లాభాల స్వీకరణతో నష్టాలు

నాలుగు రోజుల సూచీల వరుస లాభాలకు అడ్డుకట్ట పడింది. బలహీన అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో బ్యాంకింగ్‌, ఇంధన, లోహ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు.

Published : 01 Jun 2023 02:33 IST

సమీక్ష

నాలుగు రోజుల సూచీల వరుస లాభాలకు అడ్డుకట్ట పడింది. బలహీన అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో బ్యాంకింగ్‌, ఇంధన, లోహ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. జీడీపీ గణాంకాలు విడుదల కానుండటం ఇందుకు నేపథ్యం. డాలర్‌తో పోలిస్తే రూపాయి 8 పైసలు తగ్గి 82.75 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 1.33% నష్టపోయి 72.53 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగియగా, ఐరోపా సూచీలు డీలాపడ్డాయి.

సెన్సెక్స్‌ ఉదయం 62,839.97 పాయింట్ల వద్ద బలహీనంగా ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కదలాడిన సూచీ.. ఇంట్రాడేలో 62,401.02 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 346.89 పాయింట్ల నష్టంతో 62,622.24 వద్ద ముగిసింది. నిఫ్టీ 99.45 పాయింట్లు కోల్పోయి 18,534.40 పాయింట్ల దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 18,483.85- 18,603.90 పాయింట్ల మధ్య కదలాడింది.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 19 నష్టపోయాయి. యాక్సిస్‌ బ్యాంక్‌ 2.44%, ఎస్‌బీఐ 2.07%, హెచ్‌డీఎఫ్‌సీ 1.98%, రిలయన్స్‌ 1.77%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.57%, ఎన్‌టీపీసీ 1.56%, టాటా స్టీల్‌ 1.21%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.08% చొప్పున డీలాపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్‌ 4.78%, ఏషియన్‌ పెయింట్స్‌ 1.74%, టెక్‌ మహీంద్రా 1.70%, సన్‌ఫార్మా 1.60%, టాటా మోటార్స్‌ 1.47%, కోటక్‌ బ్యాంక్‌ 1.07% లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో ఇంధన 1.20%, లోహ 1.16%, చమురు-గ్యాస్‌ 1.04%, యుటిలిటీస్‌ 1%, ఆర్థిక సేవలు 0.68% మేర పడ్డాయి. టెలికాం 2.15%, స్థిరాస్తి 0.73%, మన్నికైన వినిమయ వస్తువులు 0.73%, టెక్‌ 0.72% రాణించాయి. బీఎస్‌ఈలో 1796 షేర్లు నష్టాల్లో ముగియగా, 1717 స్క్రిప్‌లు లాభపడ్డాయి. 132 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.

* యూకో బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా అశ్వనీ కుమార్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత ఎండీ సోమ శంకర ప్రసాద్‌ స్థానాన్ని ఆయన భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం కుమార్‌ ఇండియన్‌ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. జూన్‌ 1 లేదా ఆ తరవాత బాధ్యతలు స్వీకరించే తేదీ నుంచి మూడేళ్ల కాలానికి కుమార్‌ ఎండీగా ఉంటారు.

* కనీస ప్రజా షేర్‌హోల్డింగ్‌ నిబంధనలను అందుకునేందుకు జూన్‌లో 6 శాతం వాటాను సంస్థాగత మదుపర్లకు విక్రయించేందుకు పతంజలి ఫుడ్స్‌ ప్రమోటర్లు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రోడ్‌షోలను ప్రారంభించామని, అంతర్జాతీయ పెట్టుబడిదార్ల నుంచి మంచి స్పందన వస్తున్నట్లు ప్రమోటర్‌ బాబా రామ్‌దేవ్‌ తెలిపారు.

* ఒక కంపెనీ లేదా ఒక గ్రూప్‌ సంస్థలో ఎక్కువ వాటా ఉన్న హై-రిస్క్‌ విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐ) నుంచి అదనపు వివరాలను తప్పనిసరి చేసే ప్రతిపాదనను సెబీ తీసుకొచ్చింది. భారత స్టాక్‌ మార్కెట్లలో పారదర్శకత పెంచే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది.  కనీస ప్రజా షేర్‌హోల్డింగ్‌ (ఎంపీఎస్‌) నిబంధనలను పాటించే విధంగా చూడటం, భారత కంపెనీలను ఎఫ్‌పీఐ మార్గంలో టేకోవర్‌ చేసే విధానం దుర్వినియోగం కాకుండా చూడటమే ఈ ప్రతిపాదనల లక్ష్యమని సెబీ సంప్రదింపుల పత్రంలో పేర్కొంది. అదానీ షేర్లలో కొన్ని విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులకు సంబంధించి, అసలైన లబ్ధిదారులను సెబీ గుర్తించలేకపోవడం కూడా తాజా నిబంధనలు తీసుకురావడానికి కారణంగా తెలుస్తోంది.

* సెయిల్‌ ఛైర్మన్‌గా అమరేందు ప్రకాశ్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 30న పదవీ విరమణ చేసిన సోమ మోండల్‌ స్థానాన్ని ఆయన భర్తీ చేయనున్నారు. 1991లో సెయిల్‌లో చేరిన ప్రకాశ్‌.. పలు కీలక బాధ్యతలు నిర్వహించారు.
నీ గాయత్రి షుగర్స్‌ షేరు ధరలో అవకతవకలకు పాల్పడినందుకు 16 సంస్థలకు కలిపి రూ.77 లక్షల జరిమానాను సెబీ విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని