బ్లూస్టార్‌ శ్రీసిటీ ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభం

ఏసీలు ఉత్పత్తి చేసే సంస్థ బ్లూస్టార్‌, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో కొత్తగా నిర్మించిన ప్లాంటులో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించింది. 26.5 ఎకరాల్లో రూ.350 కోట్ల పెట్టుబడితో దీన్ని నిర్మించారు.

Published : 07 Feb 2023 02:07 IST

రూ.350 కోట్లతో ఏర్పాటు
అత్యాధునిక ఏసీల తయారీ

ఈనాడు, హైదరాబాద్‌: ఏసీలు ఉత్పత్తి చేసే సంస్థ బ్లూస్టార్‌, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో కొత్తగా నిర్మించిన ప్లాంటులో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించింది. 26.5 ఎకరాల్లో రూ.350 కోట్ల పెట్టుబడితో దీన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ ప్లాంటుకు ఏటా 3 లక్షల ఇన్వర్టర్‌ ఏసీలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉండగా, భవిష్యత్తులో 12 లక్షల ఏసీలు తయారు చేసే విధంగా సామర్థ్యాన్ని విస్తరిస్తారు. ఇందుకు మరో రూ.200 కోట్లు పెట్టుబడి పెడతారు. ఈ ప్లాంటును అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించినట్లు బ్లూస్టార్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బి.త్యాగరాజన్‌ తెలిపారు. పూర్తి ఆటోమేషన్‌తో పాటు సౌర విద్యుత్తు యూనిట్‌, నీటి సంరక్షణ వ్యవస్థ ఇక్కడ ఉన్నాయని అన్నారు. దీనికి ఐజీబీసీ గోల్డ్‌ రేటింగ్‌ కోసం దరఖాస్తు చేసినట్లు వెల్లడించారు. ఈ ప్లాంటులో ప్రస్తుతం 750 మందికి ఉద్యోగాలు లభిస్తాయని, విస్తరణ తర్వాత ఉద్యోగుల సంఖ్య 2,000కు పెరుగుతుందని అన్నారు.

కొత్త మోడల్‌ ఏసీలు

వచ్చే వేసవి సీజన్‌ కోసం ప్రాథమిక, ప్రీమియం, అధిక ప్రీమియం శ్రేణి ఏసీలను వినియోగదార్లకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు బ్లూస్టార్‌ తెలియజేసింది. మొత్తం 75 మోడళ్లను ఆవిష్కరించినట్లు పేర్కొంది.  రూ.29,990 ప్రారంభ ధర నుంచి ఇవి లభిస్తాయని, 3-స్టార్‌ నుంచి 5-స్టార్‌ ఇన్వర్టర్‌ స్ల్పిట్‌ ఏసీలు ఇందులో ఉన్నట్లు వెల్లడించింది. కన్వర్టబుల్‌ కూలింగ్‌, నానో బ్లూ ప్రోటెక్ట్‌ టెక్నాలజీ, హైడ్రోఫిలిక్‌ బ్లూఫిన్‌ కోటింగ్‌, ఇంధన పొదుపు లాంటి ప్రత్యేకతలతో ఏసీలను రూపొందించినట్లు వివరించింది. తమ ‘హెవీ డ్యూటీ’ ఏసీలు 56 డిగ్రీల సెంటీగ్రేడు ఉష్ణోగ్రతలోనూ పనిచేస్తాయని తెలియజేసింది. నివాస ప్రాంతాలకు అనువైన ఏసీలను 2011 నుంచి బ్లూస్టార్‌ ఉత్పత్తి చేస్తోంది. 2025 నాటికి ఈ విభాగంలో 15% వాటా సంపాదించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దీనికి తగ్గట్లుగా రిటైల్‌ స్టోర్లలో విక్రయాలు నిర్వహించటంతో పాటు ఆన్‌లైన్‌ అమ్మకాలను పెంపొందించుకునే ప్రయత్నాలు చేస్తోంది.

రెండవ యూనిట్‌ 

వాణిజ్య ఏసీల ఉత్పత్తి, కూలింగ్‌ సేవల యూనిట్ల తయారీ నిమిత్తం శ్రీసిటీలోనే రెండవ యూనిట్‌ను బ్లూస్టార్‌ ఏర్పాటు చేయనుంది. దాదాపు రూ.250 కోట్లు పెట్టుబడి దీనికి అవసరం అవుతుంది. రెండవ యూనిట్‌ కోసం, ప్రస్తుత ప్లాంటు సమీపంలోనే 40 ఎకరాల స్థలాన్ని సేకరించనున్నారు. రెండవ యూనిట్‌ నిర్మాణ పనులను వచ్చే ఏడాదిలో చేపట్టాలని భావిస్తున్నట్లు త్యాగరాజన్‌ తెలిపారు. కేవలం మెట్రో నగరాలకు మాత్రమే పరిమితం కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, చిన్న- మధ్యస్థాయి పట్టణాల్లోని వినియోగదార్లకు సైతం బ్లూస్టార్‌ ఉత్పత్తులను దగ్గర చేయాలనేది తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని