌ను సీకే బిర్లా గ్రూప్‌ సంస్థ బిర్లా ఫెర్టిలిటీ అండ్‌ ఐవీఎఫ్‌, వెల్లడించని మొత్తానికి కొనుగోలు చేసింది. తద్వారా దక్షిణాది విపణిలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం బిర్లా ఫెర్టిలిటీకి దేశవ్యాప్తంగా 30 కేంద్రాలు ఉన్నాయి. తాజా కొనుగోలుతో ఇవి 37కు చేరాయి.
  • కొత్త కనిష్ఠాలకు పేటీఎం షేరు: వరుసగా మూడో రోజూ పేటీఎం షేర్లు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. కంపెనీ అధ్యక్షుడు, చీఫ్‌ ఆపరేటింగ్‌ అధికారి భవేశ్‌ గుప్తా రాజీనామా చేయడమే ఇందుకు నేపథ్యం. బుధవారం 5% క్షీణించిన షేరు రూ.317.45 వద్ద జీవనకాల కనిష్ఠాన్ని తాకి, అక్కడే ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.20,180.46 కోట్లకు పరిమితమైంది. గతేడాది అక్టోబరు 20న రూ.998.30 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకిన షేరు, అక్కడి నుంచి 68% క్షీణించింది. గత మూడు రోజుల్లో షేరు 14% కోల్పోయింది. 2021 నవంబరులో షేరు రూ.2150 చొప్పున విక్రయించడం ద్వారా, పబ్లిక్‌ ఇష్యూలో రూ.18,300 కోట్లను పేటీఎం సమీకరించింది. అదే నెల 18న స్టాక్‌ఎక్స్ఛేంజీల్లో నమోదు సమయం నాటి రూ.1961.05 ధరే ఇప్పటివరకు గరిష్ఠం. ఈ ఏడాది ఫిబ్రవరి 16న నమోదైన రూ.318.35 ఇంతకుముందు వరకు కనిష్ఠం
  • బీఓబీ వరల్డ్‌ యాప్‌పై ఆంక్షల తొలగింపు: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు చెందిన ‘బీఓబీ వరల్డ్‌’ యాప్‌ ద్వారా కొత్త వినియోగదారులను చేర్చుకోకుండా గతంలో విధించిన ఆంక్షలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) బుధవారం తొలగించింది. నియంత్రణపరమైన ఉల్లంఘనల కారణంగా 2023 అక్టోబరు 10న ఈ ఆంక్షలను ఆర్‌బీఐ విధించింది.
  • ఇండీజీన్‌ ఐపీఓ చివరి రోజు ముగిసేసరికి 69.71 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 2,88,66,677 షేర్లను ఆఫర్‌ చేయగా, 2,01,22,03,281 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. క్యూఐబీ విభాగంలో 197.55 రెట్లు, ఎన్‌ఐఐల నుంచి 54.75 రెట్లు, రిటైల్‌ మదుపర్ల నుంచి 7.68 రెట్ల స్పందన దక్కింది.
  • పెట్రోరసాయనాలు, హైడ్రోజన్‌ తయారీ కార్యకలాపాలు సాగిస్తున్న అనుబంధ సంస్థ రిలయన్స్‌ కెమికల్స్‌ అండ్‌ మెటీరియల్స్‌ను రూ.31.48 కోట్లకు కొనుగోలు చేసినట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది.

నేటి బోర్డు సమావేశాలు: ఎస్‌బీఐ, ఏషియన్‌ పెయింట్స్‌, బీపీసీఎల్‌, ఐఓబీ, హెచ్‌పీసీఎల్‌, అబాట్‌ ఇండియా, ఎస్కార్ట్స్‌ కుబోటా,  కేర్‌ రేటింగ్స్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని